అధైర్యపడొద్దు.. మేం అండగా ఉన్నాం | Ponnala Lakshmaiah Supports RTC Strike In Jangaon | Sakshi
Sakshi News home page

అధైర్యపడొద్దు.. మేం అండగా ఉన్నాం

Published Tue, Oct 15 2019 10:56 AM | Last Updated on Tue, Oct 15 2019 10:56 AM

Ponnala Lakshmaiah Supports RTC Strike In Jangaon - Sakshi

సాక్షి, జనగాం : ప్రభుత్వ చర్యలతో ఆర్టీసీ కార్మికులు అధైర్య పడొద్దని అండగా ఉంటామని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జిల్లా కేంద్రం లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న రిలే నిరవధిక దీక్షలు సోమవారం నాటికి 10వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన పొన్నాల కార్మికులకు పూలమాలలు వేసి సంఘీభావం ప్రకటించారు. పొన్నాల లక్ష్మయ్య ఆర్టీసీ డిపోకు వెళ్లేందుకు ప్రయత్నించగా
పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఆర్టీసీకి సంబంధించి సుమారు రూ. 60 వేల కోట్ల ఆస్తులను ఏళ్ల పాటు తన అనుయాయులకు లీజుకు కట్టబెట్టేందుకు కేసీఆర్‌ కట్రలో భాగంగానే సమ్మె చేస్తున్న కార్మికులను అడ్డదారిలో తొలగిస్తున్నాడన్నారు.

ప్రపంచ నియంతల చరిత్రలో  ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదటి స్థానంలో నిలుస్తున్నాడని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ కావాలని కొట్లాడితే కేవలం తన కుటుంబంతో పాటు అనుయాయులకు మేలు చేసుకునే విధంగా రాజ్యాంగ పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడని దుయ్యబట్టారు. ఉమ్మడి పాలన కంటే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో ఆర్టీసీని దివాలా తీయించారన్నారు. దీనిపై కార్మికులు గర్జిస్తుంటే సమ్మెను తప్పుదారి పట్టించేందుకు అనేక కుట్రలు పన్నుతూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను 144 సెక్షన్‌తో తొక్కిపడేస్తూ ప్రైవేట్‌పరం చేసేందుకు లోలోపల అంతా సిద్ధం చేసుకున్నారన్నారు. 

ప్రజల ప్రతిస్పందన చూడబోతున్నావ్‌...
నియంత పాలనతో విసుగుపుట్టిన ప్రజలు తమ ప్రతి స్పందన చూపించబోతున్నారని పొన్నాల అన్నారు. వేతనాలు ఇవ్వకుండా ఆర్టీసీ కార్మికులను పస్తులుంచిన కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని చెప్పారు. హన్మకొండ హంటర్‌ రోడ్డు ఆర్టీసీ పరిధిలోని రీ ట్రేడింగ్‌ సెంటర్‌ను కరీంనగర్‌కు బదిలీ చేసి. రూ.100 కోట్ల విలువైన  భూమిని కేసీఆర్‌ తన అనుయాయులకు అప్పగించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

సీబీఐ విచారణ జరిపించాలి
రాష్ట్రంలో జరుగుతున్న మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, విద్యుత్‌ కొనుగోళ్లు, కాళేశ్వరం, రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుల్లో జరుగుతున్న అనేక అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వారి సమస్యలను పరిష్కరించకుంటే పోరును మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 48 వేల ఆర్టీసీ కుటుంబాలను » జారున పడేసేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు లింగాజీ, రంగరాజు ప్రవీణ్‌ కుమార్, డాక్టర్‌ రాజమౌళి, లక్కార్సు శ్రీనివాస్, అల్వాల ఎల్లయ్య, ధర్మపురి శ్రీనివాస్, వరలక్ష్మి, అజహరొద్దీన్, ఖాదర షరీఫ్, జమాల్‌షరీఫ్, కొమ్ము నర్సింగారావు, ఎండీ.అన్వర్, ఆకుల వేణుగోపాల్‌రావు, సుంకరి శ్రీనివాస్‌రెడ్డి, మోర్తాల ప్రభాకర్, జక్కుల వేణుమాధవ్, దిలీప్‌రెడ్డి, క్రాంతి, రంగు రవి, చెంచారపు బుచ్చిరెడ్డి, మేడ శ్రీనివాస్‌ తదితరులున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement