సాక్షి, హైదరాబాద్: కడుపుకు అన్నం తినేవారెవరూ రాహుల్‌గాంధీ అర్హత గురించి ప్రశ్నించరని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నా రాహుల్ ఏ పదవినీ తీసుకోలేదని గుర్తు చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబానికి చెందిన రాహుల్‌గాంధీకి తప్ప తెలంగాణలో పర్యటించేందుకు ఇంకెవరికి హక్కు ఉంటుందని ప్రశ్నించారు.
గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్ నేతలకు లేదని అన్నారు. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించినా రాహుల్ ప్రకటించిన విధంగా వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని స్పష్టం చేశారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఖమ్మం సభ విజయవంతం కావడంతో..
బీఆర్‌ఎస్ నేతలు అంటకాగుతున్న ప్రధాని మోదీకి మాత్రమే తెలంగాణలో పర్యటించే హక్కు ఉందా అని రేవంత్ నిలదీశారు. ‘రాహుల్‌గాం«దీని విమర్శిస్తున్న బీఆర్‌ఎస్ నేతలకు అసలు ఏం అర్హత ఉంది? ట్విట్టర్ పిట్ట, సోడా కలిపేటోడు, భూమికి మూడు అడుగులున్నోడు కూడా రాహుల్ అర్హత గురించి మాట్లాడుతున్నారు..’అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో అసలు నక్క తప్ప వేట కుక్కలన్నీ బయటకు వచ్చి మొరగడం ప్రారంభించాయని అన్నారు.
జనగర్జన సభకు ప్రజలు రాకుండా ప్రభుత్వం అన్ని రకాల కుయుక్తులు పన్నిందని, అక్కడి సైకో మంత్రి అడ్డుకునే ప్రయత్నం చేసినా, కుట్రలను ఛేదించి ఖమ్మంలో సభను విజయవంతం చేశారని అన్నారు. ఇందుకు ఖమ్మం ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
అన్ని హామీలు నిలబెట్టుకున్న చరిత్ర మాది
దేశంలో, రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ దని రేవంత్ అన్నారు. భాక్రానంగల్ నుంచి నాగార్జునసాగర్ సహా, శ్రీరాంసాగర్, జూరా ల లాంటి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు, లక్షకు పైగా గ్రామాలకు విద్యుత్ సౌకర్యం, అనేక ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటు, ఆర్టీఐ, ఆహా ర భద్రతా చట్టాలు, యూనివర్సిటీల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఔటర్ రింగురోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, ఫార్మా కంపెనీలు, మెట్రో రైలు.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ఉన్నాయని చెప్పారు. తాము ప్రాజె క్టులు తెస్తే, బీఆర్‌ఎస్ నేతలు ఫామ్‌హౌస్‌లు తెచ్చారని విమర్శించారు.
కాళేశ్వరంపై చర్చకు సిద్ధం
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ ఇచ్చిన నివేదికపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్ చెప్పారు. ఈ విషయంలో చర్చ పెడితే తమ పార్టీ తరఫున ఇద్దరు ప్రతినిధులం హాజరవుతామని, మంత్రులు హరీశ్, కేటీఆర్‌లు సి ద్ధమా అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై రాహు ల్ చేసిన వ్యాఖ్యలో తప్పేమీ లేదన్నారు. బెంగళూరులో జరిగే విపక్షాల సమావేశానికి బీఆర్‌ఎస్‌ను రానివ్వబోమని, ఒకవేళ వస్తే మెడలు పట్టి గెంటేస్తామని అన్నారు.
రూ.4 వేల పింఛన్ మా తొలి ప్రాధాన్యత
రూ.4 వేలు పింఛన్ ప్రకటనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రేవంత్ చెప్పారు. కేసీఆర్ అవినీతిని ఆపితే మొత్తం 55 లక్షల మంది పింఛన్‌దారులకు తాము హామీ ఇచ్చిన విధంగా పింఛన్ ఇవ్వొచ్చని చెప్పారు. తెలంగాణ ఇచి్చనట్టే రూ.4 వేల పింఛన్ ఇచ్చి తీరుతామని అన్నారు. రాష్ట్ర ఆదాయం భారీగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడున్న పింఛన్‌ను రూ.4 వేలకు పెంచడం పెద్ద కష్టమేమీ కాదని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.4 వేల పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నించడాన్ని రేవంత్ తప్పుపట్టారు. ఆయా రాష్ట్రాల జనాభా, పార్టీలకుండే ప్రాధాన్యతల మేరకు పథకాలు అమలవుతాయని రేవంత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment