సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను విజయవంతంగా మోసం చేసిందని.. విజయోత్సవాలను కాకుండా అపజయోత్సవాలు నిర్వహించాలంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలని.. వరంగల్ డిక్లరేషన్, మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పది నెలల్లో రాష్ట్రాన్ని పదేళ్ల వెనక్కి తీసుకువెళ్లారని.. ‘ఎవరనుకున్నరు ఇట్లవునని.. ఎవరనుకున్నరు ఇట్లవునని’ ప్రజాకవి కాళోజీ నినదించినట్లు కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగాపడ్డారన్నారు. రైతులు దారుణంగా మోసపోయారని రోరపించారు. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, అపజయాలను కప్పిపుచ్చుకునేందుకు వరంగల్ వేదికగా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు.
ఏం సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారు రేవంత్ రెడ్డి? అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు. ఇదే వరంగల్ వేదికగా ఇచ్చిన రైతు డిక్లరేషన్ కు ఏడాది అయినా అతీగతీ లేదని విమర్శించారు. డిక్లరేషన్‌లో చెప్పిన మొట్టమొదటి హామీ రూ.2లక్షల రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదన్నారు. రైతులు, కౌలు రైతులకు ఇస్తామన్న రూ.15వేల భరోసా దిక్కులేదని.. ఉపాధిహామీ రైతు కూలీలకు ఏడాదికి ఇస్తామన్న 12వేలు ఇవ్వనేలేదన్నారు.
పది రకాల పంటలకు ఇస్తామన్న బోనస్ బోగస్ చేశారని విమర్శించారు. ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ఇందుకేనా మీ వరంగల్ విజయోత్సవ సభ రేవంత్ రెడ్డి? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ పది నెలల పాలనలో రాష్ట్రాభివృద్ధి పదేండ్ల వెనక్కి వెళ్లిందని.. కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ, నేడు తిరోగమనం బాట పట్టిందని విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment