లెహర్ తుపాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీనరేష్ బుధవారం ఇక్కడ వెల్లడించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన జిల్లా ప్రజలకు సూచించారు. అధికారులంతా విధులకు హాజరుకావాలని ఆయన ఆదేశించారు. విధులపట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తామని తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ ఆర్టీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
లెహర్ తుఫాన్ వల్ల ఎవరికి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన వెంటనే 08742231600, 08744249994, 08743232426కు ఫోన్ చేయాలని సూచించారు. లెహర్ తుఫాన్ వల్ల జిల్లాలో 20 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ శ్రీ నరేష్ విజ్ఞప్తి చేశారు.