సాక్షి, జనగామ: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ ముందుగానే బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం రాష్ట్రంలో టికెట్ల విషయం కాక రేపుతోంది. మూడు ప్రధాన రాజకీయపార్టీల్లోనూ వేడి పుట్టిస్తోంది. బీఆర్‌ఎస్‌లో టికెట్ దక్కని ఆశావహులు అసమ్మతి రాగం ఎత్తుకున్నారు. మరికొందరు నేతలు ఏకంగా పార్టీ నుంచి జంప్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ లభించని ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.
ఝలక్ ఇచ్చిన బీఆర్‌ఎస్ నేతలు..
తాజాగా రాజయ్య మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ రాకపోయినా నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటాను. ఎన్నికలకు ఇంకా మూడు నెలలు సమయం ఉంది. ఎవరో వచ్చి ఏదో చేస్తారని అంతా అనుకుంటున్నారు. ఎవరూ రారు.. ఏమీ జరగదు. నా పని ఇప్పుడే అయిపోందని భావించకూడదు అంటూ కీలక కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన ఏం చేస్తారనే టెన్షన్ బీఆర్‌ఎస్ నేతల్లో నెలకొంది. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే రాజయ్య బుధవారం లింగాలఘనపురం మండలంలో కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. అయితే, చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బీఆర్ఎస్‌కు చెందిన స్థానిక నేతలు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో నేతల తీరుపై రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
చూస్తూ ఊరుకుంటామా..
ఇక, అంతకుముందు కూడా రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ టికెట్ లభించకపోవడంతో అసంతృప్తితో ఉన్న రాజయ్య.. ఆరు నూరైనా ప్రజాక్షేత్రంలో ఉంటానని స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ బీఆర్‌ఎస్ టికెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కేటాయించడంపై పరోక్షంగా రాజయ్య మనోవేదన చెందుతున్నారు. ఈ సందర్భగా రాజయ్య మాట్లాడుతూ.. భూమి కొని మొట్లు కొట్టి దుక్కి దున్ని నారు పోసి కలుపుతీసి, పంట పండించి కుప్ప పోశాక కుప్ప మీద వచ్చి ఎవరో కూర్చుంటానంటే ఊర్కుంటామా అంటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. నవ్వుతూ నోరు కొట్టుకున్నారు. దేవుడున్నాడు, దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నాడు.. రేపో మాపో మనం అనుకున్న కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజల కోసమే నేనున్నా, ప్రజల మధ్యలోనే చచ్చిపోతానని తెలిపారు.
ఇది కూడా చదవండి: సాగర్ బీఆర్‌ఎస్‌లో అంతర్గత పోరు.. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment