నాన్నను మట్టిలో పెట్టి.. నాకు గుండు గీయించారు | Unknown kids In Janagam Hospital | Sakshi
Sakshi News home page

కంటి పాపలకు కష్టమొచ్చింది

Published Wed, Aug 22 2018 5:15 PM | Last Updated on Sat, Aug 25 2018 4:51 PM

Unknown kids In Janagam Hospital - Sakshi

చెల్లిని నిద్రపుచ్చుతున్న సాయి

అనంతమైన ప్రేమకు చిరునామా ‘అమ్మ ఒడి’.  ఈ ప్రపంచంలో ఎవరికైనా.. ఎంత వయసొచ్చినా అమ్మ దూరమైనప్పుడు కన్నీళ్లు ఆగవు.  మనసు లోతుల్లో అమ్మపై ఉన్న ప్రేమ, అమ్మతో గడిపిన క్షణాలు ఆమె దూరమైనప్పుడు ఒక్కసారిగా అలా ద్రవించి కళ్ల వెంట రాలుతాయి. కానీ పొత్తిళ్ల నుంచి బయటి ప్రపంచాన్ని అప్పుడప్పుడే చూస్తున్న ఓ మూడేళ్ల పసిపాప.. అమ్మ ప్రేమ తప్ప ఇంకేదీ తెలియని మూడేళ్ల చిన్నారి..  అమ్మకు దూరమైతే..!!!   ఊహించగలమా వారి పరిస్థితిని.. ? పాలకోసం ఏడ్చి ఏడ్చి గొంతు తడారిపోతున్న ఆ శిశువును ఎలా వదిలేయాలన్పించిందో.. ముక్కుపచ్చలారని మూడేళ్ల కొడుకును ఎందుకు దూరం చేసుకోవాలన్పించిందో.. ఆ మాతృమూర్తికి ఇంత కర్కశమైన ఆలోచన ఎందుకు వచ్చిందో.. ఆ దేవుడికే తెలియాలి..
 
జనగామ జిల్లా :
నవమాసాలు మోసిన తల్లి తమను కాదనుకునే సరికి ఆ పిల్లలు ఒక్కసారిగా అనాథలయ్యారు.. బువ్వపెట్టి బుజ్జగించే తల్లి లాలనకు దూరమై ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు. నాన్న తనువు చాలించినా.. అమ్మ ఒడి చేరి అనంతమైన ప్రేమను పొందాల్సిన పసి మనసులకు రాకూడని కష్టం వచ్చింది..  ఇటీవల జనగామ ఎంసీహెచ్‌ ఆస్పత్రి వద్ద ఓ తల్లి వదిలి వెళ్లిన ధీనగాథ ఇది..  అమ్మా అనే పదం వినపడగానే ముఖంపై చిరునవ్వుతో ఆ బాబు అందరినీ హుషారెత్తిస్తుంటే, అక్కడే ఉన్న చాలా మంది ఆడవాళ్లు కన్నీళ్ల పర్యంతమయ్యారు. 18 గంటల పాటు పోలీసులు, ఐసీడీఎస్‌ అధికారులు, వైద్యులు, బాలింతలు ఆ పిల్లలను కంటికి రెప్పలా చూసుకుని.. అనంతరం వరంగల్‌ శిశుగృహానికి తరలించారు. సోమవారం రాత్రి ఓ తల్లి తన పిల్లలైన మూడు నెలల పసికందు మానస, మూడేళ్ల బాలుడు సాయిని జనగామ జిల్లా చంపక్‌హిల్స్‌లోని మాతా శిశు కేంద్రం (ఎంసీహెచ్‌)లో  వదిలేసి వెళ్లిన విషయం పాఠకులకు తెలిసిందే. ఆ పిల్లలు జనగామ మండలంలోని పసరమడ్ల, ఓబుల్‌కేశ్వాపూర్‌ గ్రామాలకు చెందిన అంగన్‌వాడీ టీచర్లు ఉమారాణి, ఎల్లమ్మ సంరక్షణలో మంగళవారం వరకు ఉన్నారు.

నాన్నను మట్టిలో పెట్టి..నాకు గుండు గీయించారు.
మూడేళ్ల బాలుడు సాయిని.. అధికారులు అమ్మానాన్నల గురించి ఆరా తీయగా నాన్న పేరు ఆచార్య, అమ్మపేరు శైలజ,  నాపేరు సాయి ఆచార్య, చెల్లి పేరు మాసన అని చెప్పాడు. నాన్నను మట్టిలో పెట్టి, కట్టె వేసి.. నాకు గుండు చేయించారు. ఎంత పిలిచినా రాలేదు. అమ్మ  నన్ను, పాపను తీసుకుని రైలులో వచ్చిందంటూ సాయి ఐసీడీఎస్‌ అధికారులకు వివరించాడు. మీతో ఎవరు ఉండేవారు అంటూ అధికారులు ప్రశ్న వేయగా.. జగన్‌ అంటూ సమాధానం చెప్పాడు.  కట్టెలతో అమ్మను కొడితే.. ఇక్కడకు వచ్చామంటూ చెప్పడంతో..  కుటుంబంలో ఏ మైనా గొడవలు జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు. మీ ఊరి పేరు ఏంటమ్మా అని అడిగి తే అమ్మ చెప్పిన మాటకు బాబు జవదాటలేదు. బాబయ్‌ ఎక్కడ ఉంటాడు.. చెప్పవా అంటూ ప్రేమతో పలకరిస్తే.. గోంస్లాం, గాండ్ల అని చెబుతున్నాడు. దీంతో ఖమ్మం జిల్లా గార్ల కావచ్చని అధికారులు బావించి.. అక్కడి ఐసీడీఎస్‌ అధికారులను అలర్ట్‌ చేశారు.

చెల్లెలంటే అమితమైన ప్రేమ..
అమ్మ కనిపించడం లేదనే బెంగకంటే.. చెల్లి ఏడవగానే.. రెండు చేతులా.. పట్టుకుని.. ‘ఏందమ్మా.. ఏందమ్మా’ అంటూ సాయి పలకరిస్తుంటే అక్కడున్న వాళ్ల హృదయాలు ద్రవించాయి. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఎంసీహెచ్‌లో అందరూ గాఢ నిద్రలో కి జారుకోగా... మూడు నెలల పసికందు మానస ఏడవడంతో.. నిద్రలోంచి మేలు కున్న సాయి.. తన చెల్లి వద్దకు వచ్చి తెల్లవారేదాకా కూర్చున్నాడు. ఏరా మీ చెల్లిని మాకిచ్చేస్తావా అంటూ అడిగితే.. గుండెలకు హత్తుకుని ఎత్తుకునే ప్రయత్నం చేశాడు.

కంటికి రెప్పలా చూసుకున్నారు.
అంగన్‌వాడీ టీచర్ల సంరక్షణలో ఉన్న సాయి, మానసలను ఎంసీహెచ్‌లో అక్కడున్న బాలింతలు కంటికి రెప్పలా చూసుకున్నారు. మూడు నెలల పసికందు పాల కోసం ఏడుస్తుంటే.. డబ్బా ద్వా రా పాలు పట్టారు. వాంతులు చేసుకోవడంతో.. ఓ తల్లి తన పాలను పట్టించి మాతృత్వాన్ని చాటింది.

కన్నీళ్లు పెట్టుకున్న మహిళలు
పిల్లలను వరంగల్‌కు తరలించే క్రమంలో అంగన్‌వాడీ మహిళలు, ఐసీడీఎస్‌ అధికారులు కంటనీరు పెట్టుకున్నారు.  చెమర్చిన కళ్లతో వారిని సాగనంపారు. రెండు నెలల పాటు ఇద్దరి సంరక్షణ బాధ్యతలతో పాటు.. వారి తల్లిదండ్రుల ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తామని ప్రేమలత విలేకరులకు వివరించారు. 2 నెలల తర్వాత.. దత్తత విషయమై శిశుగృహ అధికారులు చర్చిస్తారన్నారు.

శిశుగృహకు చిన్నారుల అప్పగింత
కాజీపేట అర్బన్‌: జనగామలోని ఎంసీహెచ్‌ ఆవరణలో  ఓ తల్లి వదిలి వెళ్లిన ఇద్దరు చిన్నారులను మంగళవారం వరంగల్‌ సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపరచి శిశు గృహకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో  సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ పరశురాములు, కౌన్సిలర్‌ నర్సింహస్వామి, సూపర్‌వైజర్‌ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

అసలేం జరిగింది..
మూడేళ్ల బాబు సాయి చెబుతున్నట్లుగా తండ్రి ఆచార్య అటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆచార్య మృతిచెందిన కొన్ని రోజులకే.. ఆ తల్లి ఇద్దరు పిల్లలను వదిలి పెట్టడం అనేక అనుమానాలను కలిగిస్తోంది. ఎందుకంటే.. బాబుకు గుండు చేయించగా.. తలపై వెంట్రుకలు రాకపోవడంతో.. ఈ సంఘటన జరిగి నెలరోజులు కూడా గడవలేదని అధికారులు బావిస్తున్నారు. భర్తను కోల్పోయిన సమయంలో ఇంట్లో పోరు పడలేక పిల్లలను వదిలేసి వెళ్లిందా..? లేక ఏదైనా అఘాయిత్యానికి పాల్పడిందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎంసీహెచ్‌కు నేరుగా రావడం కూడా చర్చనీయాంశమైంది. ఈ ప్రాంతంలోనే గత కొన్నేళ్లుగా జీవిస్తున్నారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  

మూడు నెలల క్రితం జన్మించిన పాపకు.. ప్రభుత్వం అందించిన ‘కేసీఆర్‌ కిట్‌ ’బ్యాగు పిల్లల వద్దనే ఉంది. దీంతో ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఒక చోట తల్లి ఉండవచ్చనే పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు మగవారితో సోమవారం రాత్రి ఎంసీహెచ్‌కు వచ్చిన మహిళ పార్కులో ఇద్దరు పిల్లలను వదిలి వెళ్లినట్టుగా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. సీసీ పుటేజీల్లో కూడా ఆ మహిళ ఆటోలో వచ్చినట్లుగా పోలీసులు నిర్ధారించారు. దీనిపై రాష్ట్రంలోని 31 జిల్లాల అంగన్‌వాడీ కేంద్రాలు, పోలీస్‌స్టేషన్‌లకు బాబు, పాప వివరాలను పంపించారు. ఎంసీహెచ్‌ ఆస్పత్రిలో పర్యవేక్షకులు డాక్టర్‌ శ్రీనివాస్, చిన్న పిల్లల వైద్యులు శంకర్‌ డిశ్చార్జి ఫాం పూర్తి చేసి.. ఐసీడీఎస్, ఐసీపీఎస్, సీడబ్ల్యూసీ(చైల్డ్‌ వెల్ఫేర్‌) ప్రతినిధులు, ఇన్‌చార్జి డీడబ్ల్యూఓ ప్రేమలత, డీసీపీఓ రవికాంత్, సూపర్‌ వైజర్‌ రమ, స్వరూపారాణి, జ్యోతిలకు అప్పగించగా.. వరంగల్‌లోని శిశుగృహానికి పిల్లలను తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement