ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేశారు. 62.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 4,61,932 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, బాలుర ఉత్తీర్ణత శాతం 59 గాను, బాలికల ఉత్తీర్ణత శాతం 67 గాను నమోదైంది. ఎప్పటిలాగే బాలుర కంటే బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణులయ్యారు. జనరల్లో 52.13 శాతం మందికి ఎ గ్రేడ్, 24.08 శాతం మంది బి గ్రేడ్, 13 శాతం మంది సి గ్రేడ్, 6.10 శాతం మంది డి గ్రేడ్లో పాసయ్యారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. కృష్ణాజిల్లా (76 శాతం) అగ్రస్థానంలో నిలిచింది. వైఎస్ఆర్ కడప (59 శాతం) జిల్లా చిట్టచివరి స్థానంలో ఉంది. వచ్చే సంవత్సరానికి అక్కడ ఫలితాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నం చేస్తామని గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఒకేషనల్లో 60 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పూర్తి మార్కులతో కూడిన ఫలితాలకు ఇక్కడ క్లిక్ చేయండి.