సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న పొలిటికల్ వాతావరణం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్ పార్టీ బరిలోకి దింపిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించగా.. కొందరు సిట్టింగ్‌లకు సీటు ఖరారు కాలేదు. దీంతో, సదరు నేతలు గుర్రుగా అధిష్టానంపై సీరయస్ అవుతుండగా.. మరికొందరు నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు.
పొలిటికల్ గేమ్ ప్లాన్..
తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, అసంతృప్త నేత టీ.రాజయ్య.. కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో భేటీ కావడం పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారింది. అయితే, హన్మకొండ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో దామోదర రాజనర్సింహతో కలిసి రాజయ్య పాల్గొన్నారు. దీంతో, వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టికెట్ దక్కకపోవడంతో బీఆర్‌ఎస్‌పై ఆగ్రహంతో ఉన్న రాజయ్య.. కాంగ్రెస్‌లో చేరేందుకే దామోదరతో భేటీ అయినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక, ఇటీవల ఎమ్మెల్యే రాజయ్య చేసిన కామెంట్స్ కూడా ఇందుకు బలాన్ని చేరుకూరుస్తున్నాయి.
కడియం వర్సెస్ రాజయ్య..
ఇక, స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి సీటు ఖరారు చేశారు సీఎం కేసీఆర్. దీంతో, రాజయ్య.. కడియం మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. సమయం దొరికిన ప్రతీ సందర్భంలో కడియంపై రాజయ్య తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో రాజయ్య మాట్లాడుతూ కడియంపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో సొమ్మొకడిది సోకొకడిదిగా అన్నట్లుగా పరిస్ధితి మారిందన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ కాకుండా ఎవరు అడ్డుపడ్డారో అందరికీ తెలుసు. మేం చేసిన పనులను తామే చేశామని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్ధితి నెలకొంది. ఎక్కడో ఉండి ఇక్కడ పనులు చేశామని చెప్పుకోవడం సరైన పద్దతి కాదని హితవు పలికారు. పనులు చేసి నిత్యం ప్రజల్లో ఉండేది ఒకరైతే.. అన్ని తానే చేసినట్టు కలర్ ఇచ్చేది మరొకరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రేఖా నాయక్ సవాల్..
ఇదిలా ఉండగా.. బీఆర్‌ఎస్ నుంచి టికెట్ దక్కని నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్‌కు టికెట్ దక్కకపోవడంతో ఆమె కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌పై సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్‌ఎస్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోతున్నట్టు తెలిపారు. బీఆర్‌ఎస్ అభ్యర్థిని ఓడించడమే తన టార్గెట్ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో, రాజకీయంగా రసవత్తరంగా మారింది.
ఇది కూడా చదవండి: గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ.. అయితే కాంగ్రెస్ కోటాలోనే.!
Comments
Please login to add a commentAdd a comment