leher cyclone
-
'8వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు'
లెహర్ తుఫాన్ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా నాలుగు మండలాల్లో ఎనిమిది వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ వెల్లడించారు. గురువారం గుంటూరులో లెహర్ తుఫాన్‌పై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సముద్రంలో నాలుగు అడుగుల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దాంతో సముద్రం అల్లకల్లొలంగా తయారైంది. ఈ నేపథ్యంలో మత్య్సకారులు ఎవరు సముద్రంలోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.గత రాత్రి నుంచి తీర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయని చెప్పారు. తెనాలి డివిజన్ పరిధిలో పాఠశాలకు శెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని నిజాంపట్నం ఓడరేవులో ఐదవ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు చెప్పారు. -
భయం గుప్పిట్లో 'పశ్చిమ'తీర ప్రాంతాలు
లెహర్ తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలోని తీర ప్రాంతాలు భయం గుప్పిట్లో చిక్కుకున్నాయి. దాంతో నరసాపురం, యలమంచిలి, ఆచంట, కాళ్ల, భీమవరం, ఆకివీడు,పోడూరు, పాలకోడేరు, వీరవాసరం,మొగల్తూరు మండలాల్లోని ప్రజలకు అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ సిద్దార్థ జైన్ గురువారం ఇక్కడ వెల్లడించారు. ఆ మండలాలపై లెహర్ ప్రభావం అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దాంతో 5 వేల మంది ప్రజలను 44 పునరావాస కేంద్రాలను తరలించినట్లు చెప్పారు. జిల్లాలో ఎక్కడ ఎటువంటి విపత్తు చోటు చేసుకున్న సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే జిల్లాకు ఐదువందల మంది సైనికులు, నాలుగు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ బృందాలు చేరుకున్నాయని చెప్పారు. విద్యుత్ స్తంభాలు నెలకొరగడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం సంభవించడం వంటి సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ శాఖలో వెయ్యి మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. లెహర్ గాలుల తీవ్రతతో సమాచార వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 30 వైర్లెస్ సెట్టు సిద్ధంగా ఉంచామన్నారు. అలాగే తీర ప్రాంతాల్లో 278 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచినట్లు వివరించారు. పోలవరానికి వెళ్లే పర్యాటక బోట్లును నిలిపివేసినట్లు తెలిపారు. నరసాపురం తీర ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులను కూడా రద్దు చేసినట్లు చెప్పారు -
ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు: ఖమ్మం కలెక్టర్
లెహర్ తుపాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీనరేష్ బుధవారం ఇక్కడ వెల్లడించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన జిల్లా ప్రజలకు సూచించారు. అధికారులంతా విధులకు హాజరుకావాలని ఆయన ఆదేశించారు. విధులపట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తామని తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ ఆర్టీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. లెహర్ తుఫాన్ వల్ల ఎవరికి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన వెంటనే 08742231600, 08744249994, 08743232426కు ఫోన్ చేయాలని సూచించారు. లెహర్ తుఫాన్ వల్ల జిల్లాలో 20 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ శ్రీ నరేష్ విజ్ఞప్తి చేశారు.