jangoan
-
రాజయ్య Vs కడియం: ‘ఎవరో ఒక్కరే ఉండాలి అంటూ..’
సాక్షి, జనగామ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయం మరోసారి వేడెక్కింది. కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి, బీఆర్ఎస్ నేత రాజయ్య మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా శ్రీహరి వ్యాఖ్యలపై రాజయ్య స్పందిస్తూ ప్రతి సవాల్ విసిరారు. నియోజకవర్గంలో నువ్వో నేనో మిగలాలి అంటూ సంచలన కామెంట్స్ చేశారు.సీనియర్ నేతలు కడియం, రాజయ్య మధ్య రాజకీయం మరోసారి పీక్ స్టేజ్‌కు చేరుకుంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నువ్వైనా ఉండాలి.. నేనైనా ఉండాలి అంటూ కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై తాటికొండ రాజయ్య స్పందించారు. ఈ క్రమంలో రాజయ్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కడియం సవాలును స్వీకరిస్తున్నాను. కడియం శ్రీహరి స్థానికేతరుడు. దళిత వ్యతిరేకి. ఆయన్ను పర్వతగిరి పంపించే వరకు నేను నిద్రపోను. నియోజకవర్గంలో నువ్వో నేనో.. ఎవరో ఒక్కరే మిగలాలి.కడియం శ్రీహరి అవినీతి చిట్టా మొత్తం బయట పెడతాను. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీ అల్లుడ్ని అడ్డం పెట్టుకొని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో భూములు కబ్జా చేస్తున్నది నిజం కాదా?. నీ భూ కబ్జాలు నిరూపించడానికి నేను సిద్ధం. నువ్వు నిజంగా సత్య హరిశ్చంద్రుడివి అయితే నీ బిడ్డను ఎంపీ చేయడానికి రూ.100 కోట్లు ఎలా ఖర్చు పెట్టావు?. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. శ్రీహరికి నాకు పోటీనే లేదు. నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. కడియం శ్రీహరి ప్రజానాయకుడు కాదు.. రాజకీయ నాయకుడు మాత్రమే’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
దారి ఇలా.. పాఠశాలకు వెళ్లేది ఎలా?
జనగామ జిల్లా, చిల్పూరు: దారి ఇలా ఉంటే తాము పాఠశాలకు ఎలా వెళ్లేదంటూ విద్యార్థులు సోమవారం నిరసన చేపట్టగా తల్లిదండ్రులు, నాయకులు సహకరించారు. మండలంలోని ఫత్తేపూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదివే విద్యార్థులు వెళ్లే రహదారిలో గ్రామంలోని మురుగు నీరు పాఠశాల సమీపంలో నిలుస్తోంది.చిరుజల్లులకే కుంటలా మారుతోంది. గతంలో గ్రామ ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే పాఠశాల వద్ద ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదుగతంలో ఎన్నో సార్లు అధికారులకు విన్నవించాం. అయినా పట్టించుకోవడం లేదు. మన ఊరు మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాల అంటూ పనులు చేస్తున్నారే తప్ప పాఠశాలకు పిల్లలు వచ్చే రోడ్డు ఎందుకు పట్టించుకోరు. త్వరగా సమస్య తీర్చాలి.– బానోత్ బాలరాజు, గ్రామస్తుడుబురదలోనే నడుస్తున్నాంప్రతీ రోజు చెప్పులు చేతపట్టుకుని బురదలో నడిచి పాఠశాలకు వెళ్తున్నాం. మధ్యాహ్న భోజనం తినే సమయంలో వాసన భరించలేక పోతున్నాం. అధికారులు స్పందించాలి.– హరిప్రసాద్, విద్యార్థిఒక్కోసారి బురదలో జారిపడుతున్నాం..పుస్తకాల బ్యాగుతో నడిచి వస్తుంటే ఒక్కోసారి జారి బురదలో పడుతున్నాం. దీంతో తిరిగి ఇంటికి వెళ్తుంటే ఆ వాసన భరించలేక వాంతులు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. మా బడి వరకు రోడ్డు నిర్మించాలి.– సాత్విక, విద్యార్థిని -
బీఆర్ఎస్ నుంచి డబ్బు తీసుకుంది నిరూపిస్తే దేనికైనా రెడీ: కడియం
సాక్షి, జనగామ: ఎవరు ఎన్ని కుట్రలు, కుయుక్తులు చేసినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కావ్య విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. తమకు బీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇచ్చినట్టు నిరూపిస్తే తాము ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు. కాగా, కడియం స్టేషన్ ఘన్‌పూర్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము రూ.10కోట్లు తీసుకున్నామని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది నిజమని ఎలాంటి ఆధారాలు చూపించినా, నిరూపించినా మేము ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటాము. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కావ్య గెలుపు ఖాయమైంది. సీఎం రేవంత్ ఆశీర్వాదంతో నేను వరంగల్‌ను అభివృద్ధి చేస్తాను. బీజేపీ వాళ్ళు రాజ్యాంగం మీద అవగాహన లేక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. చేసిన పని చెప్పడానికి ఏమీ లేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నా కూతురు కావ్య ఇక్కడే పుట్టింది, ఇక్కడే కడియం ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమలు చేసింది. 2017లో ఐదుగురు జడ్జిల ధర్మసానం భారతదేశంలో మతం మారినంత మాత్రాన కులం మారదు అని తెలిపింది. పిల్లలకు తండ్రి కులం వర్తిస్తుంది. కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాను. నా 30ఏళ్ల రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. నా నిజాయితే నాకు పెట్టుబడి. నేను ఏ పార్టీకి వెన్ను పోటు పొడవలేదు. కానీ నా ద్వారా ఎదిగిన ఆరూరి రమేష్ నాకు వెన్నుపోటు పొడిచాడు. నేను ఛాలెంజ్ చేస్తున్న నీదగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నానా చెప్పాలి. 2014, 2018లో నీ గెలుపు కోసం నేను ప్రచారం చేసాను. నువ్వు చేసిన భూకబ్జాల కారణంగా ఓడిపోయావు. ఓటమి భయంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మందకృష్ణ నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఒక్క నాపై మాత్రమే ఎందుకు విమర్శలు చేస్తున్నావు. నాది మాదిగ ఉప కులం. మాదిగలకు ద్రోహం చేస్తున్నది మందకృష్ణ. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం అంటున్నా పార్టీకి ఓటు వేయమని ఎలా చెపుతున్నావు. దీనికి సమాధానం చెప్పాలి. నీ నాయకత్వం సరిగా లేకపోవడం వల్లనే ఎంఆర్‌పీఎస్‌లో చీలికలు వచ్చాయి అంటూ విమర్శలు చేశారు. -
ఫలించిన కేటీఆర్ ప్లాన్.. సీనియర్ నేతకు టికెట్ ఫిక్స్
సాక్షి, వరంగల్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. కాగా, ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగింది. అయితే, బీఆర్ఎస్లో సీట్ల పంచాయితీపై ఇంకా కోల్డ్‌వార్ నడుస్తూనే ఉంది. టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు సందర్భంగా దొరికిన ప్రతీసారి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. నేతల మధ్య సయోధ్య కుదురుస్తున్నారు. ఇందులో భాగంగానే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య కేటీఆర్ సయోధ్య కుదిర్చారు. ఇద్దరు నేతలతో మంత్రి కేటీఆర్ సమావేశమై.. వారితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జనగామ సీటును పల్లా రాజేశ్వర్‌రెడ్డికి కేటాయించడంపై సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడి యాదగిరిరెడ్డితో చర్చించారు. వీరి మధ్య సయోద్య కుదిర్చి జనగామ స్థానాన్ని పల్లాకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ముత్తిరెడ్డికి పార్టీలో తగిన స్థానం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక, జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని స్థానిక నేతలకు కేటీఆర్ సూచించారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపునకు కలిసి పని చేయాలని ముత్తిరెడ్డి సైతం పిలుపునిచ్చారు. మరోవైపు.. జనగామ సీటు ఖరారు కావడంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి నేడు కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం, అక్కడి నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక, ఇదే జోష్‌లో ఈనెల 16న కేసీఆర్ నేతృత్వంలో జనగామలో భారీ బహిరంగ సభను ప్లాన్ చేశారు. ఈ సభ ఏర్పాట్లను నేడు మంత్రి హరీష్ రావుతో కలిసి పల్లా పర్యవేక్షించనున్నారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ వైపు.. తండ్రి కొడుకుల చూపు? -
అసలు కథ ముందుంది.. ఎమ్మెల్యే రాజయ్య షాకింగ్ కామెంట్స్
సాక్షి, జనగామ: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం రాష్ట్రంలో టికెట్ల విషయం కాక రేపుతోంది. మూడు ప్రధాన రాజకీయపార్టీల్లోనూ వేడి పుట్టిస్తోంది. బీఆర్ఎస్లో టికెట్ దక్కని ఆశావహులు అసమ్మతి రాగం ఎత్తుకున్నారు. మరికొందరు నేతలు ఏకంగా పార్టీ నుంచి జంప్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ లభించని ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఝలక్ ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు.. తాజాగా రాజయ్య మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ రాకపోయినా నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటాను. ఎన్నికలకు ఇంకా మూడు నెలలు సమయం ఉంది. ఎవరో వచ్చి ఏదో చేస్తారని అంతా అనుకుంటున్నారు. ఎవరూ రారు.. ఏమీ జరగదు. నా పని ఇప్పుడే అయిపోందని భావించకూడదు అంటూ కీలక కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన ఏం చేస్తారనే టెన్షన్ బీఆర్ఎస్ నేతల్లో నెలకొంది. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే రాజయ్య బుధవారం లింగాలఘనపురం మండలంలో కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. అయితే, చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బీఆర్ఎస్కు చెందిన స్థానిక నేతలు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో నేతల తీరుపై రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చూస్తూ ఊరుకుంటామా.. ఇక, అంతకుముందు కూడా రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ టికెట్ లభించకపోవడంతో అసంతృప్తితో ఉన్న రాజయ్య.. ఆరు నూరైనా ప్రజాక్షేత్రంలో ఉంటానని స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కేటాయించడంపై పరోక్షంగా రాజయ్య మనోవేదన చెందుతున్నారు. ఈ సందర్భగా రాజయ్య మాట్లాడుతూ.. భూమి కొని మొట్లు కొట్టి దుక్కి దున్ని నారు పోసి కలుపుతీసి, పంట పండించి కుప్ప పోశాక కుప్ప మీద వచ్చి ఎవరో కూర్చుంటానంటే ఊర్కుంటామా అంటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. నవ్వుతూ నోరు కొట్టుకున్నారు. దేవుడున్నాడు, దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నాడు.. రేపో మాపో మనం అనుకున్న కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజల కోసమే నేనున్నా, ప్రజల మధ్యలోనే చచ్చిపోతానని తెలిపారు. ఇది కూడా చదవండి: సాగర్ బీఆర్ఎస్లో అంతర్గత పోరు.. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని డిమాండ్ -
నర్సంపేటలో బీఆర్ఎస్పై డబుల్ బెడ్రూం ఎఫెక్ట్?
2018 ఎన్నికల్లో నర్సంపేటలో బీఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన పెద్దిరెడ్డి సుదర్శనరెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి, సిటింగ్ ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డిపై 16949 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సుదర్శనరెడ్డి.. పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా పని చేశారు. 2018లో నర్సంపేట నుంచి పోటీచేసి గెలు పొందారు. మాధవరెడ్డి 2014లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి విజయం సాధించగా, 2018లో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీచేసి ఓడిపోవడం విశేషం. సుదర్శనరెడ్డికి 94135 ఓట్లు రాగా, మాదవరెడ్డికి 77186 ఓట్లు వచ్చాయి. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : నిరుద్యోగ సమస్య. రోడ్లు. డ్రైనేజీ. డ్రింకింగ్ వాటర్. సరియైన గృహవసతులు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు (డబుల్ బెడ్ రూమ్). భూ సమస్యలు. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : వరంగల్ జిల్లాకు ఎడ్యుకేషన్ హబ్‌గా మారిన నర్సంపేట. త్వరలో రాబోతున్న మెడికల్, నర్సింగ్ కళాశాల. ఇప్పటికే ఉన్న రెండు ఇంజనీరింగ్, బీఈడి కళాశాలలు. త్వరలో ప్రారంభం కానున్న 350 పడకల జిల్లా ఆస్పత్రి. ప్రధాన పార్టీల అభ్యర్థులు : బీఆర్ఎస్ పెద్ది సుదర్శన్‌రెడ్డి (కన్ఫాం) కాంగ్రెస్ దొంతి మాధవరెడ్డి (ఆశావాహులు) బీజేపీ రేవూరి ప్రకాశ్‌రెడ్డి (ఆశావాహులు) వృత్తిపరంగా ఓటర్లు రైతులు. వ్యాపారులు. మతం/కులం పరంగా ఓటర్లు బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు భౌగోళిక పరిస్థితులు.. పాఖాల అభయారణ్యం. పర్యాటక కేంద్రంగా పాఖాల సరస్సు. -
కడియంకే టికెట్.. ఘన్‌పూర్‌లో ఉత్కంఠ!
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇద్దరు నేతలు మాత్రమే డిప్యూటీ సీఎంలుగా అయ్యారు. వారిద్దరు కూడా ఇదే నియోజకవర్గానికి చెందిన వారే కావడం విశేషం. తొలి డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య కాగా.. రెండో ఉప ముఖ్యమంత్రి.. కడియం శ్రీహరి. వీళ్లిద్దరూ ఈ నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ విరోధులు. ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉంటూ నువ్వా-నేనా అనే స్థాయిలో పోటీ పడేవారు. కానీ ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. రాజయ్య ప్రస్తుతం ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే.. కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా ఉన్నారు. నియోజకవర్గంలోని రాజకీయ అంశాలు : సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామన్న అధిష్టానం స్టేషన్ ఘనపూర్ విషయంలో తన మాట తప్పింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు కాకుండా.. కడియంకు టికెట్ కట్టబెట్టింది. దాంతో ఇక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి రెండుసార్లు, బీఆర్ఎస్ పార్టీ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో టీడీపీ నుండి కడియం శ్రీహరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత BRSలో చేరి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఏమ్మెల్సిగా ఉప ముఖ్యమంత్రిగా ( విద్యాశాఖ మంత్రి) పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి సింగపురం ఇందిరా, దొమ్మాటి సాంబయ్య ఉన్నారు. బిజేపి నుంచి మాజీ ఎమ్మెల్యే విజయరామారావు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య తెలంగాణా రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి అయ్యారు. అనతి కాలంలోని పదవి పొగొట్టుకుని ఆయన స్థానంలో కడియం శ్రీహారి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ ఇద్దరి మద్య అధికార పార్టీ బిఆర్ఎస్లో టిక్కెట్ వార్ సాగుతుంది. చివరికి ఈ వార్‌లో కడియాన్ని టికెట్ వరించింది. జానకీపురం సర్పంచ్ నవ్య వ్యవహారం ఎమ్మెల్యే రాజయ్య రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, అభివృద్దికి నోచుకోకపోవడం. ధళితబందు పథకంలో కమీషన్ల దందా సాగడం, భూసమస్యలు పరిష్కారం కాకపోవడం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అర్హులకు లభించకపోవడం ప్రధాన పార్టీలోని అభ్యర్థులు : బీఆర్ఎస్ కడియం శ్రీహరి (కన్ఫాం) కాంగ్రెస్ (ఆశావాహులు) సింగపురం ఇందిరా దొమ్మాటి సాంబయ్య బొల్లెపల్లి కృష్ణ బీజేపీ (ఆశావాహులు) డాక్టర్ విజయరామారవు మాదాసు వెంకటేష్ బోజ్జపల్లి సుభాస్ మతం/కులం పరంగా ఓటర్లు : ఎస్సీ ఓటర్లు ఆతర్వాత బిసి ఓటర్లు అధికంగా ఉంటారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు.. నియోజకవర్గం రెండు జిల్లాల కలయికతో ఉంటుంది. జనగామతోపాటు హన్మకొండ జిల్లాలో నియోజకవర్గం ఉంది. బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయం (చిలుపూరు గుట్ట) సీతారామచంద్రస్వామి ఆలయం (జీడికల్) మల్లన్న గండి రిజర్వాయర్, స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్, కిలా షాపూర్, జఫర్గడ్, తాటికొండ కోటలు, కాకతీయుల నాటి 500 పిల్లర్ టెంపుల్ (నిడిగొండ రఘునాథపల్లి మండలం) (పర్యాటకం) ఆకేరు వాగు(ఉప్పుగల్, జాఫర్గడ్ మండలం) -
ఈసారి పాలకుర్తిలో వాడివేడి పోటీ.. అధికార పార్టీపై హాస్తం వ్యూహాలు..!
పాలకుర్తి నియోజకవర్గం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓటమి ఎరుగని నేతగా పేరుతెచ్చుకున్న ఎర్రబెల్లికి ఈసారి చుక్కలు చూపించేందుకు కాంగ్రెస్ బారీ కసరత్తే చేస్తుంది. ఆయనను ఈసారి ఓడించేందుకు కాంగ్రెస్ ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబసభ్యులను బరిలోకి దింపనున్నారు. ఝాన్సీరెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశిస్సులతోపాటు మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి సహకారం ఉంటుంది. మంత్రి ఎర్రబెల్లికి సైతం జనం నుంచి వ్యతిరేక ఉండడంతో నియోజకవర్గానికే పరిమితం అవుతున్నాడు. రాజకీయపరమైన అంశాలు పాలకుర్తి టిఆర్ఎస్ పార్టీ నుండి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికి మూడుసార్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దయాకర్ రావు కలిసి వచ్చే అంశం నియోజకవర్గ ప్రజలతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండడం. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్రీగా నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం. మహిళలకు కుట్టు మిషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఫ్రీగా కుట్టు మిషన్ ఇవ్వడం. మహిళలకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్రీ మిల్స్ ఏర్పాటు చేయడం. జూనియర్ డిగ్రీ కాలేజీలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్రీగా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం కలిసి వచ్చే అంశాలు. కాంగ్రెస్ పార్టీ నుండి అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి , నియోజకవర్గ లోకల్‌గా కలిసి వచ్చే అంశం. ఆమె గతంలో నిరుపేదలకు చేసిన సేవలు కూడా ప్రభావితం చేస్తాయి అని చెప్పవచ్చు. రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న నాయకులు ఆమెతో కలిసి వచ్చే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే నెమరు కొమ్ముల సుధాకర్ రావు ఎమ్మెల్సీ ఇస్తానని ఇవ్వకపోవడంతో తనతో ఉన్న కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు. పాలకుర్తిలో బిజెపి ప్రభావం పెద్దగా చెప్పుకోదగినంత ఏమీ లేదు. గతంలో రెండు సార్లు పెద్దగాని సోమయ్య పోటీ చేశాడు కానీ ఇప్పటివరకు మళ్లీ ఏ వ్యక్తికైనా బిజెపి నుండి అభ్యర్థిగా నిర్ణయించలేదు.. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : పాలకుర్తి నియోజకవర్గం లోకల్ నాన్ లోకల్ అంశం, ఈ ఎలక్షన్లో రెడ్డి సామాజిక వర్గం ప్రభావితం చూపే అవకాశం ఉంది. నాలుగో సారి ఎన్నికల బరిలో మంత్రి దయాకర్ రావు ప్రజల నుంచి సహజంగా వచ్చే వ్యతిరేకత. మూడోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వచ్చే వ్యతిరేకత ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు బీఆర్ఎస్ ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి బీజేపీ పార్టీ పెద్దగాని సోమయ్య వృత్తిపరంగా ఓటర్లు: రైతులు. వ్యాపారులు. మతం/కులాల వారిగా ఓటర్లు: హిందుఓటర్లు అందులో రెడ్డి సామాజికవర్గం ఓట్లు ప్రభావం చూపుతాయి. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: పాలకుర్తి నియోజకవర్గం మూడు జిల్లాలకు విస్తరించి ఉంది. వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. అడవులు లేవు పర్యాటక కేంద్రంగా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ టెంపుల్, వల్మిడి సీతారామచంద్ర స్వామి టెంపుల్, బొమ్మెర పోతన స్మారక మందిరం. -
ఈ సారి పాలకుర్తి నియోజకవర్గ రాజకీయ చరిత్రను మలుపు తిప్పేది ఎవరు..? గత చరిత్ర ఇదే..
పాలకుర్తి నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో చెన్నూరు నియోజకవర్గం రద్దై పాలకుర్తి నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. పాలకుర్తిలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు మరోసారి విజయం సాదించడం ద్వారా ఆయన ఆరు సార్లు గెలిచినట్లయింది. 2014 ఎన్నికలలో టిడిపి పక్షాన గెలిచిన దయాకరరావు ఆ తర్వాత పరిణామాలలో టిఆర్ఎస్లో చేరిపోయారు. తిరిగి ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి జంగా రాఘవరెడ్డిపై 53053 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. తదుపరి ఎర్రబెల్లి ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. దయాకరరావు ఐదుసార్లు టిడిపి పక్షాన, ఒకసారి టిఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే అయ్యారు. ఒకసారి ఎమ్.పిగా కూడా నెగ్గారు. దయాకరరావుకు 117504 ఓట్లు రాగా, రాఘవ రెడ్డికి 64451 ఓట్లు వచ్చాయి.ఇక్కడ ఎస్.ఎఫ్ బి అభ్యర్ధిగా పోటీచేసిన ఎల్. విజయ్‌కు మూడువేలకు పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఎర్రబెల్లి దయాకరరావు 2014 ఎన్నికలనాటికి తెలంగాణ టిడిపి వర్కింగ్ అద్యక్షుడుగా ఉన్నారు. 2014 ఎన్నికలలో తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి, మాజీ ఎమ్మెల్యే డి.శ్రీనివాసరావును 4313 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.సుదాకరరావుకు 52253 ఓట్లు వచ్చాయి. దయాకరరావు అంతకుముందు వర్ధన్నపేటలో మూడుసార్లు గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనలో వర్దన్నపేట రిజర్వుడ్ కావడంతో పాలకుర్తికి మారారు. ఒకసారి లోక్‌సభకు (ఉపఎన్నికలో) గెలుపొందారు. దుగ్యాల శ్రీనివాస రావు గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ తరపున ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఐకి మద్దతు ఇచ్చారు. శ్రీనివాసరావు రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అనర్హతకు గురి అయిన తొమ్మిది మందిలో ఒకరుగా ఉన్నారు. అయితే తీర్పు రావడానికి ఒకరోజు ముందుగానే ఎమ్మెల్యే పదవికి దుగ్యాల రాజీనామా చేశారు. చెన్నూరు నియోజకవర్గం రద్దు కావడంతో దుగ్యాల పాలకుర్తిలో పోటీచేశారు. దయాకరరావు టిడిపి తరపున ప్రభుత్వ విప్‌గా గతంలో పనిచేశారు. సుధాకరరావు గతంలో టిడిపి ఎమ్మెల్యేగా ఒకసారి ఎన్నికయ్యారు. తదుపరి టిఆర్ఎస్లో చేరారు. పాలకుర్తి, అంతకుముందు ఉన్న చెన్నూరు నియోజకవర్గాలలో కలిపి పదమూడు సార్లు వెలమ సామాజికవర్గ నేతలు గెలుపొందితే, ఒకసారి మాత్రం రెడ్డి గెలిచారు. చెన్నూరు(2009లో రద్దు) రద్దయిన చెన్నూరు నియోజకవర్గానికి 12సార్లు ఎన్నికలుజరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి నాలుగుసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి సోషలిస్టు ఒకసారి, పిడిఎఫ్ ఒకసారి గెలిచాయి. ఒక ఇండిపెండెంటు కూడా నెగ్గారు. రాష్ట్రంలో ఏడుసార్లు నెగ్గిన అతికొద్ది మంది నేతలలోఒకరైన ఎన్.యతిరాజారావు చెన్నూరు నుంచే గెలుపొందారు. ఒక ఉప ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఘనత కూడా ఈయన పొందారు. ఈయన భార్య విమలాదేవి, కుమారుడు డాక్టర్ ఎన్. సుధాకరరావు కూడా ఒక్కోసారి గెలిచారు. యతిరాజారావు మరో కుమారుడు ప్రవీణ్‌రావు 2009లో ప్రజారాజ్యం పక్షాన పోటీచేసి ఓడిపోయారు. 1972లో ఇండిపెండెంటుగా గెలిచిన మధుసూధనరెడ్డి ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించింది. యతిరాజారావు గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో పనిచేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
స్టేషన్ ఘనపూర్ (ఎస్సి) నియోజకవర్గం గెలిచిన అభ్యర్థులు వీరే...
స్టేషన్ ఘనపూర్ (ఎస్సి) నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాడికొండ రాజయ్య నాలుగోసారి విజయం సాదించారు. 2018లో రాజయ్యకు టిక్కెట్ వస్తుందా? రాదా అన్న మీ మాంస ఏర్పడినప్పటికీ, చివరికి ఆయన టిక్కెట్ పొందడం, భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగాయి. రాజయ్యకు 35790 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది సింగాపూర్ ఇందిరను ఓడిరచారు. రాజయ్యకు 98612 ఓట్లు రాగా, ఇందిరకు 62822 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిఎస్పి అభ్యర్దిగా పోటీచేసిన రాజారపు ప్రతాప్‌కు 22700 పైగా ఓట్లు వచ్చాయి. తెలంగాణ తొలి క్యాబినెట్లో రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చారు. కాని కొద్ది నెలలకే ఆయనను తప్పించి ఎంపీిగా ఉన్న మరో నేత కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిగా క్యాబినెట్లోకి తీసుకున్నారు. 2018 ఎన్నికలలో మాత్రం శ్రీహరికి అవకాశం రాలేదు. 2018లో ఆయన కూడా మంత్రి కాలేకపోయారు. ఎమ్మెల్సీ పదవి మాత్రం మిగిలింది. 2014లో రాజయ్య, కాంగ్రెస్ ఐ అభ్యర్ధి విజయ రామారావుపై 58829 ఓట్ల ఆదిక్యతతో విజయ డంఖా మోగించారు. రాజయ్య రెండువేల తొమ్మిదిలో కాంగ్రెస్ ఐలో గెలుపొంది టిఆర్ఎస్లోకి వస్తే, విజయ రామారావు 2004లో టిఆర్ఎస్లో గెలిచి శాసనసభ పక్ష నేతగా ఉండి, తదుపరి ఉప ఎన్నికలో ఓటమి చెందారు. తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాత కాంగ్రెస్ ఐలోకి వెళ్లినా ఆయనకు ఫలితం దక్కలేదు. రాజయ్య తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ఐ కు రాజీనామా చేసి టిఆర్ఎస్లో చేరారు. తదుపరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచారు. తిరిగి సాదారణ ఎన్నికలలో కూడా ఘన విజయం సాధించారు. కాగా గతంలో ఇక్కడ మూడుసార్లు ప్రాతినిద్యం వహించిన టిడిపి నేత కడియం శ్రీహరి కూడా టిఆర్ఎస్లో చేరి వరంగల్ నుంచి లోక్ సభకు పోటీచేసి విజయం సాదించడం విశేషం. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి 2008 ఉపఎన్నికలో గెలుపొందిన టిడిపి పక్షాన కడియం శ్రీహరి 2009 సాధారణ ఎన్నికలో ఓడిపోయారు. ఆ తర్వాత టిఆర్ఎస్లోకి వెళ్లారు. కడియం శ్రీహరి ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిస్తే, గోక రామస్వామి రెండుసార్లు గెలిచారు. 2004లో టిఆర్ఎస్ శాసనసభ పక్షనేతగా వ్యవహరించిన డాక్టర్ జి. విజయరామారావు ఇక్కడ నుంచే ఒకసారి గెలిస్తే, మరోసారి మెదక్ జిల్లా గజ్వేల్‌లో గెలిచారు. ఒకసారి సిద్దిపేట నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2008లో టిఆర్ఎస్ వ్యూహంలో భాగంగా పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీచేయగా, ఆయన ఓడిపోయారు. అప్పుడు టిడిపి నేత కడియం శ్రీహరి గెలిచారు. 1985లో ఇక్కడ గెలిచిన బొజ్జపల్లి రాజయ్య, 1999లో పరకాలలో విజయం సాధించారు. ఘనపూర్ నియోజకవర్గం జనరల్‌గా వున్నప్పుడు ఇక్కడ ఒకసారి గెలిచిన టి.హయగ్రీవాచారి, ధర్మసాగర్లో రెండుసార్లు, హన్మకొండలో ఒకసారి గెలిచారు. హయగ్రీవాచారి తర్వాత కాలంలో నక్సల్స్ తూటాలకు బలైపోవడం ఓ విషాదం. హయగ్రీవాచారి గతంలో పి.వి, మర్రి, అంజయ్య, కోట్ల క్యాబినెట్లలో పనిచేశారు. గోకా రామస్వామి 1978లో చెన్నారెడ్డి క్యాబినెట్లో కొద్దికాలం పనిచేసి, ముఖ్యమంత్రితో తగాదపడి, పడక రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. కడియం శ్రీహరి 1994లో ఎన్.టి.ఆర్. క్యాబినెట్‌లోను, తదుపరి చంద్రబాబు క్యాబినెట్‌లోను పనిచేశారు. ఆ తర్వాత కెసిఆర్ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి అయ్యారు. డాక్టర్. జి. విజయరామారావు కొంతకాలం డాక్టర్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో పనిచేశారు. డాక్టర్ రాజయ్య కూడా కెసిఆర్ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా కొంతకాలం ఉన్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిపి ఆరుసార్లు, టిడిపి నాలుగుసార్లు సిపిఐ ఒకసారి, టిఆర్ఎస్ మూడుసార్లు , ఇండిపెండెంటు ఒకసారి గెలిచారు. జనరల్ గా ఉన్నప్పుడు రెడ్లు రెండుసార్లు, ఒకసారి బ్రాహ్మణ, ఒకసారిఇతరులు గెలుపొందారు. స్టేషన్ ఘనపూర్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ముగ్గురు విద్యార్థినిలు మిస్సింగ్.. ఏమయ్యారు?
సాక్షి, జనగామ: జనగామ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలో శనివారం ముగ్గురు విద్యార్థినిలు అదృశ్యమయ్యారు. దీంతో విద్యార్థినిల పేరెంట్స్ హెడ్మాస్టర్కు విషయం తెలిపారు. దీంతో, వీరంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. జనగామ జిల్లాలో ముగ్గురు విద్యార్థినిలు అదృశ్యమయ్యారు. స్టేషన్ రోడ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆశ్విత(15), శివరాత్రి రక్షిత(14), దూదేకుల రుబిన(12) శనివారం అదృశ్యమయ్యారు. ఈరోజు భోజన సమయంలో వీరు ముగ్గురు కనిపించలేదు. ఈ విషయం వీరి పేరెంట్స్‌కు హెడ్మాస్టర్ వలబోజు కృష్ణమూర్తి తెలియజేశారు. ఈ క్రమంలో వీరి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: విషాదం.. కొడుకు మరణ వార్త విని తండ్రి మృతి -
పొలిటికల్ ఎంట్రీపై ముత్తిరెడ్డి కూతురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
జనగామ: ‘రాజకీయాలంటే ఇష్టం లేదు.. ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన లేదు.. అందుకే నాన్న పంచాయితీ విషయంలో సీఎం కేసీఆర్‌ను కలవలేదు’ అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జా భవానీరెడ్డి అన్నారు. తన అధికారిక కార్యక్రమాలను కూతురు, అల్లుడు రాహుల్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా పోలీసులు వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక, ఈ కేసు విషయమై విచారణ నిమిత్తం తుల్జా భవానీరెడ్డి బంధువు రామకృష్ణను పోలీసులు బుధవారం పిలిపించగా, అల్లుడు, కూతురు సైతం జనగామ పీఎస్‌కు వచ్చారు. ఎమ్మెల్యే అధికారిక పర్యటనను అడ్డుకున్నారనే ఆరోపణలతో పాటు ఇతర విషయాలను పోలీసులు అడిగినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి రామకృష్ణ నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. తుల్జా భవానీరెడ్డి, రాహుల్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. కాగా, ముత్తిరెడ్డి అధికారిక కార్యక్రమాన్ని తాను ఎప్పుడూ అడ్డుకోలేదని తుల్జాభవానీరెడ్డి అన్నారు. ఇదే సమయంలో తాను చేర్యాల భూమిని మున్సిపాలిటీకి ఇచ్చిన తర్వాత తన తండ్రి స్వాగతిస్తున్నానని అన్నారని, ఇప్పుడేమో కేసులు పెట్టి మళ్లీ తమను ఇబ్బంది పెడుతున్నాడని మండిపడ్డారు. తాను ఆ భూమిని కబ్జా చేశానని తన తండ్రి ఓపెన్‌గా ఒప్పుకున్నారని.. మరి ఆయన తన పదవిలో ఎందుకు ఉన్నారు? రాజీనామా ఎందుకు చేయడం లేదు? అని ప్రశ్నించారు. భూమి ఆయన కబ్జా చేశాడని, భూమి తాను ఇచ్చానని, కాబట్టి ఈ విషయంలో తండ్రి కూడా వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కన్నకూతురిపై ఓ తండ్రి ఇలా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం ఏమాత్రం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: బస్సు రూట్లో కాంగ్రెస్ -
నవ్య ఎపిసోడ్.. ‘ఆడియోలు, వీడియోల’పై రాజయ్య సవాల్
సాక్షి, జనగామ: జానకిపురం సర్పంచ్ నవ్య ఆరోపణలపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరోక్షంగా స్పందించారు. ఈ వ్యవహారంలో గోబెల్స్ ప్రచారం నమ్మవద్దని రాజయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఆడియోలు వీడియోలు ఉన్నాయని అంటున్నారు. వారికి ఛాలెంజ్ చేస్తున్నా.. ఆరోపణలను కోర్టులో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. అవసరమైతే పరువు నష్టం దావా వేస్తా. సైబర్ నేరం కింద జైలుకు పంపిస్తా. నేను ప్రజాజీవితంలో ఉన్నాను. ఎమ్మెల్యే రాజన్న అంటే ఓ ప్రజా నాయకుడు’ అని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపైనా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.‘ కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్కౌంటర్ల సృష్టికర్త. పార్టీ నుంచి బహిష్కరించనవారే కడియం వెంట ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న కడియంను సస్పెండ్ చేయాలి. ఆంధ్రాకు చెందిన దూదేకుల వ్యక్తిని పెళ్లి చేసుకున్న కడియం కుమార్తె ఎస్సీ కాదు.. బీసీ కులానికి చెందుతుంది. సకల జనుల సమ్మెలో భాగంగా నేను రాజీనామా చేశాను.. కానీ, శ్రీహరి మాత్రం అలా చేయలేదు. ఇదే క్రమంలో ఆడియోలు, వీడియోలు అంటూ నాపై వస్తున్న ఆరోపణలను కోర్టు ద్వారా ఎదుర్కొంటాను అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ‘సర్పంచ్ నవ్య ఆరోపణల్లో వాస్తవాలు లేవు’ -
జనగామలో కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవం
-
ఉద్యోగులకు జీతాలు ఇంకా పెరుగుతాయి: సీఎం కేసీఆర్
సాక్షి, జనగామ: తెలంగాణలో ఎప్పుడూ కరెంట్ సమస్య ఉండదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉద్యోగులు చిన్న చిన్న సమస్యలకు బెంబేలెత్తిపోవద్దని కేసీఆర్ సూచించారు. ఉద్యమ సమయంలో అండగా నిలిచిన ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని తెలిపారు. ఉద్యోగులకు జీతాలు ఇంకా పెరుగుతాయని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో 10 గ్రామాలకు అవార్డులు వస్తే అందులో 7 తెలంగాణలోని గ్రామాలే అని గుర్తు చేశారు. పట్టుదలతో పనిచేస్తేనే ఇవన్నీ సాధ్యమైందన్నారు. , విద్యుత్‌శాఖ ఉద్యోగులు రాత్రిబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు వేరువేరు కాదని అన్నారు. జనగామ కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ మేరకు కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సీఎం కేసీఆర్ కొబ్బరికాయ కొట్టించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు జనగామ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వచ్చేవి. అప్పట్లో జనగామలో మంచినీళ్లు కూడా ఉండని పరిస్థితి ఉండేది. చాలామంది పొట్టచేతపట్టుకొని వలసపోయారు. అప్పటి పరిస్థితి చూసి ఎంతో బాధపడ్డా. రాష్ట్రం వచ్చాక పరిస్థితి మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకున్నాం. అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. చదవండి: ‘కేంద్ర’ ఉద్యోగాల భర్తీపై స్పష్టత: ఆర్.కృష్ణయ్య భూముల ధరలకు రెక్కలు తలసరి ఆదాయం త్వరలో రూ.2.70లక్షలకు పెరగబోతుంది. హైదరాబాద్‌లో 25 కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నారు. ఢిల్లీ ముంబై నుంచి వచ్చి హైదరాబాద్‌లో కొంటున్నారు. జోనల్ వ్యవస్థతో అందరికీ న్యాయం. అవగాహన లేక కొందరు వ్యతిరేకించారు.’అని తెలిపారు. అనంతరం సమీపంలోని మైదానంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. జనగామలో భూముల విలువలు పెరిగాయి. ఏడేళ్ల కింద రూ. రెండు లక్షల విలువన్న ఎకర భూమి.. ఇప్పుడు రూ.3,3 కోట్లకు చేరింది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఎకర పొలం రూ. 25 లక్షలకు తక్కువ పోతలేదు. ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధ్యమైంది. సీఎస్, అధికారులు, ప్రజాప్రతినిధులకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను.’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
వివాహ వేడుకలో పెట్రోలు బహుమానం..
సాక్షి, నర్మెట(జనగామ): పెట్రోల్ ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. అయితే, ఈ మధ్య చాలా వివాహ వేడుకలలో దీన్ని కూడా బహుమానంగా ఇస్తుండం ఒక ట్రెండ్‌గా మారింది. కాగా, పెళ్లి వేడుకలకు వచ్చిన బంధుమిత్రులు వధూవరులకు బహుమతిగా నగదు, నూతన వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు ఇవ్వడం ఆనవాయితీ. అయితే నర్మెట మండల కేంద్రంలో శనివారం జరిగిన మహేష్–సుస్మిత వివాహానికి హాజరైన బాల్య మిత్రులు భాస్కర్, సతీష్, శివ, శ్రీనివాస్, నవీన్ లీటర్ పెట్రోలు అందజేసి ధరలు బాగా పెరిగాయి పొదుపుగా వాడుకోవాలని సలహా ఇచ్చారు. చదవండి: టీ సర్కార్ ఉల్లంఘనలపై తెలంగాణ హైకోర్టుకు ఏపీ రైతులు -
మాస్కు ధరించలేదని చిన్నారులతో..
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం భాంజీపేటలో మాస్క్‌లు లేని చిన్నారులతో ఓ పంచాయతీ కార్యదర్శి రహదారిపై కప్పగంతులు వేయించారు. పంచాయతీ కార్యదర్శి శ్రీరంగారెడ్డి మంగళవారం గ్రామంలో పర్యటిస్తూ మాస్క్‌లు ధరించని ఇద్దరికి జరిమానా వేశారు. ఆ తర్వాత పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులు మాస్క్ లేకుండా కనిపించగా.. వారిని కప్పగంతులు వేయాలని ఆదేశించారు. దీంతో చిన్నారులు మోకాళ్లపై కొద్దిదూరం కప్పగంతులు వేయగా, స్థానికులు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కాగా, ఈ విషయమై శ్రీరంగారెడ్డి మాట్లాడుతూ కరోనాపై చిన్నారులకు అవగాహన కల్పించేందుకు కప్పగంతులు వేయించానే తప్ప మరే ఉద్దేశం లేదని తెలిపారు. ఒకే ఇంట్లో ఆరుగురికి పాజిటివ్ .. బాధితుల్లో ఐదు నెలల బాబు స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలంలోని అక్కపెల్లిగూడెంలో ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఇప్పగూడెం పీహెచ్సీ వైద్యాధికారి మౌనిక తెలిపారు. పీహెచ్‌సీకి వచ్చిన కుటుంబ సభ్యులను పరీక్షించగా కుటుంబంలోని ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. కాగా, బాధితుల్లో ఐదు నెలల వయసు కలిగిన బాబు కూడా ఉన్నాడని తెలిపారు. చదవండి: ఇంట్లోనూ మాస్క్ ధరించండి..ఎందుకంటే ? -
చాయ్ వారి చావుకొచ్చింది
బచ్చన్నపేట: టీ తాగి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై లక్ష్మణ్‌రావు కథనం మేరకు.. గ్రామానికి చెందిన దాసారం మల్లయ్య ఇంటికి హైదరాబాద్‌లో ఉంటున్న తన సోదరుడు భిక్షపతి వచ్చాడు. ఉదయం మల్లయ్య భార్య అంజమ్మ.. భర్త, మరిదికి టీ ఇచ్చింది. అనంతరం తానూ తాగింది. కాసేపటికి ముగ్గురు అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. వారి కుమారుడు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అంజమ్మ మృతి చెందింది. మల్లయ్య, భిక్షపతి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, టీ పొడిలో విషపు గుళికలు ఉన్నట్లుగా గుర్తించామని ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు. -
బాబోయ్.. భల్లూకం
సాక్షి, జనగామ: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి – కంచ నపల్లి రోడ్డుపై ఎలుగుబంట్ల సంచారం పెరిగింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శుక్ర వారం దొడ్డిగుట్ట వద్ద రహదారిపైకి ఒక్కసారిగా ఎలుగుబంటి రావడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. పదుల సంఖ్యలో ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయని, పొలాల వద్దకు వెళ్లాలంటే భయంగా ఉందని రైతులు చెబుతున్నారు. అధికారులు స్పందించి ఎలుగుబంట్లను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాలని కోరుతున్నారు. -
ఆయిల్‌ఫెడ్‌కు 1.3 లక్షల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: ఆయిల్‌పాం సాగుకు నోటిఫై చేసిన ఏరియాలో 1.3 లక్షల ఎకరాలు ఆయిల్ ఫెడ్‌కు ఇవ్వాలని ప్రభు త్వం నిర్ణయించింది. మహబూబాబాద్ జిల్లాలో 50 వేల ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 30 వేల ఎకరాలు, జనగామ జిల్లాలో 20 వేల ఎకరాలు, గద్వాల జిల్లాలో 20 వేలు, నారాయణపేట్ జిల్లాలో 10 వేల ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి త్వరలో ఒప్పందం చేసుకుంటామని ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ నిర్మల తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 25 జిల్లాల్లో 8,24,162 ఎకరాలు ఆయిల్‌పాం సాగుకు అనువైన ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. అందులో దాదాపు 8 లక్షల ఎకరాలను 13 కంపెనీల పరిధిలోకి తీసుకురావడం, ఆయిల్‌ఫెడ్‌కు 24,500 ఎకరాలు (2.97 శాతం) మాత్రమే కేటాయిస్తూ వ్యవసాయశాఖ ఇటీవల ఉత్తర్వులు ఇవ్వడం విదితమే. దీంతో ఆయిల్‌ఫెడ్ అధికారులు తమకు మరికొంత కేటాయించాలని వ్యవసాయశాఖకు విన్నవించారు. ఇదిలావుంటే ప్రైవేట్ కంపెనీలకు కేటాయించిన దాంట్లో కొన్ని ప్రముఖ సంస్థలే ముందుకు రాకపోవడం గమనార్హం. దీంతో ఆయిల్‌ఫెడ్ కోరినట్లుగా నోటిఫై చేసిన ప్రాంతాల్లో కొంతమేరకు ఇచ్చారు. కొన్ని కంపెనీలు రాని ఏరియాలను ఇప్పటికే టెండర్లలో పాల్గొన్న సంస్థలకు ఇస్తామని ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. -
‘కండువా కప్పుకుంటేనే డబుల్ బెడ్రూం ఇల్లు’
సాక్షి, జనగామ: ‘పార్టీలో పదవులు రాలేదని చీటికిమాటికి కొట్లాటలు వద్దు. ఉద్యమ సమయం నుంచి నేను పార్టీలో కష్టపడి పనిచేసిన. అయినా నిన్నకాక మొన్న టీఆర్ఎస్లో చేరిన వారు మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. దీనికి నేనేమైనా కొట్లాట చేశానా? అన్నింటికీ అధినేత సీఎం కేసీఆర్ ఉన్నారనే భరోసా ఉంది’ అంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదులో ఆయన మాట్లాడారు. వర్ధన్నపేట, పాలకుర్తి, ఉప్పల్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా.. కేసీఆర్‌ను నమ్ము కోవడంతో జనగామ ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇచ్చారన్నారు. మనకు మనం మనస్పర్థలకు వెళ్లి, పార్టీకి చెడ్డ పేరు తేవొద్దని హితవు పలికారు. ఇక నుంచి పార్టీ శ్రేణులు చెప్పినోళ్లకే పథకాలు వస్తాయని, కండువా కప్పుకుంటేనే డబుల్ బెడ్రూం ఇల్లు దక్కు తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ మాలోతు కవిత తదితరులు పాల్గొన్నారు. -
స్కూటీని ఢీకొట్టిన మాజీ ఎమ్మెల్యే వాహనం
జనగామ: మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రయాణిస్తున్న వాహనం.. ముందు వెళుతున్న స్కూటీని ఢీకొట్టి ఎగిరి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న వాహనదారుడికి తీవ్ర గాయాలు కాగా, మాజీ ఎమ్మెల్యేకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటనలో మాధవరెడ్డితోపాటు ఆయన పీఏ, డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. సీఐ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మాజీ శాసనసభ్యుడు మాధవరెడ్డి తన ఇన్నోవా వాహనం లో హైదరాబాద్ బయలుదేరారు. జనగామ జిల్లా కేంద్రం బైపాస్ లోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో ముందు వెళుతున్న స్కూటీని ఆయన వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో స్కూటీపై వెళుతున్న మామిడాల రాకేశ్ ఎగిరి కిందపడడంతో తీవ్రగాయాలయ్యాయి. ఇన్నోవా సైతం అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో ముందు సీట్లో కూర్చున్న మాజీ ఎమ్మెల్యేతోపాటు డ్రైవర్ రంజిత్‌కుమార్, వెనక సీట్లో ఉన్న పీఏ శ్రీపతి స్వల్పగాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన రాకేశ్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం జనగామ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ వేమెళ్ల సత్యనారాయణరెడ్డి మరో వాహనంలో మాధవరెడ్డి, డ్రైవర్, పీఏను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. డీసీపీ శ్రీనివాస్‌రెడ్డితో కలసి సీఐ మల్లేశ్, ఎస్సై రాజేశ్ నాయక్ సంఘటన స్థలం చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షించారు. రాకేశ్ సోద రుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
నీటి కొరత ఉంటే తలస్నానం చేస్తారా?
సాక్షి, రఘునాథపల్లి : హోలీ సందర్భంగా సోమవారం రంగులు చల్లుకున్న విద్యార్థినులు తలస్నానాలు చేశారు. నీటి కొరత ఉన్నప్పుడు తలస్నానాలు చేసి నీటిని వృథా చేశారంటూ ఆగ్రహంతో విద్యార్థినులను కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి చితకబాదింది. ఈ సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కేజీబీవీలో చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం ప్రత్యేకాధికారి సుమలత పాఠశాలకు వచ్చేసరికి సంపులోని నీరు ఖాళీ అయింది. దీంతో తలస్నానాలు చేసిన బాలికలందరినీ పిలిచి చేతి వేళ్లపై కర్రతో కొట్టింది.ఘటనపై సుమలతను వివరణ కోరగా.. ‘పాఠశాలలో నీటి సమస్య ఉంది.. కరోనా వైరస్ ప్రభావం ఉన్నందున రంగులు చల్లుకోవద్దని చెప్పినా వినలేదు’ అని చెప్పారు. -
పొన్నాల వర్సెస్ జంగా!
సాక్షి , వరంగల్ : పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి వర్గీయుల మధ్య నెలకొన్న గ్రూపు విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, అతని అనుచరులకు ఘోర పరాభవం ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జనగామలోని 30 వార్డులకు గానూ పొన్నాల అనుచరులకు ఒక్క సీటు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు. మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన పొన్నాలకు ఈసారి కనీసం బీ ఫాంలు కూడా ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పొన్నాలకు పొమ్మనలేక పొగ పెడుతున్నారని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో డీసీసీ నేత జంగా రాఘవరెడ్డికే బీ ఫాంలు, అభ్యర్థుల ఎంపిక బాధ్యతలు టీపీసీసీ ఇవ్వగా, జంగా రాఘవరెడ్డి ఒకే కుటుంబానికి రెండు రెండు టికెట్లు కేటాయించారని కాంగ్రెస్ నేతలు జనగామలో రోడ్డెక్కారు. చేసేదేం లేక పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పీసీసీ కార్యదర్శులు కంచ రాములు, ధర్మ సంతోష్‌రెడ్డి అధిష్టానానికి తమ రాజీనామా లేఖలు పంపించారు. కాంగ్రెస్‌లో బీసీలను అణిచివేశారని ఈ సందర్భంగా వారు ఆరోపణలు చేశారు. పెల్లుబికిన నిరసనలతో పొన్నాల లక్ష్మయ్య ఇంటికి చేరిన కాంగ్రెస్ శ్రేణులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జంగా రాఘవరెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జనగామలో స్థానికేతురుడైన రాఘవరెడ్డి పార్టీని నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. -
మద్యం టెండర్ల కోసం బంగారం తాకట్టు
సాక్షి, జనగామ : మద్యం టెండర్ల దరఖాస్తుకు గడువు రేపటితో ముగుస్తుండడంతో దరఖాస్తులు డబ్బులు కోసం బంగారం తాకట్టు పెడుతున్నారు. క్యాష్ కోసం పరేషాన్ అవుతున్నారు. ప్రైవేట్ చిట్ఫండ్లు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మద్యం షాపుల టెండర్ల అప్లికేషన్లకు ఈనెల 16వ తేదీతో గడువు ముగిసిపోనుంది. దీంతో ఇంట్లో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి డీడీలు, చలాన్ ఇచ్చే పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లావ్యాప్తంగా 42 మద్యం షాపులకు ఈ నెల తొమ్మిదో తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 16వ తేదీన అప్లికేషన్ల దాఖలుకు చివరి గడువు కాగా 18వ తేదీన డ్రా తీయడానికి ఎక్సైజ్ శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. డబ్బు కోసం ముమ్మర ప్రయత్నాలు.. ప్రభుత్వం ఈ ఏడాది నూతన మద్యం పాలసీని ప్రకటించింది. రెండేళ్ల కాలపరిమితి ఉన్న షాపుల కేటాయింపు కోసం టెండర్ ప్రక్రియను నిర్వహిస్తోంది. టెండర్లో పాల్గొనడం కోసం అప్లికేషన్ దరఖాస్తు ఫీజును రూ.రెండు లక్షలకు పెంచింది. ఒక్కొక్క దరఖాస్తుకు రూ.రెండు లక్షలు చెల్లించి టెండర్లో పాల్గొనడం కోసం అప్లికేషన్ సమర్పించాల్సి ఉంది. అప్లికేషన్ ఫీజు రూ.రెండు లక్షలు పెంచడంతో దరఖాస్తుదారులు డబ్బులు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో గోల్డ్ లోన్, ఇతర ప్రైవేట్ చిట్‌ఫండ్ కంపెనీలు, వడ్డీ వ్యాపారులు నుంచి డబ్బుల కోసం చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం పంటలు చేతికి రాకపోవడంతో రైతుల వద్ద సైతం డబ్బులు లేవు. దీంతో చివరి ప్రయత్నంగా ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, బంధువుల వద్ద సంప్రదింపులు చేస్తున్నారు. రూ.లక్షకు రూ.రెండు నుంచి నాలుగు రూపాయల వడ్డీతో తీసుకుంటున్నారు. గ్రూపులు గ్రూపులుగా.. మద్యం టెండర్ల అప్లికేషన్ల కోసం దరఖాస్తు చేయడానికి కొంతమంది గ్రూపులు గ్రూపులుగా జత కడుతున్నారు. ఐదు నుంచి పది మంది సభ్యులు కలిసి సమష్టిగా డబ్బులను సమకూర్చుకొని దరఖాస్తులు సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. మద్యం వ్యాపారంలో ఆరితేరిన పెద్ద వ్యాపారులు అయితే కుటుంబ సభ్యుల పేర్లతోనే కాకుండా బినామీ పేర్లతో దరఖాస్తులు సమర్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. పెరుగుతున్న టెండర్ ఫీజుతో పరేషాన్.. మద్యం లైసెన్స్ కోసం టెండర్ల ఫీజు పెరుగుతుండడంతో వ్యాపారులు డబ్బుల కోసం పరేషాన్ అవుతున్నారు. 2012కు ముందు సీక్రెట్ పద్ధతిలో టెండర్లు నిర్వహించే వారు. ఎవరు ఎక్కువ టెండర్ వేస్తే వారికే ఆ షాపు దక్కేది. 2012 నుంచి డ్రా పద్ధతితో మద్యం షాపులను అప్పగిçస్తున్నారు. 2012–14 రెండేళ్ల కోసం నిర్వహించిన టెండర్ల కోసం కేవలం రూ.25వేలు మాత్రమే ఫీజుగా ఉండేది. ఆ తరువాత 2014–15లో టెండర్ అప్లికేషన్ ఫీజు రూ.50 వేలుగా ఉండేది. 2015–17, 2017–19లో టెండర్ అప్లికేషన్ ఫీజు రూ. లక్షగా నిర్ణయించారు. ప్రస్తుతం టెండర్ అప్లికేషన్ ఫీజు మాత్రం అమాంతం రూ.రెండు లక్షలకు పెంచడంతో డబ్బులు కోసం నానా పాట్లు పడుతున్నారు. 2017–19 సంవత్సరంలో 41 షాపులకు 1280 దరఖాస్తులు వచ్చాయి. కానీ పెంచిన ఫీజు కారణంగా గతంతో పోల్చితే దరఖాస్తులు తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. చివరి రోజు బుధవారం మంచి ముహుర్తం ఉండడంతో అధికంగా దరఖాస్తులు సమర్పించే అవకాశాలు ఉన్నాయి.