సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో మాట్లాడుతున్న మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తదితరులు
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: బహుజనుల కోసమే పుట్టిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ నెల 18న అన్ని జిల్లా కలెక్టరేట్లలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు జరుగుతాయని, రవీంద్ర భారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం, తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో, చిక్కడపల్లిలోని కల్లు కంపౌండ్ వద్ద తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ... సర్వాయి పాపన్న కులవృత్తులను ఏకం చేసిన గొప్ప వ్యక్తని కొనియాడారు. కేంబ్రిడ్జి వర్సిటీలో పాపన్న విగ్రహాన్ని పెట్టారని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. పాపన్న జయంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహించాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ఈ నెల 18న ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో జయంతి వేడుకలను నిర్వహిస్తుందని చెప్పారు. సర్వాయి పాపన్న పేరున భవనం త్వరలో ప్రారంభం అవుతుందన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. బహుజన విప్లవకా రుడు సర్వాయి పాపన్న స్ఫూర్తితో బహుజనులంతా ఏకమై రాజ్యాధికారం కోసం పయనించాలని పిలుపునిచ్చారు.
జయంతి వేడుకలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించటం గొప్ప పరిణామన్నారు. కార్యక్రమాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎంపీలు మల్లు రవి, వి.హన్మంతరావు, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్‌కుమార్‌గౌడ్, విప్లవ గాయని విమలక్క, కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, ఎంవి.రమణ, బెల్లయ్యనాయక్, తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలరాజ్‌గౌడ్, గౌడ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment