బీడీ కట్ట చూస్తే పింఛను నిలిపేస్తా
చిత్తూరు : తాతయ్యా నేను కలెక్టర్ని, మీకు పింఛను ఇస్తున్నారా ? వెయ్యి రూపాయిలు కరెక్టుగా ఇస్తున్నారా ? పిల్లలు ఎంత మంది ? ఏమీ చేస్తున్నారు ? అంటూ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ఓ వృద్ధుడిని ఆప్యాయంగా పలుకరించారు. సోమవారం కార్వేటినగరంలో ఓ కల్వర్టుపై కూర్చుని ఉన్న వృద్ధుడు చెంగయ్య వద్దకు కలెక్టర్ వెళ్లారు. కుశల ప్రశ్నలు వేశారు. అతని జేబులో ఉన్న బీడీల కట్టను తీసుకున్నారు.
పింఛను ఇచ్చేది బీడీలకు కాదు' అని కలెక్టర్ అనడంతో అక్కడే ఉన్నవారంతా నవ్వేశారు. అలవాటైంది. వదులుకోలేకపోతున్నా సార్ అంటూ బదులుచ్చాడు. అయితే పింఛనుకు బదులు బీడీలు ఇస్తామని కలెక్టర్ అనగానే... వద్దు సార్ వెయ్యి రూపాయిలు లేదంటే ప్రాణాలు వదులుకోవాల్సిందేనన్నారు. దాంతో కలెక్టర్ 'ఎప్పుడైనా ఈ దారిలో వస్తా, జేబులో బీడీ కట్ట చూస్తే పింఛను నిలిపేస్తానని నవ్వుతూ హెచ్చరించారు.