ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
–వి కోట మండలంలో రెయిన్ గన్స్ వినియోగం పరిశీలన
–సాయంత్రం బస్టాండులో బహిరంగ సభ
–అధికారులు ఏర్పాట్లు పూర్తి
చిత్తూరు (కలెక్టరేట్) వి కోట:
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం జిల్లాకు రానున్నారు. జిల్లా కలెక్టర్ సిద్దార్థ్‌జైన్ శనివారం ఓ ప్రకటనలో ఈవిషయం తెలిపారు. మధ్యాహ్నం 1.15 గంటలకు అనంతపురం జిల్లా నుంచి సీఎం హెలికాప్టర్‌లో బయలుదేరి 2 గంటలకు రామకుప్పం మండలం మిట్టపల్లికి చేరుకుంటారు. అక్కడ నుంచి వి కోట మండలం కె.పత్తూరు గ్రామం చేరుకుని బెండుగాని చెరువు పరిధిలో నీరు – చెట్టు, పంటసంజీవని పనులు పరిశీలిస్తారు. 2.25 గంటలకు రెయిన్‌గన్స్ ద్వారా పంటను తడపడం చూస్తారు. పంట సంజీవని వినియోగాన్ని పరిశీలిస్తారు. 3.05 గంటలకు గుమ్మిరెడ్డిపల్లెకు చేరుకుని వేరుశనగ పంటలో బిందు సాగునీటి పద్ధతిని పరిశీలిస్తారు. 3.25 గంటలకు సీఎం బైరుపల్లెలో రెయిన్‌గన్స్ ఉపయోగాన్ని పరిశీలించనున్నారు. 3.35 గంటలకు అదే గ్రామంలో ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలించి, రైతులతో చర్చిస్తారు. 3.55 గంటలకు వి.కోట ఆర్టీసీ బస్టాండు జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత హెలికాఫ్టరులో విజయవాడ వెళతారు. సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. హెలీపాడ్‌ను ఆయన పరిశీలించారు. బందోబస్తుకోసం వచ్చిన పోలీసులకు డ్యూటీలను కేటాయించారు.