నేడు ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
దివంగత సీఎం వైఎస్‌ఆర్ ఘాట్‌లో ప్రార్థనల అనంతరంబస్సు యాత్ర ప్రారంభం
ప్రొద్దుటూరులో తొలి బహిరంగ సభ
లక్షలాది మంది జనం హాజరవుతారని అంచనా
సార్వత్రిక ఎన్నికల సమరానికి వైఎస్సార్‌సీపీ సర్వ సన్నద్ధంగా ఉంది. చేసిన మేలును ప్రజలకు వివరించి మరోసారి ప్రజా తీర్పు కోరేందుకు జనం మధ్యకు రానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
సాక్షి ప్రతినిధి, కడప/ప్రొద్దుటూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమానికి సర్వం సన్నద్ధమయ్యారు. ముఖ్యమంత్రి బుధవారం విజయవాడ నుంచి కడప విమానాశ్రయం చేరుకుంటారు. ఇక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రకు శ్రీకారం చుట్టి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో సీఎం పర్యటన కొనసాగించనున్నారు. వైఎస్సార్ జిల్లా ముద్దుబిడ్డ, ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప పార్లమెంటు పరిధిలోని ప్రొద్దుటూరులో ఎన్నికల తొలి సభను నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజానీకం సంసిద్ధులయ్యారు.
కొనసాగుతున్న ఇడుపులపాయ సెంటిమెంట్
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా ముందుగా ఇడుపులపాయలోని తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి చెంతన ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించడం ఆనవాయితీగా వస్తోంది. అదే సెంటిమెంట్‌ను 2024 ఎన్నికల్లో కూడా ఆయన కొనసాగిస్తున్నారు. ఆమేరకు 2019లాగా ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అప్పట్లో ప్రచారాన్ని సైతం ఇడుపులపాయ నుంచే మొదలుపెట్టారు. ఆ ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా తీర్పునిచ్చారు. తిరిగి అదే ఆనవాయితీగా ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ ఘాట్‌లో ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం ఇడుపులపాయ నుంచి వీరన్నగట్టుపల్లె, వేంపల్లె, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్ర ప్రొద్దుటూరుకు చేరుకోనుంది. ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులోని వాసవి సర్కిల్ నుంచి జమ్మలమడుగు బైపాస్ రోడ్డు ద్వారా చౌటపల్లె సర్కిల్ మీదుగా రింగ్ రోడ్డులోని బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి బహిరంగ సభ ప్రారంభం కానుంది.
లక్షలాదిగా తరలిరానున్న ప్రజానీకం
ప్రియతమ నాయకుడు, జిల్లా వాసుల ముద్దుబిడ్డ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్న తొలి ఎన్నికల ప్రచార సభలో లక్షలాది మంది పాల్గొనేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నాయకుడికి అండగా నిల్చేందుకు, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా సన్నాహక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రొద్దుటూరు చుట్టు ప్రక్కల ప్రాంతాలతో బాటు మైదుకూరు, కమలాపురం, జమ్మలమడుగు, బద్వేలు ప్రాంతాల నుంచి అశేష ప్రజానీకం స్వచ్ఛందంగా తరలిరానున్నారు. ప్రొద్దుటూరులో ప్రారంభమయ్యే బస్సు యాత్ర సభ రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు స్థానాలకు ఆదర్శంగా నిలిచేలా జనం ముందడుగు వేస్తున్నారు.
బస్సు యాత్రపై రిహార్సల్
ఎర్రగుంట్ల: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం చేపట్టనున్న బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు వరకూ సాగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆధ్వర్యంలో ఎర్రగుంట్ల పట్టణంలోని వేంపల్లి రోడ్డు నుంచి వచ్చే బస్సు యాత్ర రిహార్సల్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు రోడ్ల కూడలిలో జమ్మలమడుగు డీఎస్పీ యశ్వంత్, ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్య, కొండాపురం సీఐ వేణుగోపాల్ ఇతర ఎస్‌ఐలకు ఎస్పీ పలు సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment