లెహర్ తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలోని తీర ప్రాంతాలు భయం గుప్పిట్లో చిక్కుకున్నాయి. దాంతో నరసాపురం, యలమంచిలి, ఆచంట, కాళ్ల, భీమవరం, ఆకివీడు,పోడూరు, పాలకోడేరు, వీరవాసరం,మొగల్తూరు మండలాల్లోని ప్రజలకు అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ సిద్దార్థ జైన్ గురువారం ఇక్కడ వెల్లడించారు.
ఆ మండలాలపై లెహర్ ప్రభావం అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దాంతో 5 వేల మంది ప్రజలను 44 పునరావాస కేంద్రాలను తరలించినట్లు చెప్పారు. జిల్లాలో ఎక్కడ ఎటువంటి విపత్తు చోటు చేసుకున్న సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే జిల్లాకు ఐదువందల మంది సైనికులు, నాలుగు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ బృందాలు చేరుకున్నాయని చెప్పారు.
విద్యుత్ స్తంభాలు నెలకొరగడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం సంభవించడం వంటి సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ శాఖలో వెయ్యి మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. లెహర్ గాలుల తీవ్రతతో సమాచార వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 30 వైర్లెస్ సెట్టు సిద్ధంగా ఉంచామన్నారు. అలాగే తీర ప్రాంతాల్లో 278 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచినట్లు వివరించారు. పోలవరానికి వెళ్లే పర్యాటక బోట్లును నిలిపివేసినట్లు తెలిపారు. నరసాపురం తీర ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులను కూడా రద్దు చేసినట్లు చెప్పారు