sheds
-
కలెక్టరేట్లకు సౌర సొబగులు
జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో సోలార్ పార్కింగ్ షెడ్ల ఏర్పాటు దిశగా తెలంగాణ రెడ్కో (రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్) అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా సోలార్ పార్కింగ్ షెడ్లను ఏర్పాటు చేయగా తాజాగా ఇతర జిల్లాల్లోనూ వాటి ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సూర్యా పేట, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ల క్యాంపస్‌లలో సోలార్ పార్కింగ్ షెడ్ల నిర్మాణం పూర్తయింది. 20న సూర్యాపేట ప్లాంటును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.– సాక్షి, హైదరాబాద్ ఖమ్మంలో 200 కేవీ సామర్థ్యంతో.. ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో 200 కేవీ (కిలోవాట్ల) గ్రిడ్ అనుసంధానిత సోలార్ విద్యుత్ ప్లాంటును తెలంగాణ రెడ్కో ఏర్పాటు చేసింది. పార్కింగ్ స్థలాన్ని సద్వినియోగం చేసుకొనేలా పార్కింగ్ ప్రాంత పైభాగంలో సోలార్ ప్యానల్స్‌ను అమర్చింది. ప్రస్తుతం కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో హైటెన్షన్ సర్వీస్‌లో నెలకు 14 వేల యూనిట్లకుపైగా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. లోటెన్షన్ సర్వీస్‌లో మరో 14 వేల యూనిట్లకుపైగా విద్యుత్ ఖర్చవుతోంది. తాజాగా 200 కేవీ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో 24 వేల యూనిట్ల వరకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరగనుంది.దీనివల్ల రెండు సర్వీసుల్లో కలిపి నెలకు 4–5 వేల యూనిట్ల వరకు మాత్రమే గ్రిడ్ నుంచి వినియోగించుకున్నా సరిపోనుంది. అంతమేర మాత్రమే విద్యుత్ బిల్లు చెల్లించాల్సి రానుంది. ప్రస్తుతం నెలకు రూ. 1.80 లక్షల వరకు విద్యుత్ బిల్లులను కలెక్టరేట్ కార్యాలయాలు చెల్లిస్తుండగా సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో 80% వరకు విద్యుత్ బిల్లు తగ్గనుంది. సోలార్ విద్యుత్ వినియోగం వల్ల ఏటా రూ. 20 లక్షల వరకు చార్జీల భారం తగ్గనుంది. ఈ లెక్కన 200 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చు ఆరున్నరేళ్లలో తీరనుంది. మరో రెండు జిల్లాల్లో... రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో 100 కేవీ సామర్థ్యంతో సోలార్ ప్లాంట్, కామారెడ్డి కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో 100 కేవీ సామర్థ్యంగల ప్లాంట్ పనులు పురోగతిలో ఉన్నాయి. మరోవైపు ఇతర కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు సైతం సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చొరవ చూపా లని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి సూచించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి వల్ల జరిగే కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు. ప్లాంట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు కూడా గరిష్టంగా ఆరున్నర ఏళ్ల లో తిరిగి వస్తుందన్నారు. ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్య తను 20 ఏళ్లపాటు తెలంగాణ రెడ్కో పర్యవేక్షించనుంది. సూర్యాపేటలో 100 కేవీ సామర్థ్యంతో.. సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో 100 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏటా 1.44లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీని ద్వారా ఏటా రూ.11.23లక్షల మేర ఆదా కానున్నట్లు రెడ్కో అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అయిన వ్యయం ఐదున్నర ఏళ్లలో తీరనున్నట్లు వివరిస్తున్నారు. -
భూదాన్ భూముల్లో ఉద్రిక్తత
ఖమ్మం అర్బన్: భూదాన్ భూముల్లో పేదలు ఇళ్ల స్థలాల కోసం రాత్రికి రాత్రే గుడిసెలు, రేకుల షెడ్లు వేయడం, ఉదయమే పోలీసులు వీటిని తొలగించడం.. వరస ఘటనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఖమ్మం నగరం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 147, 148, 149లోని భూదాన్ భూముల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు సూ ర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది ఆక్రమించి శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో గుడిసెలు వేశారు. శనివారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన రెవెన్యూ, పోలీసులు తొలగించేందుకు చేరుకోగా వేలాది మంది ఆందోళనకారులు అడ్డుకున్నారు. భూదాన్ భూముల కింద ప్రభుత్వం తమకు కేటాయించినందున ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు. కర్రలతో అధికారులను అడ్డుకుని.. గుడిసెల తొలగింపునకు యత్నించిన యంత్రాంగాన్ని కర్రలతో అడ్డుకున్నారు. దీంతో అదనపు కలెక్టర్ మధుసూదన్ ఆందోళనకారుల ప్రతినిధులతో రెండు గంటలకుపైగా చర్చించారు. పత్రాలు ఉంటే చూపించి నివాసాలు ఏర్పరుచుకోవాలని, లేకపోతే శాంతియుతంగా ఇక్కడ నుంచి వెళ్లాలని సూచించారు. సాయంత్రంలోగా ఖాళీ చేయకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా వారు కదలకపోవడంతో సీపీ విష్ణు ఎస్.వారియర్ సహా పోలీసు బలగాలు భారీగా చేరుకుని జేసీబీలతో గుడిసెలను తొలగించారు. గూడు ఆశ చూపారంటూ.. విలపించిన బాధితులు భూదాన్ భూముల్లో ఇళ్ల నిర్మాణానికి స్థలం ఇప్పిస్తా మని నమ్మించిన కొందరు డబ్బులు వసూలు చేశారని ఆందోళనకారులు కొందరు విలపించారు. గుడిసెలు వేసుకునేందుకు నాలుగేళ్ల క్రితం రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు ప్రచారం జరిగింది. అధికారులు వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఆక్రమిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ భూదాన్ భూములను ఆక్రమిస్తే సహించేది లేదని, ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ హెచ్చరించారు. ఆక్రమణదారులపై, వారిని ప్రోత్సహించిన వారిపై భూఆక్రమణ, క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. -
బతుకు గ్యారేజ్..!
కష్టజీవులకు ఉపాధి కల్పించే బస్తీ.. ఇండస్ట్రియల్ ఎస్టేట్. చిత్తూరు నగరానికి చివర్లో ఉన్న ఈ ఎస్టేట్.. కార్మికుల జీవనోపాధికి కేంద్రంగా ఉంది. శ్రమనే నమ్ముకున్న ప్రతి శ్రామికుడికి ఈ ఎస్టేట్‌లో ఉపాధి దొరుకుతోంది. ఆటో నుంచి లారీ, జేసీబీల వరకు నూతన బాడీ కట్టించుకోవడం, రిపేర్లు చేయించుకోవాలంటే.. వాహన యజమానులందరూ ఈ ఎస్టేట్‌నే ఆశ్రయిస్తారు. దీంతో నిత్యం వేలాది మంది కార్మికులు ఇక్కడ వివిధ రకాల పనులు చేసుకుంటూ ఉపాధిని పొందుతున్నారు. సాక్షి, చిత్తూరు రూరల్ : చిత్తూరు నగరంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. ఇక్కడ వివిధ రకాలైన మెకానికల్ షాపులు 170 దాకా ఉన్నాయి. ఈ షాపుల్లో 3వేలకు పైగా శ్రామికులు పనిచేస్తున్నారు. ఎక్కువగా ఆటోలు, కార్లు, టిప్పర్లు, లారీలు, బస్సుల రిపేర్ పనులు అధికంగా ఉంటాయి. అలాగే లేత్, గ్లాస్ వర్క్, లైనర్, వెల్డర్, డ్రిల్లర్, పెయింటర్, బాడీ బిల్డర్ (బస్సులు, లారీలకు బాడీ కట్టేవారు), బ్యాటరీ తయారీ.. ఇలా వాహనాలకు సంబంధించిన పలు పనులు ఇక్కడ జోరుగా సాగుతుంటాయి. వాహనాలు రిపేర్ వస్తే.. చిత్తూరు వాసులే కాకుండా మదనపల్లి, పలమనేరు, పీలేరు, పుత్తూరు, తిరుపతి, తమిళనాడులోని పళ్లిపట్టు, పొన్నై వాసులు కూడా ఇక్కడికి వస్తున్నారు. మంచి నైపుణ్యం కలిగిన మెకానిక్‌లు ఎస్టేట్‌లో ఉండడంతో ఈ సంఖ్య ఇటీవల మరింత పెరిగింది. స్వయం కృషితో... మెకానిక్‌లుగా ఎస్టేట్‌లో చాలా మంది బతుకు బండి లాగుతున్నారు. వీరిలో చాలా మంది మెకానిక్ షెడ్లు ఏర్పాటు చేసుకుని పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ క్రమంలో వేలాది మంది శ్రామికులు ఇక్కడ జీవిస్తున్నారు. ఏళ్ల తరబడి ఇదే వృత్తిని నమ్ముకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఏ పనీ లేకున్నా ఎస్టేట్‌ను ఆశ్రయించిన వారికి ఏదో రకంగా ఉపాధి దొరుకుతోంది. పని నేర్చుకోవాలి.. సంపాదించాలనే తపన ఉన్న వ్యక్తులకు ఈ ఎస్టేట్ కొండంత అండగా నిలుస్తోంది. ఇక్కడ హెల్పర్, దినసరి కూలీగా పనిలో చేరి.. సొంత షాపు ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగినవారు పదుల సంఖ్యలో ఉన్నారు. వారంతా తాము స్వయం కృషితోనే పైకి వచ్చామని, ఈ ఎస్టేట్ తమకు ఉపాధి కల్పిస్తోందని చెబుతున్నారు. ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందుతామని అంటున్నారు. చిత్తూరుకు పరిశ్రమలు వస్తే తమలాంటి వాళ్లకు మరింత మేలు చేకూరుందని పలువురు భావిస్తున్నారు. పరిశ్రమలు రావాలి.. చిత్తూరుకు పరిశ్రమలు రావాలి. అప్పుడే మాలాంటి వాళ్లకు పనులు పుష్కలంగా ఉంటాయి. నేను లారీ, బస్సు ఇంజిన్ రిపేర్ చేస్తాను. సొంతంగా షాపు ఉంది. రోజూ కూలి గిట్టుబాటు అవుతోంది. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. – పటేల్, చిత్తూరు 30 ఏళ్లుగా పనిచేస్తున్నా ఎస్టేట్‌లో మెకానిక్‌గా 30 ఏళ్లుగా పనిచేస్తున్నా. నెలకు నాకు రూ.10 వేలు వస్తోంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంది. చేతినిండా పని ఉంది. చిన్నతనంలోనే లారీ, బస్సు రిపేర్లు నేర్చుకున్నాను. ఎక్కడికెళ్లినా పని చేయగలను. – పురుషోత్తం, చిత్తూరు శ్రమకు తగ్గ వేతనం.. నేను చిన్నతనంలోనే ఇక్కడ పనికి వచ్చా. మూడేళ్లలో పని నేర్చుకున్నా. మెకానిక్ పనులతో పాటు బ్యాటరీ తయారీ, రిపేర్లు చేస్తా. కూలి గిట్టుబాటు అవుతోంది. నేను ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్నా. – మోహన్, చిత్తూరు -
రూపునిస్తారు.. రోడ్డుపైకి తెస్తారు !
ఆటోనగర్(విజయవాడ తూర్పు): లారీ మెకానిక్ బాడీ బిల్డింగ్ పనులకు విజయవాడ ఆటోనగర్ పేరుగాంచింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి కూడా లారీల యజమానులు వచ్చి ఇక్కడ బాడీ కట్టించుకుంటారు. ఈ ఏడాది పనులు ముమ్మరంగా ఉంటున్నట్లు లారీబాడీ బిల్డింగ్ షెడ్డుల యజమానులు చెబుతున్నారు. గత ఏడాది డీజిల్ ధరలు పెరగడంతో కొత్త లారీలను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదని, ప్రస్తుతం నిలకడగా ఉండడంతో లారీల కొనుగోలు పెరిగిందని చెబుతున్నారు. ఆటోనగర్‌లో బాడీ బిల్డింగ్ చేయించుకునేందుకు గాను అధిక సంఖ్యలో కొత్తలారీలు షెడ్లకు వచ్చాయి. దీంతో మరలా లారీబాడీ బిల్డింగ్ పనులు మూడు పువ్వులు ఆరుకాయలు అన్న చందంగా మారింది. రెండు నెలల నుంచి పనులు ఊపందుకుంటున్నాయి. 300 పైగా షెడ్డులు... ఆటోనగర్‌లో సుమారు 300లకు పైగా లారీ బాడీ బిల్డింగ్ షెడ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ షెడ్డులన్నీ కళకళలాడుతున్నాయి. అయితే బాడీబిల్డింగ్ పనులు చేసేందుకు గాను కార్మికులు సరిపడా లేరని యజమానులు చెబుతున్నారు. గతంలో కార్మికులు 2 వేల మందికి పైగా ఉండేవారని, పనులు సక్రమంగా దొరకపోవడంతో వారు వేరే పనుల వైపు వెళ్లడంతో ప్రస్తుతం కార్మికుల కొరత తీవ్రంగా ఉందని చెబుతున్నారు. దీంతో గతంలో పనిచేసిన మెకానిక్‌లు, వేరే కార్మికుల వద్దకు వెళ్లి వారిని బతిమిలాడి తీసుకు రావాల్సి వస్తోందని, అయినప్పటికీ వారు అడ్వాన్స్‌లు ఇస్తేనే పనులకు వచ్చే పరి స్థితి నెలకొని ఉంది. ఈ పని మినహా వేరొక పని చేయలేమని అందుకే ఈ పనిని వదిలేయకపోతున్నామని షెడ్ల యజమానులు వాపోతున్నారు. స్థలం కొరతతో ఇక్కట్లు... లారీలను పెట్టుకునేందుకుగాను ఇక్కడ స్థలం సరిపడినంత లేకపోవడంతో షెడ్డు యజమానులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క లారీకి బాడీబిల్డింగ్ పనులు చేయాలంటే కనీసం 15 నుంచి 30 రోజులు సమయం పడుతుంది. మిగతా లారీలను పెట్టుకునేందుకు స్థలం సరిపోవడంలేదని షెడ్డుల యజమానులు చెబుతున్నారు. ఏమి చేయాలో తెలీక ఒక్కోసారి పని వదులుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం లారీ బిల్డింగ్ పనులకు సరిపోయేంత స్థలం ఇవ్వాలని వారు కోరు తున్నారు. బాడీబిల్డింగ్ ఇలా... లారీ కొనుగోలు చేసినప్పుడు దానికి ఎటువంటి సీటింగ్, బాడీ, ఇతర ఎలక్ట్రిక్ పరికరాలు తదితరాలు ఏమీ ఉండవు.. దానికి కార్మికులు మంచి బాడీ కట్టి, పెయింటింగ్ వేసి, సీటింగ్ అమర్చి, కావాల్సిన లైట్లు ఏర్పరిచి అందంగా ముస్తాబు చేసి ఇస్తారు. దీనికి టింకరింగ్, పెయింటింగ్, కార్పెంటరీ, ఎలక్ట్రీషియన్‌తో పాటు పలు పనులన్నింటిని చేస్తారు. లారీ కంపెనీ వారు బాడీబిల్డింగ్ చేయాలంటే కనీసం మూడు మాసాలు పడుతుంది. అదే ఆటోనగర్‌లో అయితే 15 రోజుల నుంచి నెలరోజుల్లోపే చేసి యజమానులకు అప్పగిస్తారు. ఒక లారీ బాడీ బిల్డింగ్ పనులు చేయాలంటే రూ.3.80 నుంచి రూ.4 లక్షలు కాంట్రాక్ట్ ఇస్తున్నారని యజమానులు చెబుతున్నారు. -
రైతులకు అండగా..
మేడిపెల్లి : రాష్ట్రంలో పశుసంపదను పెంచడం కోసం ప్రభుత్వం తమవంతు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే గొర్రెలు, మేకల పెంపకందారులకు సబ్సిడీపై గొర్రెలు ఇవ్వగా త్వరలోనే గేదెలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇవేకాకుండా రైతులకు ఉపాధిహామీలో షెడ్ల నిర్మాణాలు చేపట్టింది. మేడిపెల్లి మండలంలోని కల్వకోట, దేశాయిపేట గ్రామాలలో షెడ్ల నిర్మాణాలు చేపట్టారు. మండలంలో గొర్రెలు, మేకల షెడ్లకు 54 మంది రైతులు దరఖాస్తులు చేసుకోగ ఇందులో 54 షెడ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటివరకు కల్వకోట, దేశాయిపేటలో 10 షెడ్ల పనులు జరుగుతున్నాయి. అలాగే గేదెల 10 షెడ్లు మంజూరయ్యాయి.ఇందులో 4 షెడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కల్వకోటలో రెండు పనులు పూర్తయ్యాయి. మిగతా గ్రామాలలో పనులు ప్రారంభించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి గొర్రెలు, మేకల షెడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.53వేల 856 చెల్లిస్తుంది. ఇందులో కూలీ వేతనం రూ.764, మెటీరియల్ చార్జీ రూ.53,092లు చెల్లిస్తారు. గేదెల షెడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.56వేల 809లను చెల్లిస్తుంది. ఇందులో కూలీల వేతనం రూ.636. మెటీరియల్ చార్జీ రూ.56వేల 177 చెల్లిస్తుం ది. దీనిని పొడవు 4.54 మీటర్లు, వెడల్పు 3.56 మీటర్లుగా నిర్మించాలి. ఎలా మంజూరు చేస్తారు.. రైతులు తమకు గొర్రెలు, మేకల షెడ్లతో పాటు గేదెల షెడ్లు కావాలనుకుంటే వారు ముందుగా పశువైద్యాధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. వారు ధృవీకరించిన తర్వాత మంజూరు చేస్తారు. దరఖాస్తుదారుడికి కనీసం 21గొర్రెలు, 5 గేదెలు ఉండాలి. ఇప్పుడే ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ కృషి అభినందనీయం నాకు 5 గేదెలు ఉన్నాయి. వీటికి షెడ్డు లేకపోవడంతో ఆరుబయటే కట్టివేసేవాన్ని. గేదెల షెడ్లు నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే మంజూరైంది. 15రోజులలో షెడ్డు పూర్తి చేసిన. ఇంత పెద్ద మొత్తంలో షెడ్లకు నిధులు ఇవ్వడం మాకు వరంగా చెప్పవచ్చు. ఇప్పుడు నా గేదెలను షెడ్లలో కట్టేసుకుంటున్నా.. – ఎండీ గాజీపాషా, రైతు కల్వకోట సద్వినియోగం చేసుకోవాలి రైతుల పశువులకు రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం షెడ్ల నిర్మాణం ప్రారంభించింది. అర్హులైన రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మండలంలో ఇప్పటికే గొర్రెల షెడ్లు 10, గేదెల షెడ్లు 4 ప్రారంభమయ్యాయి. మిగతా వాటిని కూడా ప్రారంభించి నిర్మాణాలు పూర్తి చేస్తాం. – హరికిషన్, ఎంపీడీవో -
నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: దేశీయ మార్కెట్లు బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో 145 పాయింట్లకు పైగా నష్టపోయిన బాంబే స్టాక్ఎక్సేంజ్ సెన్సెక్స్ ఆ తర్వాత కోలుకొంది సెన్సెక్స్120 పాయింట్ల నష్టంతో 27,407 దగ్గర, నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి, 8,259 దగ్గర ట్రేడవుతున్నాయి. ఆటో ఐటి, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, రియాల్టీ షేర్లు బాగా నష్టపోతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ మద్దతు స్థాయికి దిగువన ట్రేడవుతున్నందువల్ల ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలని ఎనలిస్టులు సూచిస్తున్నారు. -
బుగ్గితో రాజధాని నిర్మాణం!
రాజధాని నిర్మాణం కోసం గుంటూరు జిల్లాలో రైతుల నుండి భూ సమీకరణ జరపాలని నిర్దేశించిన ప్రాంతంలో ఇటీవల పచ్చటి పంటపొలాలను, తోటలను దుండగులు బుగ్గిపాలు చేశారు. ఈ అమానుషకాండకు రైతుల అరటి తోటలు, షెడ్డులు, డ్రిప్ ఇరిగేషన్ సామగ్రి, ఎరువులు వగైరా కాలి బూడిదయ్యాయి. సీఎం తక్షణమే విచారణకు ఆదేశించడం సమంజసమే. అయితే ఘటన జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఒక మంత్రి అనుయాయులు రైతులే తమ పంటలను తగులబెట్టు కున్నారని, ఇందులో వైఎస్సార్సీపీ కార్యకర్తల హస్త ముందని చేసిన వెకిలి వ్యాఖ్యల వల్ల బాధిత రైతు లకు పుండు మీద కారం రాసినట్టు అనిపించడం సహజమే. కాబట్టే వారు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఆమోదయోగ్యమైన రీతిలో, వారిని ఒప్పించి సేకరించిన భూము లతో రాజధానిని నిర్మిస్తేనే ప్రజలు హర్షిస్తారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. ఏదిఏమైనా భూములు ఇచ్చేదిలేదని రైతులు చెబు తుండగా, వారిని బెదిరించి అధికారాన్ని ప్రయోగించి భూములను స్వాధీనం చేసుకోవాలని చూడటం అనర్థదాయక పరిణామాలకు దారితీస్తుంది. ప్రభుత్వం విజ్ఞతను చూపాల్సిన సమయమిది. -ఎమ్. ఎస్. రావు గోకివాడ, తూర్పు గోదావరి జిల్లా