అనుమతి లేకుండా వెంచర్లు.. | Ventures Without Permission ..Janagama | Sakshi
Sakshi News home page

అనుమతి లేకుండా వెంచర్లు..

Published Sat, Jul 28 2018 1:14 PM | Last Updated on Wed, Aug 1 2018 2:06 PM

Ventures Without Permission ..Janagama - Sakshi

సూర్యాపేట రోడ్డులోని వ్యవసాయ భూమిలో పాతిన హద్దులు

సాక్షి, జనగామ : ప్రజల డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని చోటామోటా రియల్టర్లు రియల్‌ దందాకు తెర లేపుతున్నారు. వ్యవసాయ భూములను నివాస ప్రాంతాలుగా మార్చడం కోసం నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. అనధికార వెంచర్లపై కఠిన చర్యలు తీసుకునే నాథుడే లేకపోవడంతో మూడు వెంచర్లు..ఆరు ప్లాట్లుగా జిల్లా కేంద్రం సరిహద్దులో రియల్‌ దందా కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా అనుమతి లేని ప్లాట్లు కొనుగోలు చేసి సామాన్యులు ఇబ్బందుల్లో పడుతున్నారు.

జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న నాలుగు వైపులా రోజుకు రోజు వెంచర్లు వెలుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌..ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు సెంటర్‌ పాయింట్‌ కావడమే కాకుండా నాలుగు రాష్ట్రాలకు ఇక్కడి నుంచి రవాణా మార్గాలున్నాయి. అంతేకాకుండా జాతీయ రహదారులతోపాటు రైల్వే రవాణా అభివృద్ధి చెందడంతో మెజార్టీ ప్రజలు ఇక్కడే నివాసం ఉండడానికి మొగ్గు చూపుతున్నారు.

వీటితోపాటు దేవాదుల కాల్వల నిర్మాణంతో వ్యవసాయ భూములు కోల్పోవడంతో రూ.లక్షల్లో పరిహారం రైతులకు అందింది. పిల్లల చదువుల కోసం జిల్లా కేంద్రంలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో భూముల క్రయవిక్రయాలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడుతోంది. భూముల కొనుగోలు కోసం పోటీ ఏర్పడడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెంచర్లను ఏర్పాటు చేసి అమ్మకానికి పెడుతున్నారు. గతంలో హైదరాబాద్‌ రోడ్డుకు పరిమితమైన రియల్‌ వ్యాపారం ఇప్పుడు సూర్యాపేట రోడ్డు, సిద్దిపేట రోడ్డు, వరంగల్‌ రోడ్డు వైపు విస్తరిస్తోంది. 

గ్రామ పంచాయతీలే టార్గెట్‌..

జనగామ మునిసిపాలిటీలో వెంచర్లు చేస్తే ప్రభుత్వానికి భారీగా పన్ను కట్టాల్సి వస్తుందనే భావనతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు గ్రామ పంచాయతీలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. పెంబర్తి, శామీర్‌పేట, నెల్లుట్ల, యశ్వంతాపూర్, నిడిగొండ గ్రామాల సరిహద్దులను ఎంచుకుని వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. అగ్రికల్చర్‌ భూములను నాన్‌ అగ్రికల్చర్‌ భూములుగా రెవెన్యూ అధికారుల వద్ద మార్చాలి. ఆర్డీఓ పరిధిలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లించి ఎన్‌ఓసీ తీసుకుకోవాలి.

కానీ, అగ్రికల్చర్‌ భూములను నాన్‌ అగ్రికల్చర్‌ భూములుగా మార్చకుండానే ఇష్టారాజ్యంగా వెంచర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది రెవెన్యూ అధికారుల అండదండలతోనే వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అనుమతి లేకుండా వెంచర్లు ఏర్పాటు చేయడం మూలంగా ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర గండిపడుతోంది.

దళారులకు ఆఫర్లు..

అనుమతి లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మధ్య దళారులను ఏర్పాటు చేసుకుని ప్లాట్లను విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1000 నుంచి 1500 మంది వరకు బ్రోకర్ల వరకు ఉన్నట్లు సమాచారం. ఒక్కో ప్లాట్‌ విక్రయానికి ఒక్కో రేటు చొప్పున చెల్లిస్తున్నారు. ఎక్కువ ప్లాట్లు అమ్మకం చేసిన దళారులకు విదేశీ పర్యటనలను సైతం ఆఫర్‌ చూపెడుతున్నారు. అరచేతిలోనే రియల్‌ వ్యాపారం జోష్‌ను చూపించి పెద్ద మొత్తంలో దందా కొనసాగిస్తున్నారు. 

శాఖల మధ్య లోపించిన సమన్వయం..

మునిసిపాలిటీ, గ్రామ పంచాయతీ శాఖల మధ్య సమన్వయం లోపించినట్లుగా తెలుస్తోంది. జిల్లా సరిహద్దు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న వెంచర్ల వివరాలను తెలుపాలని మునిసిపాలిటీ అధికారులు రెండు నెలల క్రితమే పంచాయతీ అధికారులకు లేఖను పంపించారు. ఇప్పటి వరకు పంచాయతీ శాఖ నుంచి మునిసిపాలిటీ అధికారులకు ఎలాంటి నివేదిక అందలేదు. దీంతో కొంతమంది దళారులు ఇష్టారాజ్యంగా వెంచర్లను ప్రారంభిస్తున్నారు.

హైదరాబాద్, వరంగల్, భువనగిరి ప్రాంతాలకు చెందిన బడా రియల్టర్లు స్థానికంగా ఉండే కొంతమందిని బినామీలుగా మలుచుకుని ప్లాట్ల బిజినెస్‌కు శ్రీకారం చుడుతున్నారు. అనుమతులు లేని వెంచర్లపై అధికారులు కొరడ ఝళిపిస్తేనే అమాయకులు వారి ఉచ్చులో పడకుండా జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది.

లేఔట్‌ లేని ప్లాట్లను కొనుగోలు చేయవద్దు.. 

అనుమతి లేని లేఔట్‌ ప్లాట్లను కొనుగోలు చేయవద్దు. లేఔట్‌ లేని ప్లాట్లను కొనుగోలు చేస్తే ఇంటి నిర్మాణానికి అనుమతి రాదు. బ్యాంకు నుంచి రుణం లభించదు. డబుల్‌ టాక్స్‌ పడుతుంది. భూ వివాదాలు వస్తాయి. నెల్లుట్ల, నిడికొండ, యశ్వంతాపూర్‌లో ఉన్న వెంచర్లకు మాత్రమే అనుమతి ఉంది. మరో ఐదు వెంచర్ల అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి. అనుమతి లేకుండా వెంచర్లు ఏర్పాటు చేసే వారిపై కఠిన చర్యలు చేపడుతున్నాం.   - రంగు వీరస్వామి, టీపీఓ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement