సాక్షి, హైదరాబాద్ : జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. దీంతో అక్కడ నుంచి బరిలోకి దిగాలని చూస్తున్న పీసీపీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా కోదండరాం జనగామ నుంచి బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ కూడా తన తొలి జాబితాలో జనగామ అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో అక్కడ నుంచి కోదండరాం బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా తాను జనగామ పోటీ నుంచి తప్పుకుంటున్నాని కోదండరాం పేర్కొన్నారు.
బీసీ సీటు తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయనే భావనతో జనగామ పోటీ నుంచి కోదండరాం తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ నుంచి బరిలోకి దిగాలని చూస్తున్న పీసీపీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు లైన్‌క్లియర్ అయింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ నియోజకవర్గ సీటును తనకే కేటాయించాలని పొన్నాల మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. కోదండరాం తప్పుకోవడంతో కాంగ్రెస్ జనగామ టికెట్‌ను పొన్నాలకు కేటాయించే అవకాశం ఉంది.
కాగా కోదండరాం ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి తరపున ప్రచారం చేస్తారని తెలుస్తోంది. కానీ ఈ విషయంపై కోదండ రాం ఎలాంటి ప్రకటన చేయలేదు. తన పోటీపై ఇప్పుడేమి మాట్లాడని కోదండరాం మంగళవారం మీడియాతో చెప్పారు. ఎక్కడ నుంచి పోటీ చేసేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. టీజేఎస్ కు మొత్తం 11 సీట్లు ఖరారయ్యాయని కోదండరాం పేర్కొన్నారు. మల్కాజ్‌గిరి, మెదక్, దుబ్బాక, సిద్ధిపేట, వర్ధన్నపేట, అంబర్‌పేట సీట్లను టీజేఎస్‌కు కేటాయించారన్నారు. మరో ఐదు సీట్ల విషయంలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. టీజేఎస్ సీట్లను బుధవారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment