khammam district collector
-
మా ఇంటి మణిదీపం
‘ఆడపిల్ల పుట్టింది’ అనే వార్త చెవిన పడగానే... ‘మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది’ అంటూ సంబరం అంబరాన్ని అంటాలి. ‘మా పాప–మా ఇంటి మణిదీపం’ ఇచ్చే స్ఫూర్తి అదే. ‘ఆడపిల్లలు ఎంత చదివితే అంత ముందుకు వెళతారు. అంత అదనపు శక్తి వస్తుంది’ అని అమ్మమ్మ చెబుతుండే వారు. తన అమ్మమ్మ స్ఫూర్తితో చదువు నుంచి స్వయం ఉపాధి వరకు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తున్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్...‘బేటీ బచావో...బేటీ పడావో’ స్ఫూర్తితో ఖమ్మం జిల్లాలో ‘మా పాప–మా ఇంటి మణిదీపం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్ల పుట్టిన ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు, నానమ్మని సత్కరిస్తారు. శాలువ కప్పి స్వీట్ బాక్స్, పండ్లు, ఒక సర్టిఫికెట్‌ను అందజేస్తారు. కొందరి ఇళ్లకు స్వయంగా కలెక్టర్ వెళుతున్నారు.హాజరు శాతంపెరిగిందిపాఠశాలల్లో బాలికల హాజరు శాతంపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. బాలికల హాజరు శాతం పెరిగేలా కృషి చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో బాలికల హాజరు శాతం 86 నుంచి 92 శాతానికి పెరిగింది. పాఠశాలల్లో బాలికలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకున్నారు.ఆర్థిక శక్తిస్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు ఉపాధి కలిగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో స్త్రీ–టీ క్యాంటీన్లు ప్రసిద్ధి చెందాయి. ఇప్పటికే 50 కి పైగా క్యాంటీన్ల వరకు జిల్లా వ్యాప్తంగా లాభాల బాటలో నడుస్తుండగా మరిన్ని క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. యూనిట్లను మంజూరు చేయడంతోపాటు ఎప్పటికప్పుడు వాటి పనితీరును కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు.మా అమ్మమ్మ అలా లాయర్ అయింది...మహిళలు చదువుకుంటే తరతరాలుగా ఆ కుటుంబం బాగుపడుతుందని చెబుతారు. అది కళ్లతో చూశా. మా అమ్మమ్మకు పన్నెండేళ్లకే పెళ్లి చేశారు. అమ్మమ్మ వాళ్ల ఇంటి ఎదుట కిరాణాషాపు ఉండేది. అక్కడ సరుకులను న్యూస్ పేపర్లలో కట్టి ఇచ్చేవారు. ఆ న్యూస్ పేపర్లను చదువుతూ మరోసారి చదువుపై ఆసక్తిని పెంచుకుని బీఈడీ, ఎంఈడీ పూర్తి చేసింది. లాయర్ అయింది. అప్పుడే నాకు తెలిసింది చదువుతో ఎంతైనా సాధించవచ్చునని. – ముజమ్మిల్ ఖాన్, కలెక్టర్, ఖమ్మంకలెక్టర్ మా ఇంటికి వచ్చారు!నాకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. మా ఇంటికి కలెక్టర్ సార్ వచ్చిండు. మాకు సన్మానం చేసి, పూలు, పండ్లు, స్వీట్లు ఇచ్చారు. సర్టిఫికెట్ అందజేశారు. మా పాప పెద్దయ్యాక ఈ సర్టిఫికెట్ చూపించి కలెక్టర్ ఇచ్చారని చెప్పమన్నారు. ‘మీకు మహాలక్ష్మి పుట్టింది. బాగా చదివించండి. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదిస్తుంది’ అంటూ ఆశీర్వదించారు. – బానోత్ కృష్ణవేణి, రామచంద్రాపురం, ఖమ్మం జిల్లా– బొల్లం శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి, ఖమ్మం -
కలెక్టరేట్లకు సౌర సొబగులు
జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో సోలార్ పార్కింగ్ షెడ్ల ఏర్పాటు దిశగా తెలంగాణ రెడ్కో (రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్) అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా సోలార్ పార్కింగ్ షెడ్లను ఏర్పాటు చేయగా తాజాగా ఇతర జిల్లాల్లోనూ వాటి ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సూర్యా పేట, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ల క్యాంపస్‌లలో సోలార్ పార్కింగ్ షెడ్ల నిర్మాణం పూర్తయింది. 20న సూర్యాపేట ప్లాంటును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.– సాక్షి, హైదరాబాద్ ఖమ్మంలో 200 కేవీ సామర్థ్యంతో.. ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో 200 కేవీ (కిలోవాట్ల) గ్రిడ్ అనుసంధానిత సోలార్ విద్యుత్ ప్లాంటును తెలంగాణ రెడ్కో ఏర్పాటు చేసింది. పార్కింగ్ స్థలాన్ని సద్వినియోగం చేసుకొనేలా పార్కింగ్ ప్రాంత పైభాగంలో సోలార్ ప్యానల్స్‌ను అమర్చింది. ప్రస్తుతం కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో హైటెన్షన్ సర్వీస్‌లో నెలకు 14 వేల యూనిట్లకుపైగా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. లోటెన్షన్ సర్వీస్‌లో మరో 14 వేల యూనిట్లకుపైగా విద్యుత్ ఖర్చవుతోంది. తాజాగా 200 కేవీ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో 24 వేల యూనిట్ల వరకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరగనుంది.దీనివల్ల రెండు సర్వీసుల్లో కలిపి నెలకు 4–5 వేల యూనిట్ల వరకు మాత్రమే గ్రిడ్ నుంచి వినియోగించుకున్నా సరిపోనుంది. అంతమేర మాత్రమే విద్యుత్ బిల్లు చెల్లించాల్సి రానుంది. ప్రస్తుతం నెలకు రూ. 1.80 లక్షల వరకు విద్యుత్ బిల్లులను కలెక్టరేట్ కార్యాలయాలు చెల్లిస్తుండగా సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో 80% వరకు విద్యుత్ బిల్లు తగ్గనుంది. సోలార్ విద్యుత్ వినియోగం వల్ల ఏటా రూ. 20 లక్షల వరకు చార్జీల భారం తగ్గనుంది. ఈ లెక్కన 200 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చు ఆరున్నరేళ్లలో తీరనుంది. మరో రెండు జిల్లాల్లో... రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో 100 కేవీ సామర్థ్యంతో సోలార్ ప్లాంట్, కామారెడ్డి కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో 100 కేవీ సామర్థ్యంగల ప్లాంట్ పనులు పురోగతిలో ఉన్నాయి. మరోవైపు ఇతర కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు సైతం సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చొరవ చూపా లని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి సూచించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి వల్ల జరిగే కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు. ప్లాంట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు కూడా గరిష్టంగా ఆరున్నర ఏళ్ల లో తిరిగి వస్తుందన్నారు. ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్య తను 20 ఏళ్లపాటు తెలంగాణ రెడ్కో పర్యవేక్షించనుంది. సూర్యాపేటలో 100 కేవీ సామర్థ్యంతో.. సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో 100 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏటా 1.44లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీని ద్వారా ఏటా రూ.11.23లక్షల మేర ఆదా కానున్నట్లు రెడ్కో అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అయిన వ్యయం ఐదున్నర ఏళ్లలో తీరనున్నట్లు వివరిస్తున్నారు. -
'పోలవరం బాధితులకు న్యాయం చేయండి'
పోలవరం ముంపు మండలాల ప్రజలకు న్యాయం చేయాలని ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ను కలసి స్థానిక ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, బానోతు మదన్‌లాల్‌లు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని ముంపునకు గురయ్యే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆ ఆర్డినెన్స్‌పై తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ తీవ్ర నిరసన తెలిపింది. అందులోభాగంగా గురువారం తెలంగాణ బంద్‌కు ఆ పార్టీ పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. -
ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు: ఖమ్మం కలెక్టర్
లెహర్ తుపాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీనరేష్ బుధవారం ఇక్కడ వెల్లడించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన జిల్లా ప్రజలకు సూచించారు. అధికారులంతా విధులకు హాజరుకావాలని ఆయన ఆదేశించారు. విధులపట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తామని తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ ఆర్టీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. లెహర్ తుఫాన్ వల్ల ఎవరికి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన వెంటనే 08742231600, 08744249994, 08743232426కు ఫోన్ చేయాలని సూచించారు. లెహర్ తుఫాన్ వల్ల జిల్లాలో 20 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ శ్రీ నరేష్ విజ్ఞప్తి చేశారు.