కడప సిటీ : జాతీయ మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకానికి ఫిబ్రవరి 2వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తవుతుంది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమై అభివృద్ధిలో పరుగులు తీసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నీరు–చెట్టు పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఈ పథకాన్ని నిధులు దోచుకునేందుకు అవకాశం ఇచ్చారు.
నాణ్యతకు తిలోదకాలిచ్చి.. నిధులు పక్కకు మళ్లించి.. కూలీలకు డబ్బులు సకాలంలో ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ పథకానికి నిధులు కేటాయిస్తుంటాయి. ఇదిలా ఉండగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పథకంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
పనులు జియో ట్యాగ్ ద్వారా చేపట్టి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆధార్ అనుసంధానం చేసి కూలీల డబ్బులు చేతికి సక్రమంగా అందేలా డీబీటీ విధానాన్ని తీసుకొచ్చారు.
18 సంవత్సరాల కిందట ఈ పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైంది. అనంతపురం జిల్లాలో 2006 ఫిబ్రవరి 2న బండ్లపల్లెలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభిచారు. దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ఈ పథకం అభివృద్ధిలో పరుగులు తీసింది. తర్వాత చంద్రబాబు హయాంలో నత్తనడకన సాగింది.
ఇదీ లక్ష్యం..
దేశంలోని పేద కూలీల బతుకులకు భద్రత కల్పించడంతోపాటు పస్తులు, ఆకలి చావులు, వలసలు, కరువులేని గ్రామీణ భారతం ఆవిష్కృరించేందుకు ఈ పథకం ఏర్పాటైంది. నైపుణ్యం, అవసరం లేని శారీరక శ్రమతో కూడిన పనులు చేసేందుకు ముందుకు వచ్చే వారందరికీ సంబంధిత కుటుంబానికి కనీసం ఏడాదికి 100 రోజులు పనిదినాలు కల్పించడం ప్రధాన లక్ష్యం. దీని ద్వారా నిరుపేదల్లో ఆర్థిక వృద్ధి పెరిగింది. మహిళల్లో సాధికారత, కూలీల కుటుంబాల్లో ఆత్మగౌరవం పెరిగింది.
దివంగత నేత వైఎస్సార్ హయాంలో ఉపాధిహామీ పనులు పరుగులు తీసిన సందర్భాలు ఉన్నాయి. హార్టికల్చర్ ద్వారా పండ్ల తోటల పెంపకం, ఇందిర జలప్రభ ద్వారా ఎస్సీ ఎస్టీలకు చెందిన బీడు భూములను సాగుకు యోగ్యంగా మార్చారు. దీంతో వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. నీటి సంరక్షణ, కాలువ పనులు, సాగునీటి సదుపాయాలకు అనుగుణంగా పనులు, భూమిని అభివృద్ది పర్చడం వంటి పనులు చేశారు.
పనులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉపాధి హామీ అభివృద్ది పనులపై ప్రత్యేక శ్రద్ద వహించారు. ఎప్పటికప్పుడు ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కూలీల డబ్బులు ఏ వారానికి ఆ వారం ఖాతాలో పడుతున్నాయి.
ఆధార్ అనుసంధానం చేయడంతో కూలీల డబ్బులు పక్కదారి పట్టకుండా వారి చేతికి అందుతున్నాయి. డైరెక్ట్ బెనిఫిషరి ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) విధానం వల్ల ప్రతి రూపాయి కూలీలకు చేరుతోంది. అంతేకాకుండా నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యతనిస్తున్నారు.
చంద్రబాబు హయాంలో నిధులు పక్కదారి
చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ఉపాధి పథకం సక్రమంగా అమలు కాలేదన్న విమర్శలు ఉన్నాయి. నీరు–చెట్టు పేరిట టీడీపీ నాయకులకు వరంగా మారి నిధులు దోచుకునేందుకు అవకాశం కల్పించారన్న విషయంపై ప్రజలు అప్పట్లో మండిపడ్డారు.
వాస్తవంగా ఈ పనుల్లో నాణ్యత లోపించి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.విచారణలో ఇది వాస్తవమేని నిర్ధారణ కావడం గమనార్హం. నిధులు పక్కదారి పట్టడం, కూలీలకు డబ్బులు సకాలంలో అందకపోవడంతో అప్పట్లో ఇబ్బందులు పడ్డారు. కుట్ర పూరితంగా టీడీపీ వ్యవహరిస్తోందన్న విమర్శలు కూడా వచ్చాయి.
వేతనాలు భారీగా పెరుగుదల
ఉపాధి ఉనికిలోకి రాకముందు ‘సీమ’, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూలీల రోజు వేతనం రూ. 20 ఉండేది. ఈ చట్టం వచ్చాక కూలీల వేతనం గణనీయంగా పెరిగింది. కూలీలపై జరిగే ఆర్థిక దోపిడీ కనిష్ఠ స్థాయికి తగ్గిపోయింది. 2006–07లో పథకం ప్రారంభించిన సమయంలో రూ. 80 కనీస వేతనం కాగా, రూ. 77.67 వరకు వచ్చేది. 2010–11లో రూ. 121 కనీస వేతనం కాగా రూ. 91.76 వేతనం దక్కింది.
2015–16లో కనీస వేతనం రూ. 180 కాగా రూ. 131.42గా వచ్చేది. 2019–20లో కనీస వేతనం రూ. 211 కాగా, రూ. 210.10గా ఉంది. 2023–24లో ప్రస్తుతం కనీస వేతనం రూ. 272 ఉండగా, రూ.244.40గా అందుతోంది. దీన్ని బట్టి చూస్తే ప్రారంభంలో కనీస వేతనం రూ. 80 ఉండగా, ప్రస్తుతం ఈ మొత్తం రూ. 272కు చేరింది. పని అడిగిన 15 రోజుల్లోపల పని కల్పించకపోతే వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని, పురుషులతోపాటు మహిళలకు సమాన వేతనం ఇవ్వాలని చట్టం ఉంది.
అలాగే పని ప్రదేశాల్లో కూలీలకు, వారి పిల్లలకు అనేక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. కూలీలకు పనిని హక్కుగా కల్పిస్తూ ఈ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం
ఉపాధి పనుల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాం. నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాం. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నాం.కలెక్టర్ విజయరామరాజు ఈ పథకంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఆయన సూచనల, సలహాల మేరకు ఉపాధిహామీలో మరింత అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఏర్పడింది. – పి.యదుభూషణరెడ్డి, డ్వామా పీడీ, కడప
Comments
Please login to add a commentAdd a comment