డీఎస్సీ-1998, 2008 పరీక్షల్లో అర్హత సాధించి పోస్టులు పొందని అభ్యర్థులకు న్యాయస్థానాల ఆదేశాలను అనుసరించి నియామకాలు కల్పించే అంశంపై ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ దృష్టి పెట్టింది.
పాఠశాల విద్యాశాఖ నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ-1998, 2008 పరీక్షల్లో అర్హత సాధించి పోస్టులు పొందని అభ్యర్థులకు న్యాయస్థానాల ఆదేశాలను అనుసరించి నియామకాలు కల్పించే అంశంపై ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ దృష్టి పెట్టింది. ఈ రెండు డీఎస్సీల క్వాలిఫైడ్ అభ్యర్థులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. ఆయా అభ్యర్థులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు అధికారులను పలుమార్లు కలసి వినతిపత్రాలు అందించారు. దీనిపై పాఠశాల విద్యాశాఖ కార్యదర్శికి కమిషనర్ నివేదిక సమర్పించారు.
సోమవారం విద్యాశాఖ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తేనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి నియామకాలపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖవర్గాలు వివరించాయి. హైస్కూళ్లలో పనిచేస్తున్న పండిట్, పీఈటీల అప్‌గ్రెడేషన్ సమస్యను కూడా చర్చించనున్నారు. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఈ ఫైలును ఆమోదింపచేయనున్నారని మంత్రి గంటా కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.