వైఎస్సార్సీపీ అధినేత జగన్ 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన సమయంలో ఇసుక, మద్యం వంటి వాటిల్లో జరుగుతున్న విచ్చలవిడి దోపిడీని గుర్తించడమే కాకుండా.. దాన్ని సరిదిద్దేందుకు కూడా ప్రయత్నించారు. అయితే ఆయా సందర్భాల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ దిద్దుబాటు యత్నాలను తీవ్రంగా వ్యతిరేకించడం అందరూ గమనించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అంశాలపై విధానపరమైన సంస్కరణలు తేవడానికి కేవలం రెండు మూడు నెలలే పట్టినా.. పచ్చపార్టీలు మాత్రం ఈలోపే నానా రచ్చా చేసేందుకు ప్రయత్నించాయి. ఇసుక కొరత ఏర్పడిందని, రాష్ట్రం సర్వనాశనమైపోయిందంటూ చంద్రబాబు, పవన్‌లు వీధికెక్కారు. తప్పుడు ప్రచారం చేశారు.
అంతకుముందు 014-2019 మధ్యకాలంలో మాత్రం అధికారంలో ఉన్న టీడీపీ ఇసుక ఉచితం అంటూనే అయినకాడికి దోచుకున్నారు. సొంతజేబులు నింపుకున్నారు. ఈ దోపిడీలన్నింటికీ జగన్ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. పక్కా ప్రణాళికతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇసుక నిల్వకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా నిర్దిష్ట రేట్లు నిర్ణయించారు. అదే సమయంలో ప్రభుత్వ ఆదాయం పెరిగేందుకూ చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో ఈ అంశంపై అక్కసంతా వెళ్లబోసుకున్నారు.
విశాఖలో ఒక ప్రదర్శన జరిపి ఇసుక కొరతవల్ల భవన నిర్మాణ కార్మికులు అవస్థలు పడుతున్నారని దుష్ప్రచారం చేశారు. టీడీపీ, జనసేన ఆరోపణలకు అండగా ఎల్లో మీడియా పలు దొంగ కథనాలను కూడా వండి వార్చింది. ఉదాహరణకు పొన్నూరు వద్ద ఒక వ్యక్తి ఇతర కారణాలతో చనిపోతే ఇసుక కొరత వల్లే ఆత్మహత్య చేసుకున్నారంటూ అసత్య కథనం రాసింది. ఆ తర్వాత 2024 ఎన్నికల వరకూ టీడీపీ, జనసేన పార్టీలు అదే తరహా ప్రచారం చేయడమే కాకుండా తాము అధికారంలోకి వస్తే మొత్తం ఇసుకంతా ఫ్రీ, ఫ్రీ అని ప్రచారం చేశారు.
ఎలాగైతేనేం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ నుంచి ఒకరు మంత్రి అయ్యారు. అప్పటి నుంచీ జనానికి అసలు సినిమా చూపించడం ఆరంభించారు. చంద్రబాబు ఉచిత ఇసుక ఇస్తున్నామని పైకి చెబుతుంటారు కానీ రాష్ట్రంలో ఎక్కడా ఉచితంగా దొరకదు. జగన్ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుక నిల్వ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన పది రోజుల్లోనే టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఇష్టారీతిన ధరలు కట్టి 40 లక్షల టన్నుల అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. పోనీ మిగిలిన 40 లక్షల టన్నుల ఇసుకైనా జనానికి ఉచితంగా అందిందా అంటే అదీ లేదు. దీంతో ప్రజలు అధిక ధరలు చెల్లించక తప్పలేదు.
ప్రస్తుతమైతే అసలు ఇసుక దొరకడమే గగనమైంది. జగన్ పాలనలో ఆ ప్రాంతాన్ని బట్టి ఇసుక టన్నుకు రూ.300 నుంచి రూ.500లకు దొరికేది. ట్రాక్టర్ ఇసుక రూ.నాలుగు నుంచి రూ.ఐదు వేలకు లభించేది. ఇప్పుడు అదే ఇసుక రూ.15 వేల నుంచి రూ.20 వేలు పలుకుతోందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. నదులు, వాగుల దగ్గర నుంచి కొంతమంది అక్రమంగా తవ్వి అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. ఏపీలో ఇసుక కొరత రావడంతో ఒడిషా నుంచి విశాఖ ప్రాంతానికి అక్రమ రవాణా చేసి దండుకున్నారు.
ఇసుక లారీ (18 టన్నులు)కి రూ.35 వేల నుంచి రూ.60 వేల వరకు ధర పలుకుతోంది. దీంతో కొన్నాళ్లుగా భవన నిర్మాణాలు తగ్గిపోయాయి. ఈ రంగంపై దాదాపు 45 లక్షల మంది ఆధారపడి ఉండటం గమనార్హం. తాపీ పని, రాడ్ బెండింగ్, ప్లంబింగ్..ఇలా 36 రకాల వృత్తుల వారు భవన నిర్మాణ రంగంలో ఉంటారు. ఇసుక లేకపోవడంతో మొత్తానికే ఎసరు వచ్చినట్టయింది. పనుల కోసం అడ్డాల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఇసుకను ఆన్ లైన్లో నేరుగా బుక్ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించినా అది ఎప్పుడు ఓపన్ అవుతుందో, ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలియడం లేదని అంటున్నారు. పోనీ బుక్ చేసుకోగలిగిన వారికైనా ఇసుక ఉచితంగా వస్తుందా అంటే అదీ జరగడం లేదు.
విజయవాడలో బ్లాక్‌లో 18 టన్నుల ఇసుక రూ.30 వేలు పలుకుతోందట. భీమవరంలో రూ.35 వేలు, తాడేపల్లి గూడెంలో రూ.35 వేలు, నరసాపురంలో రూ.26 వేల చొప్పున లారీ ఇసుకకు చెల్లించాల్సి వస్తోంది. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఇప్పుడు లారీకి రూ.10 వేలకు పైగా అదనపు భారం పడుతోందని అంచనా. గతంలో భవన నిర్మాణ కార్మికులకోసం అంటూ గొంతు చించుకున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు నోరు విప్పడం లేదు. సాక్షి మీడియాలో 18 టన్నుల ఇసుక ధర అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏ రకంగా ఉందీ తెలిపారు. అందులో అరకులోయ, పాడేరు వంటి చోట్ల అత్యధికంగా రూ. 54 వేలు ఉంటే, గుంటూరు రూ. 30 వేలు పలుకుతోందట.
ఈ పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం చక్కదిద్దలేకపోతున్నదంటూ సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు సైతం వాపోతున్నారు. ఇక టీడీపీ పత్రిక ఆంధ్రజ్యోతి ఉచిత ఇసుక, ధరల మరక అంటూ కథనాన్ని ఇచ్చింది. ఇందులో కూడా పూర్తిగా నిజాలు రాయకుండా చంద్రబాబు భజన చేస్తూనే కొన్ని సమస్యలను ప్రస్తావించింది. ఉచిత ఇసుక ఉద్దేశం ఉత్తమమట. ఆచరణలో బాలారిష్టాలు ఎదురవుతున్నాయని ఆంధ్రజ్యోతి సన్నాయినొక్కులు నొక్కింది.
ఐతే జిల్లా ఎడిషన్లలో మాత్రం కొద్దిపాటి వాస్తవాలు రాస్తున్నారు. ఉదాహరణకు భీమవరంలో లారీ ఇసుక రూ.30 వేల ధర పలుకుతోందని తెలిపారు. జగన్ టైమ్ లో రూ.18 వేలకే ఇసుక దొరికిందని అంగీకరించారు. సచివాలయాల్లో చలాన్లు తీసుకొని ఇసుక రవాణా చేసుకోవాలనే ప్రభుత్వం షరతు పెట్టినా దళారులు చలానాలు ముందే కట్టేసుకొని అధిక ధరలకు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. ఇసుక లారీల డ్రైవర్ల బాధలైతే ఇన్నీ అన్నీ కావు. రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతూ వారు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు.
ఐతే ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ లో మాత్రం జగన్ పాలనలో జనం చుక్కలు చూశారంటూ అబద్ధాలు రాయడానికి ఆంధ్రజ్యోతి సిగ్గుపడలేదు. విశేషమేమిటంటే అప్పట్లో ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చిన గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిని స్కామ్ చేశారంటూ టీడీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అప్పట్లో ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.నాలుగు వేల కోట్లకుపైగా ఆదాయం తెస్తే అది దోపిడీ అట. ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలు అడ్డంగా దోచేస్తే చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక హామీ నిలబెట్టుకున్నారట. ఇలాంటి తప్పుడు రాతలతో జనాన్ని మోసం చేసే యత్నం చేస్తూనే ఆశించిన స్థాయిలో ప్రజలకు ఊరట కలగలేదని కొన్ని చోట్ల గతంకంటే ఇప్పుడే భారంగా మారిందని ఒప్పుకోక తప్పలేదు. ఉచితానికి నిర్వహణ చార్జీల గండం అని రాశారేగానీ, కూటమి నేతల దోపిడీని మాత్రం కప్పిపుచ్చారు. జీఎస్టీ వేయడంపైన జనం ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇసుక కోసమే ఇన్నిపాట్లు పడాల్సి వస్తుంటే ఇక మిగిలిన రంగాల సంగతి చెప్పనక్కరలేదు. మొత్తంమీద చంద్రబాబు ప్రభుత్వం ప్రజలమీద ఇసుకాసురులను ఫ్రీగా వదిలేసింది.
కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment