Archaeological findings
-
15 వేల ఏళ్ల క్రితమే సిద్దిపేటకు వలసలు
ఆదిమానవుడి ఆనవాళ్లు సిద్దిపేట జిల్లాలో బయటపడుతున్నాయి. పాత రాతియుగం, కొత్త రాతియుగం, రాగి యుగం, ఆధునిక శిలాయుగం ఇలా అన్ని యుగాల మానవులు ఇక్కడ నివసించినట్లు రుజువులు కన్పిస్తున్నాయి. జైన, బౌద్ధ మతాలు, శాతవాహనులు, చాణిక్యులు, కాకతీయులు ఇలా పలు రాజవంశీయులు ఇక్కడ పాలించినట్లుగా, ఈ ప్రాంతంలో కలియతిరిగినట్లుగా చెప్పే శాసనాలు దర్శనమిస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఏ మూలన చూసినా పురాతన యుగం విరాజిల్లినట్లుగా వస్తువులు, శాసనాలు, వ్రిగహాలు, ఆయుధాలు, పూసలు, సమాధులు తదితరాలు దర్శనమిస్తున్నాయి. - సాక్షి, సిద్దిపేట ఆదిమానవుడి అడ్డాగా ‘పుల్లూరు’ జంతువులతో సమానమైన జీవనం సాగించిన ఆదిమానవుడు తర్వాత ఆహార అన్వేషణ, రక్షణ కోసం సమూహాలుగా ఉండేవారు. ఇందులో భాగంగానే సిద్దిపేట జిల్లాలోని పుల్లూరును వాళ్లు రాజ్యం గా ఏర్పాటు చేసుకొని జీవించినట్లు ఇటీవల ఆధారాలు లభించాయి. వారు పూజించిన శక్తి స్వరూపిణి అమ్మవారి విగ్రహం, ప్రత్యేక రాతి గుహల నడుమ నిర్మించిన సమాధులు, వినియోగించిన పలు రకాల వస్తువులు లభించాయి. ఈ వస్తువులను పరిశీలించిన చరిత్రకారులు క్రీ.పూ 5 వేల ఏళ్ల క్రితం నాటివని గుర్తించారు. సింగరాయకొండలో ‘అమ్మదేవత’ ఆదిమానవుడు స్త్రీని దేవతగా పూజించారని చరిత్రలో విన్నాం. సిద్దిపేట జిల్లా కూరెళ్ల సమీపంలో ఉన్న సింగరాయకొండలో అమ్మ దేవత విగ్రహం బయటపడింది. స్త్రీమూర్తి అందాన్ని వర్ణించి చెక్కిన ఈ విగ్రహం ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత గలదిగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విగ్రహానికి సమీపంలో బౌద్ధ బ్రహ్మ కూడా లభించడం విశేషం. ఆయా పరిసర ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసుకునేందుకు బావుల నిర్మాణం, వారు వినియోగించిన మట్టి పాత్రలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ బౌద్ధ బ్రహ్మ విగ్రహం పాకిస్తాన్లో ఒకచోట లభించగా మరొకటి సిద్దిపేట జిల్లా సింగరాయకొండ సమీపంలో లభించడం గమనార్హం. విరాజిల్లిన జైన, బౌద్ధ మతం జిల్లాలోని శనిగరం, నంగునూరు, కూరెళ్ల, కోహెడ ప్రాంతాల్లో జైన మతం విరాజిల్లినట్లు ఆధారాలు లభించాయి. జైనమత తీర్థాంకరుల్లో 23వ వాడైన పార్శనాథుడి విగ్రహం ఇటీవల శనిగరం గుట్టపై లభించింది. జైనుల కాలంలో మహిళాయక్షిణి, పక్కన చంటి పిల్లవాడు పట్టుకున్న అపురూప శిల్పం లభించింది. ఈ శిల్పమే తర్వాత కాలంలో గొల్ల కేతమ్మగా పిలువబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఆదిమానవుడు ప్రత్యేక వరుసలో బండరాళ్లను పేర్చి నిర్మించిన సమాధులు కూడా లభించాయి. ఈ చరిత్ర అంతా జైనుల కాలం నాటిదే అని పురావస్తు శాఖ అధికారులు ధ్రువీకరించారు. కూరెళ్లలో జైనమత గుర్తులుగా భావించే చౌముఖి శిల్పం తవ్వకాల్లో బయటపడింది. దుద్దెడ గ్రామ శివాలయంలో దిగంబరుడైన జైన తీర్థాంకరుల విగ్రహాలు లభించాయి. కొమురవెల్లి గుట్టపైన జైన మత విగ్రహాలు, ఆనవాళ్లు లభించాయి. తొగుట మండలం ఆల్వాల్లోనూ జైన తీర్థాంకుల విగ్రహాలు లభించాయి. పాపన్నగుట్టపై అరుదైన అష్టభుజి తంత్ర భైరవుడు హుస్నాబాద్ మండలం పాపన్న(సర్వాయిపాపన్న) గుట్టగా పిలువబడే ప్రాంతంలో అరుదైన అష్టభుజి తంత్ర భైరవుడి విగ్రహం బయటపడింది. ఎనిమిది భుజాలతో భయంకరమైన స్వరూపిణిగా ఉన్న ఈ భైరవుడు ఆదిమానవులు, తర్వాత జైనుల పూజలు అందుకునేవారని నానుడి. వీరిని ఆరాధించిన వారి కోర్కెలు నెరవేరుతాయనే నమ్మకం. అందుకోసమే భైరవుడికి జంతుబలి, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయా ప్రాంతాల్లో లభిస్తున్న వస్తువుల ఆధారంగా తెలుస్తోందని పురావస్తుకారులు చెబుతున్నారు. చతురస్రాకారంలో సమాధులు ఆదిమానవుడి సమాధులు సిద్దిపేట జిల్లావ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. నర్మెటలో మెనిహీర్, శనిగరం, పుల్లూరు, కొండపాక, జగదేవ్‌పూర్, దామరకుంట, తంగెళ్లపల్లి గ్రామాల సమీ పంలో ట్రైనీడ్స్(త్రిశూలం) ఆకారంలో బండరాతిపై చెక్కిన శిల్పాలు దొరికాయి. వీటి కింది భాగంలో ఆది మానవుడి సమాధులు ఉండటం గమనార్హం. చుట్టూ బండరాతి ఫెన్సిం గ్, రంగురంగుల రాళ్లు, చతురస్రాకారంలో నిర్మాణాలు చేపట్టి మధ్యలో సమాధులు నిర్మించారు. ఈ నిర్మాణాలను ఆధారంగా చేసుకొని మృతి చెందినవ్యక్తి స్థాయిని అంచనా వేయొచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాజ్యరక్షకులు ‘వీరగల్లులు’ రాజ్యంలోని ప్రజలను ఖడ్గమృగాల బారి నుంచి రక్షించేందుకు, శత్రువుల దండయాత్రలను తిప్పికొట్టేందుకు వీరగల్లులు ఉండేవారు. శాతవాహనులు, చాణిక్యులు, కాకతీయుల కాలంలో వివిధ రూపాలతో వీరు దర్శనమిచ్చేవారు. ప్రధానంగా రుద్రదేవుడి కాలంలో ఆకునూరు, కొండపాక ప్రాంతాల్లో ఎక్కంటీలున్నట్లు (ధనుర్థారుల సైన్యం) దేవాలయాల్లో చెక్కిన శాసనాలు చెబుతున్నాయి. దూలిమిట్ట ప్రాంతంలో లభించిన వీరగల్లు ఆహార్యం కల్యాణి చాణిక్యుల కాలం నాటివిగా స్పష్టం అవుతోంది. కోహెడ ప్రాంతంలో లభించిన వీరగల్లు యుద్ధం చేస్తున్న దృశ్యాన్ని సూచిస్తోంది. ఇలా తొమ్మిది రకాలుగా ఉన్న వీరగల్లుల ప్రతిమలు ప్రతి గ్రామపొలిమేరల వద్ద ఉన్నాయి. వీటినే ఇప్పుడు హనుమంతులుగా, వీరభద్రులుగా, గ్రామరక్షకులుగా పూజిస్తున్నారు. ఆది మానవుడు నడయాడిన నేల సిద్దిపేట జిల్లాలో నలుమూలలా ఆది మానవుడు నడయాడినట్లు చరిత్ర చెబుతోంది. క్రీస్తుపూర్వం 15 వేల ఏళ్ల క్రితమే యూరప్ నుంచి ఒక తెగ ఈ ప్రాంతానికి వచ్చి జీవించినట్లు ఆధారాలు ఉన్నాయి. సమాధులు, వారు వాడిన వస్తువులు, జైన, బౌద్ధ మత ప్రచారం. వివిధ భంగిమల్లో స్త్రీల శిల్పాలు సాక్షాలుగా నిలుస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లభించని అరుదైన పురావస్తు సంపద సిద్దిపేట జిల్లాలో లభించడం విషేశం. –వేముగంటి మురళి, చరిత్రకారుడు -
మేకలమ్మగుట్టపై దిగంబర విగ్రహాలు
రఘునాథపల్లి : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని మేకలగట్టు గ్రామంలో ఉన్న మేకలమ్మ గుట్టపై దంపతుల దిగంబర విగ్రహాలు వెలుగు చూశాయి. జనగామ ప్రాంతానికి చెందిన ఔత్సాహిక పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి బుధవారం తాజాగా వీటిని గుర్తించారు. 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టపై కనిపించిన స్త్రీ, పురుష దిగంబర విగ్రహాలను మేకలయ్య, మేకలమ్మగా భావిస్తున్నారు. 10 శతాబ్దానికి చెందిన ఈ దంపతుల శిల్పాలు విడివిడిగా అడుగున్నర ఎత్తులో ఉన్నాయి. ఎలాంటి ఆయుధాలు, జంతువుల చిహ్నాలు లేకపోవడంతో వారు ఏ దేవతామూర్తులే చెప్పలేకపోతున్నారు. మేకలమ్మ శిల్పం మూడు ముక్కలుగా ఉండగా మధ్య భాగం కనిపించడం లేదు. ఇక్కడ రాతితో నిర్మించిన మేకలమ్మ గుడిని దశాబ్దాల క్రితం కూల్చి వేయడంతో పూర్తిగా మాయమైంది. గుడికి ఉన్న మాన్యం భూములు అన్యాక్రాంతం అయ్యాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇక్కడ జాతర జరిగేదని, రెండు దశాబ్దాలుగా అటు వైపు వెళ్లే వారు లేరని తెలుస్తోంది. అరుదైన డోల్మన్ సమాధులు.. గుట్టకు తూర్పు వైపున అనేక బండలున్నాయి. అక్కడ సముద్ర మట్టానికి 1,565 అడుగుల ఎత్తులో అనేక డోల్మన్ సమాధులను నిర్మించారు. మేకలమ్మ గుడికి 100 అడుగుల దూరంలో మూడు మీటర్ల పొడవైన రెండు రాతి పలకలు, అడుగున్నర పొడవులో ఉన్న పలకలను స్వస్తిక్ ఆకారంలో అమర్చారు. ఈ నాలుగింటి మధ్య మూడు నుంచి నాలుగు అడుగుల ఖాళీ స్థలాన్ని వదిలి పై భాగాన కప్పు బండ బోర్లించారు. ఇటువంటి నిర్మాణాలు చాలు అరుదుగా ఉంటాయి. చుట్టు పక్కల ఉన్న అనేక డోల్మన్ సమాధులను కూల్చివేశారు. గుట్ట కింద ఉన్న కుంటల్లో వందల సంఖ్యలో పెలికాన్ కొంగలు వచ్చి సేదతీరుతున్నాయి. మేకలమ్మ గుట్టను పురావస్తుశాఖ అధికారులు సందర్శిస్తే మరెంతో చరిత్ర వెలుగులోకి రానుంది. ఖిలాషాపూర్ సర్వాయి పాపన్న కోట సమీపంలోని ఈ గుట్టపై మేకలమ్మ ఆలయం నిర్మిస్తే పర్యాటక ప్రాంతం కావడంతోపాటు డోల్మన్ సమాధులు రక్షించబడతాయి. సమగ్రంగా పరిశోధించాలి జిల్లాలో ఎక్కడా లేని విధంగా మేకలమ్మ గుట్టపై దిగంబర విగ్రహాలు వెలుగుచూశాయి. ఎంతో ఘన చరిత్ర గల ఈ విగ్రహాలపై పురావస్తుశాఖ సమగ్రంగా పరిశోధించాలి. ఇక్కడి విగ్రహాలను మ్యూజియానికి తరలిస్తే గ్రామ చరిత్రకున్న ప్రాధాన్యం పోతుంది. మేకలమ్మ గుట్టను పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకుని ఆలయాన్ని పునరుద్ధరించాలి. డోల్మన్ సమాధులు, శిల్పాలను రక్షించడంతోపాటు ఎకో టూరిజం కింద మేకలమ్మ గుట్టను అభివృద్ధి చేయాలి. - రత్నాకర్‌రెడ్డి,ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు -
పోరండ్లలో ఆదిమానవుల ఆనవాళ్లు
ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్లలో ఆదిమానవుల ఆనవాళ్లు బయటపడ్డాయి. వరంగల్ జిల్లా కేంద్రంగా ఔత్సాహిక పురావస్తు పరిశోధనలు చేస్తున్న మానకొండూర్ మండలం గంగిపెల్లికి చెందిన రెడ్డి రత్నాకర్‌రెడ్డి ఇటీవల పోరండ్ల గ్రామాన్ని సందర్శించారు. గ్రామం ఆదిమానవులకు చిరునామా అనే పలు ఆధారాలను ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. పోరండ్లలోని పెద్ద గుట్టను కేంద్రంగా చేసుకుని పోరండ్ల, ముంజంపల్లి మధ్య నవీన శిలాయుగం, బృహద్ శిలాయుగాలకు చెందిన ఆదిమానవులు జీవించారని తెలిపారు. నవీన శిలాయుగ ఆనవాళ్లు.. క్రీస్తు పూర్వం ఐదువేల ఏళ్ల క్రిత ంనవీన శిలాయుగపు నాటి రాతిగొడ్డళ్లు, ఎరుపు రంగుతో మెరిసే టైట మృణ్మయపాత్రలు, వృత్తాకారపు మట్టిబిళ్లలు, నలుపు, బూడిద రంగులో ఉన్న మృణ్మయపాత్రలు, రొట్టె పెంకలు, రోళ్లు, వడిసెల రాళ్లు, దంపుడు, నూరుడు రాళ్లు, పెద్దపెద్ద ఇటుకలు, సిమెంట్‌తో చేసినట్లుగా కనిపించే చిన్నచిన్న పీటలను ఇక్కడ ఉన్నట్లు రత్నాకర్‌రెడ్డి చూపిస్తున్నారు. చిన్న గుంటతో తొలచిన నల్లటిరాయి వీటిలో ప్రత్యేకమని తెలిపారు. బృహద్ శిలాయుగం సమాధులు... ఒకటిన్నర మీటర్ల పొడవు, వెడల్పు ఉండే పెద్దపెద్ద శిలలతో కూడిన బృహద్ శిలాయుగపు సమాధులు ఇక్కడ ఉన్నాయని గుర్తించారు. 14 శిలలతో 25 అడుగుల లోపలి వృత్తం కలిగిన భారీ సమాధి ఉన్నట్లు తెలిపారు. వందకుపైగా సమాధులుండగా... రైతులు వాటిని తొలగించినట్లు పేర్కొన్నారు. వాటిని స్థానికులు రాకాసి గూళ్లుగా పిలుస్తారని, ఇవి ఆవాస ప్రాంతాలను ఆనుకుని ఉన్నాయని చెప్పారు. ఐదు గుట్టలు ఆంగ్ల అక్షరం యూ ఆకారంలో ఉండగా వాటి మధ్య రాకాసి గూళ్లు, శిలలు అపారంగా ఉన్నాయన్నారు. ఇనుము, రాతి పనిముట్లు చిక్కం రాళ్లతోపాటు ముడి ఇనుముతో ఉన్న పెద్దపెద్ద రాళ్లు గుట్ట సమీపంలో కనిపించడం ఇక్కడి విశేషమని చెప్పారు. రాళ్ల పొరలు పొరలుగా ఉండి అరచేతిలో పట్టనంత పెద్దగా ఉన్నట్లు తెలిపారు. పలుగుడు రాయిని ఉపయోగించి చేసే అనేక రాతి పనిముట్లతోపాటు సేకరించి పెట్టుకున్న పెద్దపెద్ద పలుగుడు రాళ్లు ఉన్నాయి. రాతిగొడ్డలి.. గుట్టపై గుహలు ఎన్నో ఏళ్లుగా సాగులో ఉన్నప్పటికీ నవీన శిలాయుగానికి చెందిన రాతి గొడ్డలి లభించింది. పోరండ్ల గుట్టకు అడుగు భాగాన ఉన్న గుహలో నరసింహాస్వామి పూజలందుకుంటుండగా తలదాచుకునేందుకు పొడవైన పడగ రాయి ఉందన్నారు. స్థానిక నక్కలబండపై అనేక పనిముట్లు నూరుకునే గుర్తులు ఉండగా క్వారీలో పోయాయి. రెండు మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయని తెలిపారు. గుట్ట వద్ద ఆధారాలను పురావస్తు శాఖ పరిశోధిస్తే ఇక్కడ గొప్ప చరిత్ర ఉందని తెలుస్తుందని ఆయన కోరుతున్నారు. శిలలపై చిత్రాలు... పోరండ్ల నుంచి ముంజంపల్లి వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఒక శిలపై ఆదిమానవులు వేసిన మానవుని బొమ్మ స్పష్టంగా కనిపించిందని, అందు లో తల భాగమే అస్పష్టంగా ఉందని రత్నాకర్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి బొమ్మలు సామాన్యంగా బృహద్ శిలాయుగంలోనే కనిపించాయని వివరిం చారు. చాలా చోట్ల చిన్నచిన్న చిత్రాలే కనిపించగా, పోరండ్లలో పెద్దదిగా మానవ చిత్రం కనిపించడం విశేషంగా ఉందన్నారు. దీనిని చూసిన తరువాతే గుట్ట వద్దకు వెళ్లగా రాకాసి గూళ్లు కనిపించాయని ఆయన పేర్కొన్నారు. రాకాసి గూళ్లకు అనుబంధంగా సుమారు తొమ్మిది అడుగుల ఎత్తులో నిలువురాయిని పాతి ఉన్నట్లు పోరండ్ల, ముంజపల్లి శివారులో ఉన్న జిల్లేడు చెరువులో గుర్తించినట్లు ఆయన తెలిపారు.