గుంటూరు: ర్యాగింగ్కు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ర్యాగింగ్ చేసిన వారిని ఏ కాలేజీలో చదవకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 22వ తేదీన జరగనున్న కేబినెట్ సమావేశంలో ర్యాగింగ్ అంశంపై చర్చిస్తామని వెల్లడించారు. శనివారం గుంటూరు జిల్లా నాగార్జున నగర్లోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వచ్చిన గంటా శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడారు.
నాగార్జున యూనివర్శిటీలో పరిపాలన గాడి తప్పిందన్నారు. క్యాంపస్లోని హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల విద్యార్థిని రుషికేశ్వరి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ముద్దాయిలు తప్పించుకుంటున్నారని తనకు సమాచారం అందిందని... ఈ నేపథ్యంలో స్వయంగా విచారించాలని తానే వచ్చినట్లు గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ర్యాగింగ్ నిరోధానికి ఆంధ్రప్రదేశ్లో నిర్భయ కంటే పదునైన చట్టాన్ని తయారు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. యూనివర్శిటీలోని కుల సంఘాల బోర్డులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని గంటా శ్రీనివాసరావు యూనివర్శిటీ ఉన్నతాధికారులును ఆదేశించారు. అలాగే రుషికేశ్వరి ఆత్మహత్య ఘటనపై వారంలోగా విచారణ కమిటీలు నివేదికలు అందిస్తాయని గంటా శ్రీనివాసరావు చెప్పారు.
నాగార్జున యూనివర్శిటీలో ఇంజనీరింగ్ విద్యార్థిని రుషికేశ్వరి ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో విచారణకు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు కమిటీ సభ్యులు శనివారం నాగార్జున యూనివర్శిటీకి వచ్చారు. వారు రుషికేశ్వరి తల్లిదండ్రులు, యూనివర్శిటీ అధికారులు, పోలీసులతో సమావేశమవుతారు.
'ఇక ర్యాగింగ్ కు పాల్పడితే ఖబడ్ధార్'
Published Sat, Jul 18 2015 2:24 PM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM
Advertisement