sarvai papanna
-
సర్వాయి పాపన్న పోస్టల్ స్టాంపులు ముద్రించాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని మారుమూల పల్లెలో జన్మించి రాజుగా ఎదిగిన దివంగత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌పై వివిధ డినామినేషన్లలో పోస్టల్ స్టాంపులు ముద్రించి విడుదల చేయాలని ఎక్సైజ్ శాఖమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్ రీజినల్ పోస్ట్‌మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డిని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ లేఖ రాశారు. 17వ శతాబ్దంలో వరంగల్ జిల్లా ఘన్పూర్ మండలం తాటికొండలో జన్మించిన, వరంగల్ జిల్లాలోని ఖిల్లాషాపూర్ నుంచి పాలించిన నాయకుడు సర్వాయి పాపన్న అని పేర్కొన్నారు. ఆయన్ను చరిత్రకారులు బార్బరా, థామస్ మెట్కాఫ్ ‘రాబిన్ హుడ్–లైక్’ అని వర్ణించారని గుర్తు చేశారు. మొఘల్ పాలకుడు ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రజలనే సైన్యంగా నియమించుకున్న నాయకుడు సర్దార్ పాపన్న అని అన్నారు. -
Telangana: అన్ని జిల్లా కలెక్టరేట్లలో పాపన్న జయంతి వేడుకలు: శ్రీనివాస్ గౌడ్
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: బహుజనుల కోసమే పుట్టిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ నెల 18న అన్ని జిల్లా కలెక్టరేట్లలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు జరుగుతాయని, రవీంద్ర భారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం, తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో, చిక్కడపల్లిలోని కల్లు కంపౌండ్ వద్ద తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ... సర్వాయి పాపన్న కులవృత్తులను ఏకం చేసిన గొప్ప వ్యక్తని కొనియాడారు. కేంబ్రిడ్జి వర్సిటీలో పాపన్న విగ్రహాన్ని పెట్టారని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. పాపన్న జయంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహించాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ నెల 18న ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో జయంతి వేడుకలను నిర్వహిస్తుందని చెప్పారు. సర్వాయి పాపన్న పేరున భవనం త్వరలో ప్రారంభం అవుతుందన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. బహుజన విప్లవకా రుడు సర్వాయి పాపన్న స్ఫూర్తితో బహుజనులంతా ఏకమై రాజ్యాధికారం కోసం పయనించాలని పిలుపునిచ్చారు. జయంతి వేడుకలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించటం గొప్ప పరిణామన్నారు. కార్యక్రమాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎంపీలు మల్లు రవి, వి.హన్మంతరావు, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్కుమార్గౌడ్, విప్లవ గాయని విమలక్క, కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, ఎంవి.రమణ, బెల్లయ్యనాయక్, తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలరాజ్‌గౌడ్, గౌడ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
కల్లుకు పూర్వ వైభవం తీసుకువస్తాం
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: దేవతలు సురాపాకంగా భావించి సేవించిన కల్లు అమృతంలాంటిదని ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కల్లుకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు తనవంతు కృషిచేస్తానని చెప్పారు. సోమవారం చిక్కడపల్లిలో తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బహుజన విప్లవ వీరుడు సర్వాయి పాపన్న 371వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న నూతన విగ్రహాన్ని శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బానిస బతుకులకు విముక్తి కల్పించేందుకు పాపన్న చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఒక గౌడ కులానికే కాకుండా బడుగు, బలహీన వర్గాల విముక్తి కోసం ఆయన ఎంతగానో కృషిచేశారన్నారు. కొంతమంది కల్లు మంచిది కాదని దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఏర్పడ్డాక కల్లుకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నామని, నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో నీరా స్టాల్స్‌ను ఏర్పాటుచేశామని తెలిపారు. తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కన్వీనర్ వెంకన్నగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్‌కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ గౌడ్, రమణ, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎంపీలు నర్సయ్యగౌడ్, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి సత్యనారాయణ, అజన్‌కుమార్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, రాజేంద్రప్రసాద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
15 వేల ఏళ్ల క్రితమే సిద్దిపేటకు వలసలు
ఆదిమానవుడి ఆనవాళ్లు సిద్దిపేట జిల్లాలో బయటపడుతున్నాయి. పాత రాతియుగం, కొత్త రాతియుగం, రాగి యుగం, ఆధునిక శిలాయుగం ఇలా అన్ని యుగాల మానవులు ఇక్కడ నివసించినట్లు రుజువులు కన్పిస్తున్నాయి. జైన, బౌద్ధ మతాలు, శాతవాహనులు, చాణిక్యులు, కాకతీయులు ఇలా పలు రాజవంశీయులు ఇక్కడ పాలించినట్లుగా, ఈ ప్రాంతంలో కలియతిరిగినట్లుగా చెప్పే శాసనాలు దర్శనమిస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఏ మూలన చూసినా పురాతన యుగం విరాజిల్లినట్లుగా వస్తువులు, శాసనాలు, వ్రిగహాలు, ఆయుధాలు, పూసలు, సమాధులు తదితరాలు దర్శనమిస్తున్నాయి. - సాక్షి, సిద్దిపేట ఆదిమానవుడి అడ్డాగా ‘పుల్లూరు’ జంతువులతో సమానమైన జీవనం సాగించిన ఆదిమానవుడు తర్వాత ఆహార అన్వేషణ, రక్షణ కోసం సమూహాలుగా ఉండేవారు. ఇందులో భాగంగానే సిద్దిపేట జిల్లాలోని పుల్లూరును వాళ్లు రాజ్యం గా ఏర్పాటు చేసుకొని జీవించినట్లు ఇటీవల ఆధారాలు లభించాయి. వారు పూజించిన శక్తి స్వరూపిణి అమ్మవారి విగ్రహం, ప్రత్యేక రాతి గుహల నడుమ నిర్మించిన సమాధులు, వినియోగించిన పలు రకాల వస్తువులు లభించాయి. ఈ వస్తువులను పరిశీలించిన చరిత్రకారులు క్రీ.పూ 5 వేల ఏళ్ల క్రితం నాటివని గుర్తించారు. సింగరాయకొండలో ‘అమ్మదేవత’ ఆదిమానవుడు స్త్రీని దేవతగా పూజించారని చరిత్రలో విన్నాం. సిద్దిపేట జిల్లా కూరెళ్ల సమీపంలో ఉన్న సింగరాయకొండలో అమ్మ దేవత విగ్రహం బయటపడింది. స్త్రీమూర్తి అందాన్ని వర్ణించి చెక్కిన ఈ విగ్రహం ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత గలదిగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విగ్రహానికి సమీపంలో బౌద్ధ బ్రహ్మ కూడా లభించడం విశేషం. ఆయా పరిసర ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసుకునేందుకు బావుల నిర్మాణం, వారు వినియోగించిన మట్టి పాత్రలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ బౌద్ధ బ్రహ్మ విగ్రహం పాకిస్తాన్లో ఒకచోట లభించగా మరొకటి సిద్దిపేట జిల్లా సింగరాయకొండ సమీపంలో లభించడం గమనార్హం. విరాజిల్లిన జైన, బౌద్ధ మతం జిల్లాలోని శనిగరం, నంగునూరు, కూరెళ్ల, కోహెడ ప్రాంతాల్లో జైన మతం విరాజిల్లినట్లు ఆధారాలు లభించాయి. జైనమత తీర్థాంకరుల్లో 23వ వాడైన పార్శనాథుడి విగ్రహం ఇటీవల శనిగరం గుట్టపై లభించింది. జైనుల కాలంలో మహిళాయక్షిణి, పక్కన చంటి పిల్లవాడు పట్టుకున్న అపురూప శిల్పం లభించింది. ఈ శిల్పమే తర్వాత కాలంలో గొల్ల కేతమ్మగా పిలువబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఆదిమానవుడు ప్రత్యేక వరుసలో బండరాళ్లను పేర్చి నిర్మించిన సమాధులు కూడా లభించాయి. ఈ చరిత్ర అంతా జైనుల కాలం నాటిదే అని పురావస్తు శాఖ అధికారులు ధ్రువీకరించారు. కూరెళ్లలో జైనమత గుర్తులుగా భావించే చౌముఖి శిల్పం తవ్వకాల్లో బయటపడింది. దుద్దెడ గ్రామ శివాలయంలో దిగంబరుడైన జైన తీర్థాంకరుల విగ్రహాలు లభించాయి. కొమురవెల్లి గుట్టపైన జైన మత విగ్రహాలు, ఆనవాళ్లు లభించాయి. తొగుట మండలం ఆల్వాల్లోనూ జైన తీర్థాంకుల విగ్రహాలు లభించాయి. పాపన్నగుట్టపై అరుదైన అష్టభుజి తంత్ర భైరవుడు హుస్నాబాద్ మండలం పాపన్న(సర్వాయిపాపన్న) గుట్టగా పిలువబడే ప్రాంతంలో అరుదైన అష్టభుజి తంత్ర భైరవుడి విగ్రహం బయటపడింది. ఎనిమిది భుజాలతో భయంకరమైన స్వరూపిణిగా ఉన్న ఈ భైరవుడు ఆదిమానవులు, తర్వాత జైనుల పూజలు అందుకునేవారని నానుడి. వీరిని ఆరాధించిన వారి కోర్కెలు నెరవేరుతాయనే నమ్మకం. అందుకోసమే భైరవుడికి జంతుబలి, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయా ప్రాంతాల్లో లభిస్తున్న వస్తువుల ఆధారంగా తెలుస్తోందని పురావస్తుకారులు చెబుతున్నారు. చతురస్రాకారంలో సమాధులు ఆదిమానవుడి సమాధులు సిద్దిపేట జిల్లావ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. నర్మెటలో మెనిహీర్, శనిగరం, పుల్లూరు, కొండపాక, జగదేవ్‌పూర్, దామరకుంట, తంగెళ్లపల్లి గ్రామాల సమీ పంలో ట్రైనీడ్స్(త్రిశూలం) ఆకారంలో బండరాతిపై చెక్కిన శిల్పాలు దొరికాయి. వీటి కింది భాగంలో ఆది మానవుడి సమాధులు ఉండటం గమనార్హం. చుట్టూ బండరాతి ఫెన్సిం గ్, రంగురంగుల రాళ్లు, చతురస్రాకారంలో నిర్మాణాలు చేపట్టి మధ్యలో సమాధులు నిర్మించారు. ఈ నిర్మాణాలను ఆధారంగా చేసుకొని మృతి చెందినవ్యక్తి స్థాయిని అంచనా వేయొచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాజ్యరక్షకులు ‘వీరగల్లులు’ రాజ్యంలోని ప్రజలను ఖడ్గమృగాల బారి నుంచి రక్షించేందుకు, శత్రువుల దండయాత్రలను తిప్పికొట్టేందుకు వీరగల్లులు ఉండేవారు. శాతవాహనులు, చాణిక్యులు, కాకతీయుల కాలంలో వివిధ రూపాలతో వీరు దర్శనమిచ్చేవారు. ప్రధానంగా రుద్రదేవుడి కాలంలో ఆకునూరు, కొండపాక ప్రాంతాల్లో ఎక్కంటీలున్నట్లు (ధనుర్థారుల సైన్యం) దేవాలయాల్లో చెక్కిన శాసనాలు చెబుతున్నాయి. దూలిమిట్ట ప్రాంతంలో లభించిన వీరగల్లు ఆహార్యం కల్యాణి చాణిక్యుల కాలం నాటివిగా స్పష్టం అవుతోంది. కోహెడ ప్రాంతంలో లభించిన వీరగల్లు యుద్ధం చేస్తున్న దృశ్యాన్ని సూచిస్తోంది. ఇలా తొమ్మిది రకాలుగా ఉన్న వీరగల్లుల ప్రతిమలు ప్రతి గ్రామపొలిమేరల వద్ద ఉన్నాయి. వీటినే ఇప్పుడు హనుమంతులుగా, వీరభద్రులుగా, గ్రామరక్షకులుగా పూజిస్తున్నారు. ఆది మానవుడు నడయాడిన నేల సిద్దిపేట జిల్లాలో నలుమూలలా ఆది మానవుడు నడయాడినట్లు చరిత్ర చెబుతోంది. క్రీస్తుపూర్వం 15 వేల ఏళ్ల క్రితమే యూరప్ నుంచి ఒక తెగ ఈ ప్రాంతానికి వచ్చి జీవించినట్లు ఆధారాలు ఉన్నాయి. సమాధులు, వారు వాడిన వస్తువులు, జైన, బౌద్ధ మత ప్రచారం. వివిధ భంగిమల్లో స్త్రీల శిల్పాలు సాక్షాలుగా నిలుస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లభించని అరుదైన పురావస్తు సంపద సిద్దిపేట జిల్లాలో లభించడం విషేశం. –వేముగంటి మురళి, చరిత్రకారుడు -
సర్దార్‌పై చిన్నచూపు..!
సాక్షి, జనగామ : మొగల్ పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి బహుజన రాజ్య స్థాపనకు నడుం కట్టిన సర్దార్ సర్వాయి పాపన్నకు గుర్తింపు లభించడం లేదు. అణగారిన వర్గాలను ఏకం చేసి గోల్కొండ రాజ్యస్థాపనే ధ్యేయంగా దండయాత్ర ఆరంభించిన విప్లవయోధుడికి చరిత్ర పుటల్లో స్థానం దక్కకుండాపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో మరుగున పడిన పాపన్న జీవిత చరిత్రకు స్వరాష్ట్రంలోనే అదే దుస్థితి దాపురించింది. నాటి పాలకుల అఘాయిత్యాలకు వ్యతిరేకంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వీరవిహారం చేసిన బహుజన యోధుడి చరిత్ర భావితరాలకు తెలియకుండా కనుమరుగవుతోంది. జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ కేంద్రంగా 17వ శతాబ్దంలో బహుజన రాజ్యస్థాపన చేసిన సర్వాయి పాపన్న జన్మదినాన్ని ఈనెల 18వ తేదీన జరుపుకోనున్నారు. పాపన్న చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరుతూ బుధవారం(నేటి) నుంచి ఈ నెల 7వ తేదీ వరకు వారం రోజుల పాటు స్ఫూర్తి యాత్రకు పిలుపునిచ్చారు. పాపన్న జీవిత చరిత్రపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. మొగలు ఆధిపత్యాన్ని ఢీకొట్టిన పాపన్న.. 17వ శతాబ్దంలో దక్కన్ ప్రాంతంలో గోల్కొండ సామ్రాజ్యం సిరిసంపదలతో తులతూగుతుండేది. ధనిక ప్రాంతమైన గోల్కొండ రాష్ట్రంపై నాటి మొగలు పాలకుల కన్ను పడింది. ప్రపంచ రాజ్య విస్తరణలో భాగంగా మొగల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించడంలో భాగంగా దండయాత్రకు పూనుకున్నారు. ఈక్రమంలోనే క్రీ.శ.1687లో గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు స్వాధీనం చేసుకున్నారు. మొగలు పాలన క్రీ.శ. 1687 నుంచి క్రీ. శ.1724 వరకు కొనసాగింది. ఈ కాలంలో పాలకులు నియమించుకున్న సుబేదార్ల ఆగడాలతో రాజ్యం మొత్తం ఆరాచకం నెలకొన్నది. ఎక్కువ పన్నులు వసూల్ చేయడం, ప్రజలను దోచుకోవడం, మహిళలపై దాడులు వీపరితంగా పెరిగిపోయాయి. భయంతో భయంతో ప్రజలు జీవిస్తున్న కాలంలోనే క్రీ.శ 1650లో పాపన్న జన్మించారు. గౌడ కులంలో జన్మించిన పాపన్న పశువుల కాపరిగా పని చేశారు. తర్వాత కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగించారు. నాటి కులవృత్తుల వారితో మంచి సంబంధాలను కలిగిన పాపన్నకు నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి.ఈ క్రమంలోనే నాటి పాలకులు, వారి నియమించుకున్న సుబేదార్లు సాగిస్తున్న విధానాల కారణంగా పాపన్నలో రాజ్యకాంక్ష పెరిగింది. బలహీన వర్గాలు ఏకం అయితే రాజ్యాధికారానికి రావచ్చనే ఆలోచన చేసి సొంతం సైన్యం ఏర్పాటు చేసి బహుజన రాజ్యస్థాపనకు శ్రీకారం చుట్టారు. తిరుగుబాటుకు చిహ్నంగా ఖిలాషాపూర్ కోట.. బలవంతులపై బలహీనుల తిరుగుబాటుకు చిహ్నంగా ఖిలాషాపూర్ కోటను నిర్మించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. బలవంతులైన మొగలు పాలకులపై సామాన్యులు పోరాటం సాగిస్తున్నారు. దండయాత్రలో భాగంగా ఖిలాషాపూర్‌లో మకాం వేసిన పాపన్నకు ఒక దృశ్యం కన్పించింది. వేటకుక్క కుందేలుపై దాడికి యత్నించింది.అయితే వేట కుక్కను కుందేలు తిరగబడి తరిమికొట్టింది. ఈ మట్టికి తిరుగుబాటు తత్వం ఉందని గ్రహించిన పాపన్న ఇక్కడే కోటను నిర్మించినట్లుగా ప్రచారంలో ఉంది. అధికారిక ఉత్సవాల కోసం‘స్ఫూర్తి యాత్ర’.. బహుజన రాజ్య స్థాపకుడిగా గుర్తింపు పొందిన సర్వాయి పాపన్న జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌తో ‘సర్వాయి పాపన్న స్ఫూర్తి యాత్ర’కు శ్రీకారం చూట్టారు. ఈనెల 18వ తేదీన పాపన్న జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ట్యాంకుబండ్‌పై పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతోపాటు ఆయన నిర్మించిన కోటలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి, పాపన్న జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చడంతోపాటు జనగామ జిల్లాలో పాపన్న మ్యూజియంను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గౌడ ఐక్య సాధన వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ‘తాటికొండ నుంచి గోల్కొండ వరకు స్ఫూర్తి యాత్ర’ను చేపట్టారు. సజీవసాక్ష్యాలుగా రాతి కోటలు..సర్వాయి పాపన్న నిర్మించినట్లుగా చెబుతున్న రాతి కోటలు ఆయన యుద్ధనీతికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో పాపన్న క్రీ.శ 1675లో రాతి కోటను నిర్మించారు. 20 అడుగుల ఎత్తులో రాతికోటను నిర్మించారు. ఆ కోటపై నాలుగు వైపులా 50 అడుగుల ఎత్తుతో బురుజులు, మధ్యలో మరో బురుజును నిర్మించారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని తాటికొండ కోట, నల్లగొండ, హుస్నాబాద్ బురుజు, దూల్మిట్ట వంటి కోటలను నిర్మించారు. ఈ కోటల నిర్మాణం దూర ప్రాంతాల నుంచి శత్రువులు దండెత్తి వస్తే సులువుగా గుర్తించే విధంగా నిర్మాణం చేశారు. శత్రు దుర్భేద్యంగా పూర్తిగా రాతితో కోట నిర్మాణం చేశారు. అంతేకాకుండా గ్రామాల్లో బురుజులను నిర్మించారు. పాపన్న నిర్మించిన కట్టడాలు నేటికి కళ్ల ముందు కదలాడుతున్నాయి. పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి బహుజన రాజ్యస్థాపకుడిగా చరిత్రలో నిలిచిన సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి. పదో తరగతి తెలుగు పాఠ్యాంశంలో పాపన్న చరిత్రను పొందుపర్చాలి. స్వరాష్ట్రం ఏర్పడిన పాపన్నకు గుర్తింపు లభించడం లేదు. భావితరాలకు ఆయన చరిత్రను అందించాలి. పాఠ్య పుస్తకాల్లో చేర్చేవరకు ఉద్యమాలను ఆపేది లేదు. తీగల సిద్ద్ధుగౌడ్, గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాపన్న ఆనవాళ్లను కాపాడాలి పాపన్న జీవితంతో జనగామ జిల్లా చరిత్ర ముడిపడి ఉంది. పాపన్న నిర్మించిన ఆనవాళ్లు ఉన్నాయి. కోటలు, బురుజులను పర్యాటక ప్రాంతాల జాబితాలో చేర్చి అభివృద్ధి చేయాలి. పాపన్న పేరుతో మ్యూజియం ఏర్పాటు చేస్తే ముందు తరాల వారికి పాపన్న చరిత్ర తెలుస్తుంది. ప్రభుత్వమే అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహించాలి. మేకపోతుల ఆంజనేయులుగౌడ్, పోపా అధ్యక్షుడు గోల్కొండ కోటపై బహుజనుల జెండా.. బహుజన రాజ్యస్థాపన ధ్యేయంగా సర్వాయి పాపన్న(క్రీ.శ 1650క్రీ.శ 1709) దండయాత్రను చేపట్టి గోల్కొండ కోటపై బహుజను జెండాను ఎగురవేశారు. తన తోటి బహుజనులను సమీకరించి సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఔరంగజేబు మరణం తర్వాత బలహీనపడిన మొగల్ సామ్రాజ్యంపై దండెత్తి పలు కోటలను స్వాధీనం చేసుకున్నారు. ఖిలాషాపూర్ కోట కేంద్రంగా వరంగల్, భువనగిరి, చివరికి గోల్కొండను వశపర్చుకున్నారు. పాపన్న విజయాలను ఖిలాషాపూర్ కేంద్రంగానే సాధించినట్లుగా చరిత్ర కారులు చెబుతున్నారు. -
ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి
షాద్‌నగర్: సర్ధార్ సర్వాయి పాపన్న జయంతిని పట్టణంలో గౌడ సంఘం, యువజన గౌడ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యకూడలిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యకూడలి నుంచి ప్రభుత్వఆస్పత్రి వరకు ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బెడ్డ్రు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడు తూ పాపన్న గ్రామీణ ప్రాంతంలో అతిసాధారణ కుటుంబంలో జన్మించి బడుగు, బలహీన వర్గాల అధిపత్యం కోసం తిరుగుబాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ నెల 20న యూనివర్సల్ ఫంక్షన్హల్లో జయంతి ఉత్సవాలను చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మణికొండ రంగయ్యగౌడ్, వన్నాడ ప్రకాష్‌గౌడ్, మద్దూరి అశోక్‌గౌడ్, జినికుంట రాములుగౌడ్, కట్ట వెంకటేష్‌గౌడ్, పాలకొండ రజనికాంత్గౌడ్,జనార్ధన్‌గౌడ్, శేఖర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. లింగారెడ్డిగూడలో.. మండల పరిధిలోని లింగారెడ్డిగూడలో సర్ధార్ సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వివేకానందుని విగ్రహం వద్ద పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసిఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నారాయణగౌడ్, మాజీ సర్పంచ్ బాలనగర్ నర్సింహులు, అంజయ్యగౌడ్, సురేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న విగ్రహా న్ని ఏర్పాటుచేయాలి
సూర్యాపేట : ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి, బస్సుయాత్ర కన్వీనర్ ఎంవీ రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వరంగల్ జిల్లా కిలాషాపురంలో ప్రారంభమైన బస్సుయాత్ర నల్గొండ జిల్లాలో ముఖ్యమైన పట్టణాలు తిరుగుతూ సూర్యాపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా గాంధీపార్కులో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం నూతన కల్లు విధానాన్ని రూపొందించి కల్లుగీత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించాలని కోరారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలను నెలకొల్పి మీరా ప్రాజెక్టును నిర్మించాలన్నారు. ఆగస్టు 18 వరకు ప్రభుత్వం గీత కార్మికులు పెట్టిన డిమాండ్లు పరిష్కారం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కార్మికులను కదిలించి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అంతకుముందు పట్టణంలో భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి గౌడకులస్తులు, మోకుముస్తాదులతో, తాటిమట్టలతో పెద్ద ఎత్తున ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర నాయకులు గోపగాని వెంకట్‌నారాయణగౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాలరాజుగౌడ్, ఎల్గూరి గోవింద్, వర్ధెల్లి బుచ్చిరాములు, జలగం శ్రీనివాస్, బూడిద గోపి, ఉయ్యాల నగేష్, జ్యోతి, లక్ష్మణ్‌గౌడ్, బైరు వెంకన్నగౌడ్, కసగాని లక్ష్మి, బైరు శైలేందర్‌గౌడ్, పొలగాని బాలుగౌడ్, జెర్రిపోతుల కృష్ణ, మడ్డి అంజిబాబు, కృష్ణ, మట్టిపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.