ఖిలాషాపూర్‌లో పాపన్న నిర్మించిన కోట
సాక్షి, జనగామ : మొగల్ పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి బహుజన రాజ్య స్థాపనకు నడుం కట్టిన సర్దార్ సర్వాయి పాపన్నకు గుర్తింపు లభించడం లేదు. అణగారిన వర్గాలను ఏకం చేసి గోల్కొండ రాజ్యస్థాపనే ధ్యేయంగా దండయాత్ర ఆరంభించిన విప్లవయోధుడికి చరిత్ర పుటల్లో స్థానం దక్కకుండాపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో మరుగున పడిన పాపన్న జీవిత చరిత్రకు స్వరాష్ట్రంలోనే అదే దుస్థితి దాపురించింది.
నాటి పాలకుల అఘాయిత్యాలకు వ్యతిరేకంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వీరవిహారం చేసిన బహుజన యోధుడి చరిత్ర భావితరాలకు తెలియకుండా కనుమరుగవుతోంది. జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ కేంద్రంగా 17వ శతాబ్దంలో బహుజన రాజ్యస్థాపన చేసిన సర్వాయి పాపన్న జన్మదినాన్ని ఈనెల 18వ తేదీన జరుపుకోనున్నారు. పాపన్న చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరుతూ బుధవారం(నేటి) నుంచి ఈ నెల 7వ తేదీ వరకు వారం రోజుల పాటు స్ఫూర్తి యాత్రకు పిలుపునిచ్చారు. పాపన్న జీవిత చరిత్రపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
మొగలు ఆధిపత్యాన్ని ఢీకొట్టిన పాపన్న..
17వ శతాబ్దంలో దక్కన్ ప్రాంతంలో గోల్కొండ సామ్రాజ్యం సిరిసంపదలతో తులతూగుతుండేది. ధనిక ప్రాంతమైన గోల్కొండ రాష్ట్రంపై నాటి మొగలు పాలకుల కన్ను పడింది. ప్రపంచ రాజ్య విస్తరణలో భాగంగా మొగల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించడంలో భాగంగా దండయాత్రకు పూనుకున్నారు. ఈక్రమంలోనే క్రీ.శ.1687లో గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు స్వాధీనం చేసుకున్నారు. మొగలు పాలన క్రీ.శ. 1687 నుంచి క్రీ. శ.1724 వరకు కొనసాగింది.
ఈ కాలంలో పాలకులు నియమించుకున్న సుబేదార్ల ఆగడాలతో రాజ్యం మొత్తం ఆరాచకం నెలకొన్నది. ఎక్కువ పన్నులు వసూల్ చేయడం, ప్రజలను దోచుకోవడం, మహిళలపై దాడులు వీపరితంగా పెరిగిపోయాయి. భయంతో భయంతో ప్రజలు జీవిస్తున్న కాలంలోనే క్రీ.శ 1650లో పాపన్న జన్మించారు. గౌడ కులంలో జన్మించిన పాపన్న పశువుల కాపరిగా పని చేశారు. తర్వాత కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగించారు.
నాటి కులవృత్తుల వారితో మంచి సంబంధాలను కలిగిన పాపన్నకు నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి.ఈ క్రమంలోనే నాటి పాలకులు, వారి నియమించుకున్న సుబేదార్లు సాగిస్తున్న విధానాల కారణంగా పాపన్నలో రాజ్యకాంక్ష పెరిగింది. బలహీన వర్గాలు ఏకం అయితే రాజ్యాధికారానికి రావచ్చనే ఆలోచన చేసి సొంతం సైన్యం ఏర్పాటు చేసి బహుజన రాజ్యస్థాపనకు శ్రీకారం చుట్టారు.
తిరుగుబాటుకు చిహ్నంగా ఖిలాషాపూర్ కోట..
బలవంతులపై బలహీనుల తిరుగుబాటుకు చిహ్నంగా ఖిలాషాపూర్ కోటను నిర్మించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. బలవంతులైన మొగలు పాలకులపై సామాన్యులు పోరాటం సాగిస్తున్నారు. దండయాత్రలో భాగంగా ఖిలాషాపూర్‌లో మకాం వేసిన పాపన్నకు ఒక దృశ్యం కన్పించింది. వేటకుక్క కుందేలుపై దాడికి యత్నించింది.అయితే వేట కుక్కను కుందేలు తిరగబడి తరిమికొట్టింది. ఈ మట్టికి తిరుగుబాటు తత్వం ఉందని గ్రహించిన పాపన్న ఇక్కడే కోటను నిర్మించినట్లుగా ప్రచారంలో ఉంది.
అధికారిక ఉత్సవాల కోసం‘స్ఫూర్తి యాత్ర’..
బహుజన రాజ్య స్థాపకుడిగా గుర్తింపు పొందిన సర్వాయి పాపన్న జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌తో ‘సర్వాయి పాపన్న స్ఫూర్తి యాత్ర’కు శ్రీకారం చూట్టారు. ఈనెల 18వ తేదీన పాపన్న జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ట్యాంకుబండ్‌పై పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతోపాటు ఆయన నిర్మించిన కోటలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి, పాపన్న జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చడంతోపాటు జనగామ జిల్లాలో పాపన్న మ్యూజియంను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
గౌడ ఐక్య సాధన వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ‘తాటికొండ నుంచి గోల్కొండ వరకు స్ఫూర్తి యాత్ర’ను చేపట్టారు. సజీవసాక్ష్యాలుగా రాతి కోటలు..సర్వాయి పాపన్న నిర్మించినట్లుగా చెబుతున్న రాతి కోటలు ఆయన యుద్ధనీతికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో పాపన్న క్రీ.శ 1675లో రాతి కోటను నిర్మించారు. 20 అడుగుల ఎత్తులో రాతికోటను నిర్మించారు.
ఆ కోటపై నాలుగు వైపులా 50 అడుగుల ఎత్తుతో బురుజులు, మధ్యలో మరో బురుజును నిర్మించారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని తాటికొండ కోట, నల్లగొండ, హుస్నాబాద్ బురుజు, దూల్మిట్ట వంటి కోటలను నిర్మించారు. ఈ కోటల నిర్మాణం దూర ప్రాంతాల నుంచి శత్రువులు దండెత్తి వస్తే సులువుగా గుర్తించే విధంగా నిర్మాణం చేశారు. శత్రు దుర్భేద్యంగా పూర్తిగా రాతితో కోట నిర్మాణం చేశారు. అంతేకాకుండా గ్రామాల్లో బురుజులను నిర్మించారు. పాపన్న నిర్మించిన కట్టడాలు నేటికి కళ్ల ముందు కదలాడుతున్నాయి.
పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి
బహుజన రాజ్యస్థాపకుడిగా చరిత్రలో నిలిచిన సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి. పదో తరగతి తెలుగు పాఠ్యాంశంలో పాపన్న చరిత్రను పొందుపర్చాలి. స్వరాష్ట్రం ఏర్పడిన పాపన్నకు గుర్తింపు లభించడం లేదు. భావితరాలకు ఆయన చరిత్రను అందించాలి. పాఠ్య పుస్తకాల్లో చేర్చేవరకు ఉద్యమాలను ఆపేది లేదు.
తీగల సిద్ద్ధుగౌడ్, గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
పాపన్న ఆనవాళ్లను కాపాడాలి
పాపన్న జీవితంతో జనగామ జిల్లా చరిత్ర ముడిపడి ఉంది. పాపన్న నిర్మించిన ఆనవాళ్లు ఉన్నాయి. కోటలు, బురుజులను పర్యాటక ప్రాంతాల జాబితాలో చేర్చి అభివృద్ధి చేయాలి. పాపన్న పేరుతో మ్యూజియం ఏర్పాటు చేస్తే ముందు తరాల వారికి పాపన్న చరిత్ర తెలుస్తుంది. ప్రభుత్వమే అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహించాలి.
మేకపోతుల ఆంజనేయులుగౌడ్, పోపా అధ్యక్షుడు
గోల్కొండ కోటపై బహుజనుల జెండా..
బహుజన రాజ్యస్థాపన ధ్యేయంగా సర్వాయి పాపన్న(క్రీ.శ 1650క్రీ.శ 1709) దండయాత్రను చేపట్టి గోల్కొండ కోటపై బహుజను జెండాను ఎగురవేశారు. తన తోటి బహుజనులను సమీకరించి సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఔరంగజేబు మరణం తర్వాత బలహీనపడిన మొగల్ సామ్రాజ్యంపై దండెత్తి పలు కోటలను స్వాధీనం చేసుకున్నారు. ఖిలాషాపూర్ కోట కేంద్రంగా వరంగల్, భువనగిరి, చివరికి గోల్కొండను వశపర్చుకున్నారు. పాపన్న విజయాలను ఖిలాషాపూర్ కేంద్రంగానే సాధించినట్లుగా చరిత్ర కారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment