ఆదిమానవుడి ఆనవాళ్లు సిద్దిపేట జిల్లాలో బయటపడుతున్నాయి. పాత రాతియుగం, కొత్త రాతియుగం, రాగి యుగం, ఆధునిక శిలాయుగం ఇలా అన్ని యుగాల మానవులు ఇక్కడ నివసించినట్లు రుజువులు కన్పిస్తున్నాయి. జైన, బౌద్ధ మతాలు, శాతవాహనులు, చాణిక్యులు, కాకతీయులు ఇలా పలు రాజవంశీయులు ఇక్కడ పాలించినట్లుగా, ఈ ప్రాంతంలో కలియతిరిగినట్లుగా చెప్పే శాసనాలు దర్శనమిస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఏ మూలన చూసినా పురాతన యుగం విరాజిల్లినట్లుగా వస్తువులు, శాసనాలు, వ్రిగహాలు, ఆయుధాలు, పూసలు, సమాధులు తదితరాలు దర్శనమిస్తున్నాయి. - సాక్షి, సిద్దిపేట
ఆదిమానవుడి అడ్డాగా ‘పుల్లూరు’
జంతువులతో సమానమైన జీవనం సాగించిన ఆదిమానవుడు తర్వాత ఆహార అన్వేషణ, రక్షణ కోసం సమూహాలుగా ఉండేవారు. ఇందులో భాగంగానే సిద్దిపేట జిల్లాలోని పుల్లూరును వాళ్లు రాజ్యం గా ఏర్పాటు చేసుకొని జీవించినట్లు ఇటీవల ఆధారాలు లభించాయి. వారు పూజించిన శక్తి స్వరూపిణి అమ్మవారి విగ్రహం, ప్రత్యేక రాతి గుహల నడుమ నిర్మించిన సమాధులు, వినియోగించిన పలు రకాల వస్తువులు లభించాయి. ఈ వస్తువులను పరిశీలించిన చరిత్రకారులు క్రీ.పూ 5 వేల ఏళ్ల క్రితం నాటివని గుర్తించారు.
సింగరాయకొండలో ‘అమ్మదేవత’
ఆదిమానవుడు స్త్రీని దేవతగా పూజించారని చరిత్రలో విన్నాం. సిద్దిపేట జిల్లా కూరెళ్ల సమీపంలో ఉన్న సింగరాయకొండలో అమ్మ దేవత విగ్రహం బయటపడింది. స్త్రీమూర్తి అందాన్ని వర్ణించి చెక్కిన ఈ విగ్రహం ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత గలదిగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విగ్రహానికి సమీపంలో బౌద్ధ బ్రహ్మ కూడా లభించడం విశేషం. ఆయా పరిసర ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసుకునేందుకు బావుల నిర్మాణం, వారు వినియోగించిన మట్టి పాత్రలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ బౌద్ధ బ్రహ్మ విగ్రహం పాకిస్తాన్‌లో ఒకచోట లభించగా మరొకటి సిద్దిపేట జిల్లా సింగరాయకొండ సమీపంలో లభించడం గమనార్హం.
విరాజిల్లిన జైన, బౌద్ధ మతం
జిల్లాలోని శనిగరం, నంగునూరు, కూరెళ్ల, కోహెడ ప్రాంతాల్లో జైన మతం విరాజిల్లినట్లు ఆధారాలు లభించాయి. జైనమత తీర్థాంకరుల్లో 23వ వాడైన పార్శనాథుడి విగ్రహం ఇటీవల శనిగరం గుట్టపై లభించింది. జైనుల కాలంలో మహిళాయక్షిణి, పక్కన చంటి పిల్లవాడు పట్టుకున్న అపురూప శిల్పం లభించింది. ఈ శిల్పమే తర్వాత కాలంలో గొల్ల కేతమ్మగా పిలువబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఆదిమానవుడు ప్రత్యేక వరుసలో బండరాళ్లను పేర్చి నిర్మించిన సమాధులు కూడా లభించాయి. ఈ చరిత్ర అంతా జైనుల కాలం నాటిదే అని పురావస్తు శాఖ అధికారులు ధ్రువీకరించారు. కూరెళ్లలో జైనమత గుర్తులుగా భావించే చౌముఖి శిల్పం తవ్వకాల్లో బయటపడింది. దుద్దెడ గ్రామ శివాలయంలో దిగంబరుడైన జైన తీర్థాంకరుల విగ్రహాలు లభించాయి. కొమురవెల్లి గుట్టపైన జైన మత విగ్రహాలు, ఆనవాళ్లు లభించాయి. తొగుట మండలం ఆల్వాల్‌లోనూ జైన తీర్థాంకుల విగ్రహాలు లభించాయి.
పాపన్నగుట్టపై అరుదైన అష్టభుజి తంత్ర భైరవుడు
హుస్నాబాద్ మండలం పాపన్న(సర్వాయిపాపన్న) గుట్టగా పిలువబడే ప్రాంతంలో అరుదైన అష్టభుజి తంత్ర భైరవుడి విగ్రహం బయటపడింది. ఎనిమిది భుజాలతో భయంకరమైన స్వరూపిణిగా ఉన్న ఈ భైరవుడు ఆదిమానవులు, తర్వాత జైనుల పూజలు అందుకునేవారని నానుడి. వీరిని ఆరాధించిన వారి కోర్కెలు నెరవేరుతాయనే నమ్మకం. అందుకోసమే భైరవుడికి జంతుబలి, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయా ప్రాంతాల్లో లభిస్తున్న వస్తువుల ఆధారంగా తెలుస్తోందని పురావస్తుకారులు చెబుతున్నారు.
చతురస్రాకారంలో సమాధులు
ఆదిమానవుడి సమాధులు సిద్దిపేట జిల్లావ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. నర్మెటలో మెనిహీర్, శనిగరం, పుల్లూరు, కొండపాక, జగదేవ్‌పూర్, దామరకుంట, తంగెళ్లపల్లి గ్రామాల సమీ పంలో ట్రైనీడ్స్(త్రిశూలం) ఆకారంలో బండరాతిపై చెక్కిన శిల్పాలు దొరికాయి. వీటి కింది భాగంలో ఆది మానవుడి సమాధులు ఉండటం గమనార్హం. చుట్టూ బండరాతి ఫెన్సిం గ్, రంగురంగుల రాళ్లు, చతురస్రాకారంలో నిర్మాణాలు చేపట్టి మధ్యలో సమాధులు నిర్మించారు. ఈ నిర్మాణాలను ఆధారంగా చేసుకొని మృతి చెందినవ్యక్తి స్థాయిని అంచనా వేయొచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రాజ్యరక్షకులు ‘వీరగల్లులు’
రాజ్యంలోని ప్రజలను ఖడ్గమృగాల బారి నుంచి రక్షించేందుకు, శత్రువుల దండయాత్రలను తిప్పికొట్టేందుకు వీరగల్లులు ఉండేవారు. శాతవాహనులు, చాణిక్యులు, కాకతీయుల కాలంలో వివిధ రూపాలతో వీరు దర్శనమిచ్చేవారు. ప్రధానంగా రుద్రదేవుడి కాలంలో ఆకునూరు, కొండపాక ప్రాంతాల్లో ఎక్కంటీలున్నట్లు (ధనుర్థారుల సైన్యం) దేవాలయాల్లో చెక్కిన శాసనాలు చెబుతున్నాయి. దూలిమిట్ట ప్రాంతంలో లభించిన వీరగల్లు ఆహార్యం కల్యాణి చాణిక్యుల కాలం నాటివిగా స్పష్టం అవుతోంది. కోహెడ ప్రాంతంలో లభించిన వీరగల్లు యుద్ధం చేస్తున్న దృశ్యాన్ని సూచిస్తోంది. ఇలా తొమ్మిది రకాలుగా ఉన్న వీరగల్లుల ప్రతిమలు ప్రతి గ్రామపొలిమేరల వద్ద ఉన్నాయి. వీటినే ఇప్పుడు హనుమంతులుగా, వీరభద్రులుగా, గ్రామరక్షకులుగా పూజిస్తున్నారు.
ఆది మానవుడు నడయాడిన నేల
సిద్దిపేట జిల్లాలో నలుమూలలా ఆది మానవుడు నడయాడినట్లు చరిత్ర చెబుతోంది. క్రీస్తుపూర్వం 15 వేల ఏళ్ల క్రితమే యూరప్ నుంచి ఒక తెగ ఈ ప్రాంతానికి వచ్చి జీవించినట్లు ఆధారాలు ఉన్నాయి. సమాధులు, వారు వాడిన వస్తువులు, జైన, బౌద్ధ మత ప్రచారం. వివిధ భంగిమల్లో స్త్రీల శిల్పాలు సాక్షాలుగా నిలుస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లభించని అరుదైన పురావస్తు సంపద సిద్దిపేట జిల్లాలో లభించడం విషేశం.
–వేముగంటి మురళి, చరిత్రకారుడు
Comments
Please login to add a commentAdd a comment