సాక్షి, జనగామ: ఎవరు ఎన్ని కుట్రలు, కుయుక్తులు చేసినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కావ్య విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. తమకు బీఆర్‌ఎస్ పార్టీ డబ్బులు ఇచ్చినట్టు నిరూపిస్తే తాము ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు.
కాగా, కడియం స్టేషన్ ఘన్‌పూర్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి మేము రూ.10కోట్లు తీసుకున్నామని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది నిజమని ఎలాంటి ఆధారాలు చూపించినా, నిరూపించినా మేము ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటాము. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కావ్య గెలుపు ఖాయమైంది. సీఎం రేవంత్ ఆశీర్వాదంతో నేను వరంగల్‌ను అభివృద్ధి చేస్తాను.
బీజేపీ వాళ్ళు రాజ్యాంగం మీద అవగాహన లేక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. చేసిన పని చెప్పడానికి ఏమీ లేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నా కూతురు కావ్య ఇక్కడే పుట్టింది, ఇక్కడే కడియం ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమలు చేసింది. 2017లో ఐదుగురు జడ్జిల ధర్మసానం భారతదేశంలో మతం మారినంత మాత్రాన కులం మారదు అని తెలిపింది. పిల్లలకు తండ్రి కులం వర్తిస్తుంది. కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాను. నా 30ఏళ్ల రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. నా నిజాయితే నాకు పెట్టుబడి.
నేను ఏ పార్టీకి వెన్ను పోటు పొడవలేదు. కానీ నా ద్వారా ఎదిగిన ఆరూరి రమేష్ నాకు వెన్నుపోటు పొడిచాడు. నేను ఛాలెంజ్ చేస్తున్న నీదగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నానా చెప్పాలి. 2014, 2018లో నీ గెలుపు కోసం నేను ప్రచారం చేసాను. నువ్వు చేసిన భూకబ్జాల కారణంగా ఓడిపోయావు. ఓటమి భయంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మందకృష్ణ నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఒక్క నాపై మాత్రమే ఎందుకు విమర్శలు చేస్తున్నావు. నాది మాదిగ ఉప కులం. మాదిగలకు ద్రోహం చేస్తున్నది మందకృష్ణ. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం అంటున్నా పార్టీకి ఓటు వేయమని ఎలా చెపుతున్నావు. దీనికి సమాధానం చెప్పాలి. నీ నాయకత్వం సరిగా లేకపోవడం వల్లనే ఎంఆర్‌పీఎస్‌లో చీలికలు వచ్చాయి అంటూ విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment