సాక్షి, నిర్మల్: ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్ అవాకులు చవాకులు పేలుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని.. ధరణి పోర్ట్‌లను బంగాళాఖాతంలో వేస్తామన్న దుర్మార్గులను బంగాళా ఖాతంలో పడేయాలని ధ్వజమెత్తారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం ఎల్లపెల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరుపై ధ్వజమెత్తారు.
ధరణి ఉండలా, వద్దా?
ధరణి తీసేస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు ఎలా పడతాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వం బ్యాంకులో వేస్తే.. బ్యాంకు నుంచి మీకు మెస్సేజ్‌లు వస్తున్నాయని తెలిపారు. రైతు చనిపోతే ఏవిధంగా రైతు బీమా వస్తుందని నిలదీశారు. అందుకే ధరణి పోర్టల్ ఉండలా, వద్దా మీరే చెప్పండంటూ ప్రజలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. గతంలో రెవెన్యూ శాఖలో భయంకరమైన దోపిడీ జరిగేదని ఎవరి భూమి ఎవరి చేతుల్లో ఉండేదో తెలిసేది కాదన్నారు. నిన్న ఉన్న భూమి తెల్లవారే సరికి పహనీలు మారిపోయేవన్నారు.
వరాల జల్లు
నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు, మండల కేంద్రాలకు, మున్సిపాలిటీలకు భారీగా నిధులు మంజూరు చేశారు. జిల్లాలోని 396 గ్రామ పంచాయితీలకు రూ 10 లక్షలు ఇస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు ఇవి కాకుండా నిర్మల్ జిల్లాలో 19 మండల కేంద్రాలకు రూ. 20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు.
చదవండి: నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటేడ్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
నిర్మల్‌కు ఇంజనీరింగ్ కళాశాల
బాసరా సరస్వతి దేవాలయాన్ని పెద్దగా అభివృద్ధి చేసుకుందామని, అద్భుత ఆలయం నిర్మించుకుందామని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఓ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తున్నట్లు పేర్కన్నారు. ఒకనాడు మారుమూల జిల్లా, అడవి జిల్లా అని పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని కొత్తగా మూడు మెడికల్ కాలేజీలు వచ్చాయి.
8న చెరువుల పండగ
‘కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రాంరాం చెబతారు. కాంగ్రెస్ పాలన మనం చూడలేదా. ధరణి పోర్టల్‌ను తీసేస్తే మళ్లీ ఎన్ని రోజులు తిరగాలి. మనకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. రైతు బంధు, దళిత బంధు రాంరాం అనే వాళ్లు కావాలా? ఒకప్పుడు కరెంట్ ఎప్పుడ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు. ఇప్పుడు రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్. సాగు, తాగు నీరుసమస్య తీర్చుకున్నాం. ఈనెల 8న చెరువుల పండగ జరుపుకోవాలి. దేశంలోనూ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ రావాలి
ఫుడ్ ప్రాసెసింగ్‌పై ఫోకస్
మహారాష్ట్ర రైతులు మన దగ్గర అర ఎకరం కొని వాళ్ల పొలాలకు నీళ్లు తీసుకెళ్తున్నారు. మహారాష్ట్రలో కూడా కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుతున్నారు. అధికారానికి దూరమైన వాళ్లు ఏదేదో మాట్లాడుతున్నారు. త్వరలోనే ఎస్‌ఆర్‌ఎస్‌పీ ద్వారా లక్ష ఎకరాలకు నీళ్లు అందిస్తాం. ఎన్నికల తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్‌పై ఫోకస్ పెడతాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు. రాష్ట్రం ఇలాగే సుభిక్షంగా ఉండాలంటే మీ ఆశీస్సులు కావాలి.
Comments
Please login to add a commentAdd a comment