
పాఠశాలకు వెళ్లే బురద దారి
నిరసన తెలుపుతున్న విద్యార్థులు, నాయకులు
జనగామ జిల్లా, చిల్పూరు: దారి ఇలా ఉంటే తాము పాఠశాలకు ఎలా వెళ్లేదంటూ విద్యార్థులు సోమవారం నిరసన చేపట్టగా తల్లిదండ్రులు, నాయకులు సహకరించారు. మండలంలోని ఫత్తేపూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదివే విద్యార్థులు వెళ్లే రహదారిలో గ్రామంలోని మురుగు నీరు పాఠశాల సమీపంలో నిలుస్తోంది.
చిరుజల్లులకే కుంటలా మారుతోంది. గతంలో గ్రామ ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే పాఠశాల వద్ద ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు
గతంలో ఎన్నో సార్లు అధికారులకు విన్నవించాం. అయినా పట్టించుకోవడం లేదు. మన ఊరు మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాల అంటూ పనులు చేస్తున్నారే తప్ప పాఠశాలకు పిల్లలు వచ్చే రోడ్డు ఎందుకు పట్టించుకోరు. త్వరగా సమస్య తీర్చాలి.
– బానోత్ బాలరాజు, గ్రామస్తుడు
బురదలోనే నడుస్తున్నాం
ప్రతీ రోజు చెప్పులు చేతపట్టుకుని బురదలో నడిచి పాఠశాలకు వెళ్తున్నాం. మధ్యాహ్న భోజనం తినే సమయంలో వాసన భరించలేక పోతున్నాం. అధికారులు స్పందించాలి.
– హరిప్రసాద్, విద్యార్థి
ఒక్కోసారి బురదలో జారిపడుతున్నాం..
పుస్తకాల బ్యాగుతో నడిచి వస్తుంటే ఒక్కోసారి జారి బురదలో పడుతున్నాం. దీంతో తిరిగి ఇంటికి వెళ్తుంటే ఆ వాసన భరించలేక వాంతులు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. మా బడి వరకు రోడ్డు నిర్మించాలి.
– సాత్విక, విద్యార్థిని
Comments
Please login to add a commentAdd a comment