
తన సర్వే రిపోర్ట్ బాగా లేదంటున్నవారు 65 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్‌ను ..
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలోనే బీసీ నాయకుడిని పక్కన పెట్టడం తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో హుటాహుటిన ఢిల్లీకి బయలు దేరిన ఆయన అక్కడ సాక్షితో మాట్లాడారు. తన సర్వే రిపోర్ట్ బాగా లేదంటున్నవారు 65 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్‌ను బయట పెట్టాలన్నారు. ఒకే పార్టీ ఒకే నియోజకవర్గంలో ఏళ్ల తరబడి నుంచి కొనసాగుతున్నాని తెలిపారు. జనగామ టికెట్‌ను ఎన్నికల కమిటీ తనకు ప్రతిపాదించిందని, అయినా తన పేరు జాబితాలో ఎందుకు రాలేదో తెలియదన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరుతానని కొందరు పనిగట్టుకొని తనపై దుష్ప్రచారం చేశారని, ఏడాదికి పైగా తనకు టికెట్ రాకుండా కుట్ర జరుగుతోందని తెలిపారు. భువనగిరి ఎంపీ టికెట్ తనకొద్దని, మాజీమంత్రులు అందరినీ లోక్‌సభకు పంపుతున్నారా? అని ప్రశ్నించారు.
మహాకూటమి ఒప్పందంలో భాగంగా టీజేఎస్ అధినేత కోదండ రాం జనగామ టికెట్‌ను ఆశిస్తున్నారు. దీంతో ఈ స్థానాన్ని కాంగ్రెస్ పెండింగ్‌లో పెట్టింది. పొన్నాల లక్ష్మయ్య ఇతర స్థానాలు నుంచి పోటీచేసేలా ఒప్పించే ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. పొన్నాల మాత్రం తనకు జనగాం తప్పా.. ఏ స్థానం వద్దని పట్టుబడుతున్నారు.