కల్వకోటలో పూర్తయిన గేదెల షెడ్డు
మేడిపెల్లి : రాష్ట్రంలో పశుసంపదను పెంచడం కోసం ప్రభుత్వం తమవంతు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే గొర్రెలు, మేకల పెంపకందారులకు సబ్సిడీపై గొర్రెలు ఇవ్వగా త్వరలోనే గేదెలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇవేకాకుండా రైతులకు ఉపాధిహామీలో షెడ్ల నిర్మాణాలు చేపట్టింది. మేడిపెల్లి మండలంలోని కల్వకోట, దేశాయిపేట గ్రామాలలో షెడ్ల నిర్మాణాలు చేపట్టారు. మండలంలో గొర్రెలు, మేకల షెడ్లకు 54 మంది రైతులు దరఖాస్తులు చేసుకోగ ఇందులో 54 షెడ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటివరకు కల్వకోట, దేశాయిపేటలో 10 షెడ్ల పనులు జరుగుతున్నాయి. అలాగే గేదెల 10 షెడ్లు మంజూరయ్యాయి.ఇందులో 4 షెడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కల్వకోటలో రెండు పనులు పూర్తయ్యాయి. మిగతా గ్రామాలలో పనులు ప్రారంభించడానికి అధికారులు కృషి చేస్తున్నారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి
గొర్రెలు, మేకల షెడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.53వేల 856 చెల్లిస్తుంది. ఇందులో కూలీ వేతనం రూ.764, మెటీరియల్ చార్జీ రూ.53,092లు చెల్లిస్తారు. గేదెల షెడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.56వేల 809లను చెల్లిస్తుంది. ఇందులో కూలీల వేతనం రూ.636. మెటీరియల్ చార్జీ రూ.56వేల 177 చెల్లిస్తుం ది. దీనిని పొడవు 4.54 మీటర్లు, వెడల్పు 3.56 మీటర్లుగా నిర్మించాలి.
ఎలా మంజూరు చేస్తారు..
రైతులు తమకు గొర్రెలు, మేకల షెడ్లతో పాటు గేదెల షెడ్లు కావాలనుకుంటే వారు ముందుగా పశువైద్యాధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. వారు ధృవీకరించిన తర్వాత మంజూరు చేస్తారు. దరఖాస్తుదారుడికి కనీసం 21గొర్రెలు, 5 గేదెలు ఉండాలి. ఇప్పుడే ఈ పథకానికి అర్హులు.
ప్రభుత్వ కృషి అభినందనీయం
నాకు 5 గేదెలు ఉన్నాయి. వీటికి షెడ్డు లేకపోవడంతో ఆరుబయటే కట్టివేసేవాన్ని. గేదెల షెడ్లు నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే మంజూరైంది. 15రోజులలో షెడ్డు పూర్తి చేసిన. ఇంత పెద్ద మొత్తంలో షెడ్లకు నిధులు ఇవ్వడం మాకు వరంగా చెప్పవచ్చు. ఇప్పుడు నా గేదెలను షెడ్లలో కట్టేసుకుంటున్నా..
– ఎండీ గాజీపాషా, రైతు కల్వకోట
సద్వినియోగం చేసుకోవాలి
రైతుల పశువులకు రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం షెడ్ల నిర్మాణం ప్రారంభించింది. అర్హులైన రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మండలంలో ఇప్పటికే గొర్రెల షెడ్లు 10, గేదెల షెడ్లు 4 ప్రారంభమయ్యాయి. మిగతా వాటిని కూడా ప్రారంభించి నిర్మాణాలు పూర్తి చేస్తాం.
– హరికిషన్, ఎంపీడీవో
Comments
Please login to add a commentAdd a comment