ఆస్పత్రిలో తల్లి వదిలేసిన ఇద్దరు పిల్లలు
జనగామ : పిల్లలు మారాం చేసినా.. తండ్రి మందలించినా..అక్కున చేర్చుకునే ప్రేమ అమ్మ వద్దనే దొరుకుతుంది. తన కడుపును మాడ్చుకుని పిల్లల ఆకలి కోసం ఆరాటపడే ఓ తల్లి.. తన నాలుగు మాసాల కూతురు.. ఐదేళ్ల కొడుకును జనగామ చంపక్‌హిల్స్‌లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో వదిలి వెళ్లిపోయిన బాధాకరమైన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. రోగులు, డాక్టర్లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఊరు, పేరు తెలియని ఓ తల్లి.. తన కుమారుడు (5), కుమార్తె (4నెలలు)ను తీసుకుని సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఎంసీహెచ్‌కు వచ్చింది. రాత్రి వరకు అక్కడే ఉన్న ఆ తల్లి తన ఇద్దరు పిల్లలను పార్కులో వదిలి ఆటోలో వెళ్లి పోయింది.
రాత్రి వరకు అక్కడే ఉన్న పిల్లలను రోగి బంధువులు చూసి వైద్యులకు సమాచారం అందించారు. అరగంటపాటు ఐదేళ్ల బాబుని విచారించగా అమ్మపేరు శైలజ, తన పేరు సాయి, చెల్లి పేరు మానస, ఊరిపేరు గోంస్లా అంటూ బుడి బుడి మాటలతో చెబుతూ ఏడ్చాడు. అక్కడే ఉన్న ఓ మహిళ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి అమ్మలా ప్రేమను పంచింది. ఏరా ..ఏమైంది..అమ్మ ఎక్కడికి వెళ్లింది.. నాన్న కొట్టాడా అంటూ ఆప్యాయంగా అడిగింది. నాన్న అమ్మను కొట్టాడు.. అమ్మమ్మ ఇంటికి వెళ్లి పొమ్మన్నాడు అంటూ తడబడుతూ చెప్పాడు. వెంటనే పోలీసులు ఆస్పత్రిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.
తల్లి తన ఇద్దరు పిల్లలతో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇక్కడకు వచ్చినట్లు నిర్ధారించుకున్నారు. కుమారుడు సాయి మాట్లాడే భాషను క్షుణ్ణంగా పరిశీలించగా.. ఖమ్మంగా జిలాకు చెందిన వారా లేదా ఏపీకి చెందిన వారా అని ఆరా తీస్తున్నారు. రైలులో వచ్చి ఆస్పత్రి వరకు ఆటోలో వచ్చినట్లు చిన్నోడు సాయి చెబుతున్నాడు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులే రైలును బండి అనడంతో..అక్కడి వారుగా భావిస్తున్నారు. ఇటుక, బొగ్గు, సీసీ రింగులు, భవన నిర్మాణ కార్మికులు పొట్టకూటి కోసం చాలా మంది ఆంధ్ర ప్రాంత వాసులు జిల్లాలో బతుకుతున్నారు. పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వివరాలను రాత్రికి రాత్రే రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. ఈ విషయమై డీసీపీ మల్లారెడ్డి స్థానిక పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పిల్లలను ఐసీడీఎస్ ప్రతినిధులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment