అధిర్ రంజన్ చౌధురి
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల కోసం కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్ చౌధురి తన వంతు కృషి చేస్తున్నారు. ఢిల్లీలో తన కార్యాలయాన్ని కంట్రోల్ రూమ్‌గా మార్చి దేశవ్యాప్తంగా వలస కార్మికులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారికి ధైర్యాన్ని ఇస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని వలస కార్మికులతో చర్చించి వారి సమస్యలను తీరుస్తున్నారు. అధీర్ రంజన్ తన భార్య, సిబ్బందితో కలిసి తన కార్యాలయ్యాన్నే ఓ మినీ కంట్రోల్ రూమ్‌గా మార్చారు. వలస కార్మికుల సమస్యలు తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులు, అక్కడి పార్టీ కార్యకర్తలను సంప్రదించి వెంటనే సహాయం అందేలా చూస్తున్నారు. నిరాశ్రయులైన వలసకార్మికుల వివరాలను సేకరించి వారిని సంప్రదించడంలో అధీర్ సతీమణి, సిబ్బంది తోడ్పాటును అందిస్తున్నారు.
తన నియోజక వర్గం బెహ్రాపూర్ నుంచే రోజుకు దాదాపు 500 వరకు సహాయాన్ని కోరుతూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని అధీర్ రంజన్ తెలిపారు. ‘ఆశ్రయం, ఆహారం లేక వలసకార్మికులు రోధిస్తున్నారు. నా నియోజక వర్గంలో ఎక్కువగా పేద వారే ఉన్నారు. ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే వారి వివరాలు సేకరించి, వెంటనే సహాయం అందేలా చూస్తున్నాము’ అని అధీర్ తెలిపారు.
ఇక దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు, జిల్లా అధికారులను సహాయం కోసం సంప్రదిస్తున్నానని తెలిపారు. బీజేపీ ఎంపీలు, మంత్రులను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వలస కార్మికుల కోసం సంప్రదిస్తున్నానన్నారు. వారు కూడా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించడానికి సహాయపడుతున్నారని చెప్పారు.
అయితే ఇతర రాష్ట్రాల్లో ఇబ్బందుల్లో ఉన్న వలస కార్మికుల విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వద్ద సరైన సమాచారం లేదని, వారి కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని అధీర్ మండిపడ్డారు. లాక్‌డౌన్ ముగియగానే పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలసకార్మికులు దేశంలో ఎక్కడున్నా స్వరాష్ట్రానికి తీసుకురావడంలో సహాయాన్ని అందించాలని తాను ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశానని పేర్కొన్నారు.(వలస కార్మికులను తరలించండి)
Comments
Please login to add a commentAdd a comment