సూర్యాపేట కలెక్టరేట్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన సోలార్ పార్కింగ్ షెడ్
జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో సోలార్ పార్కింగ్ షెడ్ల ఏర్పాటు దిశగా తెలంగాణ రెడ్కో (రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా సోలార్ పార్కింగ్ షెడ్లను ఏర్పాటు చేయగా తాజాగా ఇతర జిల్లాల్లోనూ వాటి ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సూర్యా పేట, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ల క్యాంపస్‌లలో సోలార్ పార్కింగ్ షెడ్‌ల నిర్మాణం పూర్తయింది. 20న సూర్యాపేట ప్లాంటును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.– సాక్షి, హైదరాబాద్
ఖమ్మంలో 200 కేవీ సామర్థ్యంతో..
ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో 200 కేవీ (కిలోవాట్ల) గ్రిడ్ అనుసంధానిత సోలార్ విద్యుత్ ప్లాంటును తెలంగాణ రెడ్కో ఏర్పాటు చేసింది. పార్కింగ్ స్థలాన్ని సద్వినియోగం చేసుకొనేలా పార్కింగ్ ప్రాంత పైభాగంలో సోలార్ ప్యానల్స్‌ను అమర్చింది. ప్రస్తుతం కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో హైటెన్షన్ సర్వీస్‌లో నెలకు 14 వేల యూనిట్లకుపైగా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు.
లోటెన్షన్ సర్వీస్‌లో మరో 14 వేల యూనిట్లకుపైగా విద్యుత్ ఖర్చవుతోంది. తాజాగా 200 కేవీ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో 24 వేల యూనిట్ల వరకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరగనుంది.దీనివల్ల రెండు సర్వీసుల్లో కలిపి నెలకు 4–5 వేల యూనిట్ల వరకు మాత్రమే గ్రిడ్ నుంచి వినియోగించుకున్నా సరిపోనుంది. అంతమేర మాత్రమే విద్యుత్ బిల్లు చెల్లించాల్సి రానుంది.
ప్రస్తుతం నెలకు రూ. 1.80 లక్షల వరకు విద్యుత్ బిల్లులను కలెక్టరేట్ కార్యాలయాలు చెల్లిస్తుండగా సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో 80% వరకు విద్యుత్ బిల్లు తగ్గనుంది. సోలార్ విద్యుత్ వినియోగం వల్ల ఏటా రూ. 20 లక్షల వరకు చార్జీల భారం తగ్గనుంది. ఈ లెక్కన 200 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చు ఆరున్నరేళ్లలో తీరనుంది.
మరో రెండు జిల్లాల్లో...
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో 100 కేవీ సామర్థ్యంతో సోలార్ ప్లాంట్, కామారెడ్డి కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో 100 కేవీ సామర్థ్యంగల ప్లాంట్ పనులు పురోగతిలో ఉన్నాయి. మరోవైపు ఇతర కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు సైతం సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చొరవ చూపా లని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి సూచించారు.
ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి వల్ల జరిగే కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు. ప్లాంట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు కూడా గరిష్టంగా ఆరున్నర ఏళ్ల లో తిరిగి వస్తుందన్నారు. ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్య తను 20 ఏళ్లపాటు తెలంగాణ రెడ్కో పర్యవేక్షించనుంది.
సూర్యాపేటలో 100 కేవీ సామర్థ్యంతో..
సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో 100 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏటా 1.44లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీని ద్వారా ఏటా రూ.11.23లక్షల మేర ఆదా కానున్నట్లు రెడ్కో అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అయిన వ్యయం ఐదున్నర ఏళ్లలో తీరనున్నట్లు వివరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment