మరో 150ఏళ్లు ఏలుకోవడానికేనా: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంతం వారికి ఇరవై ఏళ్లపాటు రాష్ట్ర సీఎం పదవిని పూర్తిగా అప్పగిస్తామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అంగీకరించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం అసెంబ్లీ లాబీల్లో తెలంగాణ ప్రాంత మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను కొందరు తెలంగాణ నేతలే తనకు ఇంతకు ముందు చెప్పారని, తాము కూడా అందుకు సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. దీనిపై పొన్నాల స్పందిస్తూ 20 ఏళ్లు మాకు సీఎం పదవి ఇచ్చి ఆ తర్వాత మరో 150 ఏళ్లు మీరే ఏలుకోవడానికేనా ఈ ప్రతిపాదన అని ప్రశ్నించారు.
నాతోపాటు మరో ఆరుగురు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతారు
‘విభజన నిర్ణయాన్ని పక్కనపెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని కేంద్రం ప్రకటిస్తే మేమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం. అసెంబ్లీలో విభజన బిల్లును ఓడించాక కూడా కేంద్రం తెలంగాణ ఏర్పాటు దిశగా ముందుకెళితే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతాం. నాతోపాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడతారు. ఏ పార్టీలోకి వెళతామనేది అప్రస్తుతం.’ అని గంటా అసెంబ్లీ ఆవరణలో అన్నారు.