నిరసన తెలుపుతున్న బాధిత రైతు
జనగామ: ఫసల్ బీమా ద్వారా రైతులు పత్తి, వరి తదితర పంటలకు బీమా చేసుకుంటున్నారు. గత ఏడాది ఓ రైతు పత్తిపంటకు చేసుకున్న డీడీని ఆరు నెలల తర్వాత కంపెనీ వెనక్కి పంపించింది. దీంతో రైతు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు ముగ్గురు కలెక్టర్లను కలిసి మొరపెట్టుకున్నా స్పదించకపోవడంతో కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగిన సంఘటన గురువారం జరిగింది. జనగామ మండలం చీటకోడూరుకు చెందిన బాధిత రైతు ఓరుగంటి నర్సయ్య విలేకరులతో మాట్లాడారు.
2017 జూలైలో ఎకరం పత్తి పంట కోసం చోలా మండలం కంపెనీ పేరుతో రూ.1650 డీడీ తీసి, వ్యవసాయ శాఖకు అప్పగించానని తెలిపారు. పత్తి సాగు సమయంలో వర్షాభావ పరిస్థితుల్లో కొంత మేర నష్టం వచ్చిందని, బీమా ద్వారా ఆదుకుంటారని ఆశపడ్డామన్నారు. పత్తిని సేకరించి, తిరిగి సాగు చేçసుకునేందుకు దుక్కులు దున్నిన తర్వాత 2017 డిసెంబర్ మాసంలో డీడీని తిరిగి పంపించారని పేర్కొన్నారు. ఇదేంటని వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నిస్తే..కలెక్టర్ వద్దకు వెళ్లాలని సూచించారన్నారు.
గతంలో పని చేసిన కలెక్టర్ శ్రీదేవసేన, ఇన్‌చార్జి కలెక్టర్, ప్రస్తుతం పనిచేస్తున్న వినయ్ కృష్ణారెడ్డిని ఎన్నోసార్లు కలిసి విజ్ఞప్తి చేశానని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినప్పుడల్లా నీ పని ఇంకా కాలేదా అనడం తప్ప.. వారు చేసిందేమీ లేదన్నారు. తనతో పాటు మరో 50 మంది రైతుల డీడీలు వాపస్ వచ్చాయని వెల్లడించారు.
డీడీ విషయంలో కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేశారని, ఏమీ చేయలేని పరిస్థితుల్లో డీడీని విడిపించుకుంటున్నానన్నారు. నకిలీ విత్తనాలుపై దృష్టి సారించే ఉన్నతాధికారులు.. బీమా కంపెనీలు సాగిస్తున్న మోసాలపై ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment