Fasal Bima Yojana
-
Fasal Bima Yojana: బండిసంజయ్ వ్యాఖ్యలకు హరీశ్‌రావు గట్టి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫసల్ బీమా యోజన అమలు చేయాలంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి హారీశ్ రావు.. అసలు ముందు ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పగలవా? అంటూ ట్విట్టర్ వేదికగా గట్టి కౌంటరిచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..వాస్తవానికి దేశంలోని 10 రాష్ట్రాలు 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ ఫసల్ బీమాను వ్యతిరేకిస్తున్నాయని, పార్లమెంట్ సాక్షిగా స్వయంగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమరే చెప్పారు. దీనిని బట్టే అర్థం కావాలి అసలు ఆ పథకంతో రైతులకు పెద్దగా ఉపయోగం లేదని.అయినా పంట నష్టపోయిన రైతులకు అండగా ఉండేందుకు సుమారు రూ. 10 వేలు చొప్పున నష్టపరిహారం ప్రకటించి సీఎం కేసీఆర్ మరోసారి రైతు బిడ్డనని నిరూపించుకున్నారు. కానీ బీజేపీ నేతలకు ఇది చాలా చిన్న సాయంగా కనిపించడం దురదృష్టకరం. అయినా దేశంలో ఇంకెక్కడైనా ఇంతకన్న ఎక్కువ సాయం చేసినట్లు నిరూపించగలరా అని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని పండుగలా చేసి, రైతును రాజుగా చేసిన ఘనత మాది. సాగు రైతు సంక్షేమం గురించి బీజేపీ నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందంటూ మండిపడ్డారు. అయినా బీజేపీ నాడు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి, అదాని ఆదాయాన్ని డబుల్ చేశారంటూ విరుచుకుపడ్డారు. అనునిత్యం రైతులను క్షోభకు గురి చేస్తూ..నల్ల చట్టాలను తెచ్చి రైతులను బలి చేసిన చరిత్రే మీది అని విమర్శల గుప్పించారు. (చదవండి: రాహుల్‌పై అనర్హత వేటు: కాంగ్రెస్ శ్రేణుల స్పందన.. నియంతృత్వ చర్యన్న ఖర్గే) -
బరువైందా... అంటూ బాబుకు బాజా! ఏది నిజం?
‘‘రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఫసల్ బీమా యోజనలో భాగస్వామి కావాల్సిందిగా నేనే స్వయంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఫోన్ చేసి అడిగాను. కేంద్ర బృందాన్ని కూడా ఏపీకి పంపించి అక్కడ అమలవుతున్న ఉచిత పంటల బీమా పథకాన్ని అధ్యయనం చేయించాం. నోటిఫైడ్ పంటలు సాగు చేస్తున్న రైతులందరికి బీమా వర్తింప చేసేలా ఫసల్ బీమా యోజనలో కొన్ని మార్పులను సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఆయన సూచనల మేరకు రైతులందరినీ బీమా పరిధిలోకి తీసుకొస్తున్నాం. అందుకు ఉన్న అడ్డంకులను తొలగించాం. ఈ–క్రాప్ డేటా ఆధారంగా ఏపీలో ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇదే డేటాను మేం కూడా ప్రామాణికంగా తీసుకుని, నోటిఫైడ్ పంటలు సాగు చేసే రైతులందరికీ వర్తింప చేసేలా ఫసల్ బీమా యోజనలో మార్పులు చేస్తున్నాం.’’ – ఫసల్ బీమాపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ‘ఈనాడు’ ఇప్పుడు ఏ స్థితిలో ఉంది? చెప్పటం కష్టం. ఎందుకంటే చంద్రబాబుకు మేలు చేయాలనే ఏకసూత్ర అజెండా అమలు చేయటంలో అడ్డూఅదుపూ కోల్పోయింది. నిజాలు నిస్సిగ్గుగా గాలికొదిలేసింది. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ప్రతి అంశాన్నీ తాము సృష్టించిన ఎల్లో అద్దంలో చూపిస్తోంది. జనంలో అపోహలు సృష్టించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. వరద బాధితులకు సాయం విషయంలోనైనా... రైతులకు ముందెన్నడూ లేని తీరులో అందుతున్న పంటల బీమా విషయంలోనైనా... దేన్లోనైనా ఇదే తీరు. ఇదంతా చూశాక ఇప్పుడో కొత్త సామెత చెప్పుకోవాల్సి వస్తోంది. రాసేవాడు రామోజీరావు అయితే... చదివే వాడు చంద్రబాబే అని!!. కాకపోతే ‘ఈనాడు’ పత్రిక చదివే వాళ్లంతా చంద్రబాబులు కారుగా? తమ సంతోషం కోసం రాశారని చూసి మురిసిపోవటానికి!!. పాఠకులకు నిజాలు కావాలి కదా? ఇంకెప్పుడు చెబుతారు రామోజీరావుగారూ వాస్తవాలు? వృద్ధాప్యంలోనైనా మారరా? ‘బీమా బరువైందా?’ అని ప్రశ్నిస్తూ మంగళవారం ఉదయం ఓ పేద్ద కథనాన్ని వండేసింది ‘ఈనాడు’. రెండేళ్లకే సర్కారు మడమ తిప్పేస్తోందని, మళ్లీ కేంద్ర పథకాల్లో చేరుతోందని... ఇదంతా కేంద్ర నిధుల కోసమేనని పాపం తెగ ఆందోళనకు గురైంది. దాంతోపాటు... ఇలా కేంద్ర పథకాల్లో చేరితే అప్పట్లో ఉన్న లోపాలను అధిగమించేదెలా? అంటూ మథనపడిపోయింది కూడా!!. ఇక్కడ రామోజీ తెలిసో తెలియకో ఒప్పుకున్న నిజం ఒకటుంది. అది.. అప్పట్లో లోపాలున్నాయని!! కాబట్టే రెండేళ్ల కిందట వైఎస్ జగన్ ప్రభుత్వం కేంద్ర బీమా పథకం నుంచి బయటకు వచ్చి కొత్త బీమా పథకాన్ని తీసుకువచ్చిందని. దీంతోపాటు.. వైఎస్ జగన్ ప్రభుత్వం రైతుల కోసం చాలా బరువును మోస్తోందన్న విషయాన్ని కూడా రామోజీరావు చెప్పకనే చెప్పారు. ఇక్కడ రామోజీ సమాధానమివ్వాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఏం! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఈ కేంద్ర పథకం బాగులేదని, రాష్ట్ర రైతులకు మేలు చేయాలంటే దీంతో సాధ్యం కాదని రామోజీ ఎందుకు సలహా ఇవ్వలేదు? పోనీ తన పత్రికలో కథనాలెందుకు రాయలేదు? ఈ రెండేళ్లుగా జగన్ ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులతో పంటల బీమా అమలు చేస్తోందని ఏ ఒక్కరోజూ ఎందుకు రాయలేదు? ఇపుడు వాస్తవమేంటన్నది చెప్పకుండా ఈ నిందలెందుకు? అసలు మీ పాత్ర ఏంటి రామోజీ? ప్రతిపక్ష పాత్రా..? లేక ప్రతినాయకుడి పక్ష పాత్రా? మీదిప్పుడు రాసే పాత్ర కాబట్టి పాఠకులతో సహా ఎవ్వరికీ సమాధానం ఇవ్వక్కర్లేదనుకోవచ్చు. కానీ మీకు మీరైనా జవాబు చెప్పుకోవాలి కదా ఈ రోత రాతలకు!!. చంద్రబాబు చేయలేదెందుకు? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై)తో బీమా సంస్థలకే లబ్ధి చేకూరుతోందని, ఒక సీజన్లో పంట నష్టం జరిగితే రెండు సీజన్లు ముగిసినా పరిహారం అందటం లేదని అందుకే బీహార్, గుజరాత్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సొంత పథకాలు అమలు చేస్తున్నారని ‘ఈనాడు’ వాకృచ్చింది. రెండేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ కూడా వైఎస్సార్ పంటల బీమా తీసుకొచ్చిందని రాసుకొచ్చింది. కాకపోతే ఘనత వహించిన ఇంటిమనిషి చంద్రబాబు నాయుడుకి ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదో ఎప్పుడూ రాయదు. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకాన్ని పూర్తి ఉచితంగా అమలు చేస్తున్నట్లు కూడా ఎక్కడా ఒక్క అక్షరం ముక్క కూడా రాయదు ‘ఈనాడు’. నిజానికి గతంలో ఇది కేంద్ర పథకంగా ఉండేటపుడు పంటను బట్టి ప్రీమియాన్ని నిర్ణయించాక ప్రీమియంలో 2 శాతాన్ని రైతులే చెల్లించేవారు. బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకులే ఈ మొత్తాన్ని మినహాయించేసి బీమా చేయించేవి. మిగిలిన రైతులకు బీమా గురించి తెలిసేదే కాదు. ప్రకృతి వైపరీత్యాలతో వారు నష్టపోతే.. వారికి బీమాయే లేదు కాబట్టి ప్రభుత్వం చేతులెత్తేసేది. బీమా ఉన్నవారికి కూడా ఒక సీజన్లో నష్టం జరిగితే రెండు మూడు సీజన్లు గడిచాక పరిహారం వచ్చేది. ఇదిగో... ఇలాంటి పరిస్థితులకు తావివ్వకూడదన్న ఉద్దేశంతోనే... రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేరుగా పంటల బీమా అమలు చేయాలని సంకల్పించారు వైఎస్ జగన్. అందుకే కేంద్ర పథకం నుంచి బయటకు వచ్చేసి... ఈ–క్రాప్‌ను సమర్థంగా అమలు చేస్తూ... పంట నమోదు చేయించుకున్న ప్రతి రైతుకూ పరిహారం అందేలా చూస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యం... ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్ ముగియక ముందే పరిహారం ఇవ్వటం. తద్వారా తదుపరి సీజన్‌కు ఆ రైతుకు ఇబ్బంది లేకుండా చేయటం. అదీ ఉద్దేశం. అందుకే ఇది రైతు ప్రభుత్వమయ్యింది. అలాంటి ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు వదిలేస్తుందా? బీమా పథకం బరువైపోయింది కాబట్టి కేంద్రానికి అప్పగించేస్తుందా? ఆ మాత్రం ఆలోచించాలి కదా రామోజీరావు గారూ? అసలు ఖరీఫ్ సీజన్లో జరిగిన నష్టాన్ని మళ్లీ ఖరీఫ్ మొదలు కాకముందే ఇవ్వటమనేది మీ జన్మలో చూశారా? చంద్రబాబు ఈ దిశగా ఆలోచనైనా చేశారా? టీడీపీ హయాంలో జరిగింది ఇదీ... చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో సగటున ఏడాదికి 20.28 లక్షల మంది రైతులు, 23.57 లక్షల హెక్టార్లకు మాత్రమే బీమా చేయించుకోగలిగారు. 2014–16 మధ్య వ్యవసాయ బీమా పథకం కింద 5.38 లక్షల మందికి రూ.471.94 కోట్లు, 2016–19 మధ్య పీఎంఎఫ్‌బీవై కింద 25.47 లక్షల మందికి రూ.2939.26 కోట్ల బీమా మొత్తాన్ని అందించారు. మొత్తంగా ఐదేళ్లలో కేంద్ర బీమా పథకాల ద్వారా రూ.341 కోట్ల పరిహారాన్ని అందించారు. కానీ కేంద్ర పథకంలో ఉన్న పరిమితులతో రైతులు నష్టపోతున్నారని భావించిన వై.ఎస్.జగన్ సర్కారు.. నోటిఫైడ్ పంటలు సాగు చేసే రైతులందరికీ బీమా వర్తింప చేయాలని డిమాండ్ చేసింది. ప్రీమియం చెల్లించిన వారికే ఇస్తామని కేంద్రం చెప్పడంతో ఆ పథకం నుంచి బయటకొచ్చేసింది. 2019 జూలై 8న డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చారు జగన్. ఈ–క్రాప్‌లో పంట నమోదు చేసుకున్న ప్రతి రైతుకూ బీమా వర్తించేలా... ఆర్బీకేల్లోనే నామమాత్రంగా రూ.10 తీసుకుని రసీదు కూడా ఇస్తున్నారు. ఆ రసీదు.. ఈ–క్రాప్‌లో నమోదు చేసినట్లు రైతుకు ఇచ్చే అధికారిక గుర్తింపు. దాని ఆధారంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకూ నేరుగా సీజన్ మారకముందే పరిహారం అందుతోంది. ఇందులో రైతు వాటాతో పాటు కేంద్రం వాటానూ రాష్ట్రమే భరిస్తుండగా... గతంతో పోలిస్తే బీమా పరిధిలోకి వచ్చిన రైతుల సంఖ్య కూడా ఏకంగా 167.04 శాతం పెరిగింది. 2018–19లో 6.19 లక్షల మందికి చెల్లించాల్సిన రూ.715.84 కోట్ల మొత్తాన్ని 2019లో వై.ఎస్.జగన్ ప్రభుత్వమే చెల్లించింది. టీడీపీ ఐదేళ్లలో రూ.30.85 లక్షల మందికి రూ.3411.20 కోట్లు బీమా దక్కితే గడిచిన మూడేళ్లలో 44.28 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.6684.84 కోట్ల బీమా సొమ్ములు అందాయి. చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఖరీఫ్– 2021–22 సీజన్‌కు సంబంధించి 15.61 లక్షల మందికి రూ.2977.82 కోట్లు బీమాగా అందజేసింది. ఇవీ రాయని, రాయాలనుకోని వాస్తవాలు!!. బీమా లైసెన్స్ కోసం ప్రయత్నాలు... బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని భావించటంతో పాటు... దీనికోసం శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావించారు ముఖ్యమంత్రి జగన్. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓ బీమా కంపెనీ ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. దీనికి బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏ) లైసెన్సు ఇవ్వాల్సి ఉంటుంది. పదేపదే దీనికోసం అభ్యర్థనలు చేయటంతో పాటు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో పెండింగ్ అంశాలు మాట్లాడిన ప్రతిసారీ దీన్ని ప్రస్తావించారు. త్వరలో లైసెన్స్ వచ్చే అవకాశాలూ లేకపోలేదు. అయితే ఈ మధ్యలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నేరుగా సీఎం జగన్‌కు ఫోన్ చేసి... కేంద్ర పథకంలో భాగస్వామిగా ఉండాలని కోరారు. ఈ పథకం నుంచి ఎందుకు బయటకు వచ్చేశారో అడగటంతో పాటు... లోటుపాట్లు ఉంటే చెప్పాలని, సవరించుకుంటామని కూడా అడిగారాయన. అనంతరం కేంద్ర బృందాన్ని కూడా పంపించారు. ఇక్కడి అధికారులతో సమావేశమైన ఆ బృందం... ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలేమిటనేది అడిగి తెలుసుకుంది. ఈ–క్రాప్‌లో నమోదైన ప్రతి రైతుకూ పంట దెబ్బతిన్న పక్షంలో బీమా పరిహారం అందటం... ఏ సీజన్లో జరిగిన నష్టానికి పరిహారాన్ని అదే సీజన్లో అందించటమనేవి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన డిమాండ్లు కాగా... ఆ రెండింటికీ కేంద్రం అంగీకరిస్తోంది. ఆ మేరకు చట్టానికి సవరణలు చేసే పనిలోనూ పడింది. అవన్నీ పూర్తయితే రైతుకు ఇప్పటి మాదిరే పరిహారానికి ఎలాంటి ఢోకా ఉండదు. మరప్పుడు ఇబ్బంది ఏముంటుంది? అయినా రైతు డబ్బులే చెల్లించాల్సిన అవసరం లేనప్పుడు కేంద్ర పథకానికి దరఖాస్తు చేసుకునే గడువు ముగిసిపోతోందని రామోజీ ఎందుకంత బాధపడిపోతున్నారో అర్థం కాదు. పైపెచ్చు కేంద్ర పథకంలో చేరినా కూడా ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న డేటా ప్రకారమే... అంటే ఇప్పటి మాదిరిగానే రైతులకు పరిహారం అందుతుంది. మరప్పుడు ‘ఈనాడు’కొచ్చిన కష్టమేంటి? రైతుకు బీమా సొమ్ము ముఖ్యం తప్ప... ఆ డబ్బులు బీమా సంస్థ నుంచి వస్తున్నాయా? కేంద్రం నుంచి వస్తున్నాయా? రాష్ట్రం నుంచి వస్తున్నాయా? అనేది కాదుకదా!!. మూడేళ్లుగా రైతుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న ప్రభుత్వానికి ఆ మాత్రం తెలియదనుకోవాలా? ఇకనైనా ఇలాంటి అర్థంపర్థం లేని వార్తలు అచ్చేయటం ఆపండి రామోజీరావుగారూ!! బీమా బరువేమీ కాదు... పైసా భారం లేకుండా, ఈ–పంట నమోదు ప్రామాణికంగా మూడేళ్లుగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం. మనం అమలు చేస్తోన్న ఈ–పంట నమోదు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం, ఈ డేటా ఆధారంగా పీఎంఎఫ్‌బీవై పథకాన్ని అమలు చేయడానికి ముందుకొచ్చింది. కేంద్రం అభ్యర్థన మేరకు సాధ్యా, సాధ్యాలను బేరీజు వేసుకొని మన బీమా పథకాన్ని పీఎంఎఫ్‌బీవైతో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2022–23 సీజన్ కోసం బీమా కంపెనీల ఎంపికకు టెండర్ ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తాం. ఈ పంటలో నమోదు, ఈ కేవైసీ పూర్తయిన తర్వాత రైతులకు ఇచ్చే రసీదులో బీమా చేసిన పంట పేరు, విస్తీర్ణం వివరాలు పొందుపరుస్తాం. వారి వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. 2023 జూన్‌లోగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ బీమా పరిహారం, 2023 అక్టోబర్ 15లోగా రబీ–2022–23 సీజన్ బీమా పరిహారం చెల్లించేలా విధి విధానాలు రూపొందిస్తున్నాం. పంటల బీమా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – చేవూరి హరికిరణ్,స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
బీమా.. ధీమా
సాక్షి, సంగారెడ్డి: ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ ప్రతికూల పరిస్థితులు, అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పంటల బీమాకు రైతుల నుంచి స్పందన కరువైంది. కొన్ని సంవత్సరాలుగా బీమా సదుపాయం కల్పిస్తున్నా రైతులు మాత్రం అతి తక్కువ ప్రీమియం చెల్లించడానికి సైతం ముందుకు రావడం లేదు. ఫసల్ బీమాపై ప్రచారం కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పథకంపై రైతులకు అవగాహన లేకపోవడంతో ఏటా పంటలను నష్టపోతున్నా పరిహారం అందని దయనీయ పరిస్థితి నెలకొంది. వాతావరణం అనుకూలించక పంటలు నష్టపోయే రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకం ప్రవేశపెట్టింది. ఖరీఫ్‌లో రైతులు సాగు చేస్తున్న పంటలకు బీమా చేసుకునేందుకు ఈ నెల 15 నుంచి 31 వరకు గడువు ఇచ్చింది. క్షేత్ర స్థాయిలో అధికారులు రైతులకు సరైన సమాచారం చేరవేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ శాఖలో క్షేత్ర స్థాయిలో సిబ్బంది సరిపడా లేకపోవడంతో రైతులకు సమాచారం అందడం లేదు. పంటలకు బీమా చేసుకుంటే రైతులకు మేలు చేకూరుతుందనే వాస్తవాన్ని వారు విస్మరిస్తున్నారు. పంటలు నష్టపోయినప్పుడు చూద్దాంలే అనుకుంటున్న రైతులు..నష్టపోయినప్పుడు మాత్రం గగ్గోలు పెడుతున్నారు. గ్రామ, మండల యూనిట్ల వారీగా బీమా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు నిబంధనలతో బీమా అవకాశాన్ని రైతులకు కల్పించింది. గతంలో పంటలు నష్టపోయినప్పుడు బీమా సొమ్మును అందించేందుకు బీమా సంస్థలు సవాలక్ష కొర్రీలు పెట్టడంతో బీమా చేయించడానికి రైతులు అనాసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. బీమా చెల్లించడమే కానీ నష్టపోయినప్పుడు డబ్బులు వచ్చిన దాఖలాలు తక్కువేనని రైతులు నిట్టూరుస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో వర్షాలు ఆలస్యమైనా ఇటీవలే అడపాదడపా కురుస్తున్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లాలో ఖరీఫ్ పంటలు సాగు చేయడం ఆరంభించారు. విత్తనాలు విత్తుకుంటున్నారు. జిల్లాలో మొత్తం సాధారణ సాగు విస్తీర్ణం 2,21,614 హెక్టార్లు ఉంది. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 39,807 హెక్టార్లుగా ఉంది. జిల్లాలో ప్రధానంగా కంది పత్తి, వరి, మినుము, పనుపు, పెసర, మొక్కజొన్న సాగు చేస్తారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌లో వర్షాలు ఆలస్యం కావడంతో ఇప్పటివరకు సుమారుగా 50 నుంచి 60 శాతం మాత్రమే సాగు విస్తీర్ణం నమోదైందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఖరీఫ్ సీజన్లో మరో 10 రోజులవరకు విత్తనాలు వేసుకునే అవకాశం ఉండడంతో సాగు విస్తీర్ణం మరింతగా పెరిగే అవకాశం ఉందని వారు తెలియజేస్తున్నారు. రైతులకు భరోసాగా.. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన కింద రైతులు సాగు చేస్తున్న ఖరీఫ్ పంటలకు బీమా ప్రకటించింది. పలు పంటలను గ్రామ యూనిట్‌గా, మరికొన్నింటిని మండల యూనిట్‌గా లెక్కించనున్నారు. మొక్కజొన్న పంటను గ్రామ యూనిట్ పరిధిలో చేర్చారు. ఈ నెల 31 తేదీ వరకు ప్రీమియం డబ్బులు చెల్లించి బీమా పొందేలా అవకాశం కల్పించారు. అంతే కాకుండా పత్తి పంటకు ఈ నెల 15వ తేదీ గడువు విధించింది. వరి, పసుపు, కంది, సోయా, మినుము, పెసర, జొన్న పంటలకు మండల యూనిట్ జాబితాలో బీమా సౌకర్యం ప్రకటించారు. ఖరీఫ్‌లో రైతులకు తక్కువ వర్షపాతం, ప్రతికూల పరిస్థితులతో పంటలు నష్టపోతే బీమా పథకం వర్తిస్తుంది. మీ సేవా కేంద్రాల్లో ఫసల్ బీమా పథకానికి సంబంధించి రైతులు మీ సేవ కేంద్రాల్లో బీమా ప్రీమియం డబ్బులను చెల్లించాలి. సహకార, గ్రామీణ, ఇతర జాతీయ బ్యాంకుల్లో పంట రుణాలను పొందిన రైతులకు బ్యాంక్ అధికారులే బీమా సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటారు. రుణం పొందని రైతులు వ్యవసాయాధికారులను సంప్రదిస్తే బీమా సౌకర్యం వివరాలను తెలియజేస్తారు. యూనిట్ వారీగా బీమా.. రైతులు పండిస్తున్న పంటలకు మూడు రకాల బీమా చేయనున్నారు. అందులో మొక్కజొన్న పంటలను గ్రామ యూనిట్ పరిధిలో చేర్చారు. గ్రామంలో మొక్కజొన్న పంట నష్టం వాటిల్లితే అదే గ్రామ పరిధిలోని విస్తీర్ణంలో దిగుబడిని బట్టి బీమా సొమ్మును చెల్లిస్తారు. అయితే కంది, జొన్న, వరి, సోయా, పెసర, మినుములాంటి పంటలను మండల యూనిట్ జాబితాలో చేర్చారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే మండలాన్ని పరిగణలోకి తీసుకొని బీమా వర్తించే విధంగా నిబంధనలు రూపొందించారు. పత్తి పంటకు మాత్రం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బీమా వర్తించేలా ప్రభుత్వం ఫసల్ బీమాను అమలు చేస్తోంది. పంటలను బట్టి వాణిజ్య, సాధారణ పంటలుగా గుర్తించారు. వాణిజ్య పంటలకు బీమా పరిహారం అధికంగా ఉంటుంది. పత్తి, పసుపు పంటలు నష్టపోతే బీమాను అధికంగా చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీమా చేయించండి వాతావరణ విపత్కర పరిస్థితుల్లో పంటలు నష్టపోతే బీమా ఎంతగానో ఉపయోగపడుతుంది. అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం పొందవచ్చు. ప్రభుత్వం బీమా చేయించేందుకు ఈ నెలాఖరు వరకు పంటల వారీగా గడువు ఇచ్చింది. పంటలు సాగుచేస్తున్న రైతులు బీమా ప్రీమియం చెల్లించండి. పంటలు నష్టపోతే లాభదాయకంగా ఉంటుంది. – బి.నర్సింహారావు, జిల్లా వ్యవసాయాధికారి -
రెండు సీజన్లకు కలిపి పంటల బీమా
సాక్షి, హైదరాబాద్: రానున్న ఖరీఫ్, రబీ సీజన్(2019–20)కు కలిపి రాష్ట్ర వ్యవసాయ శాఖ పంటల బీమా నోటిఫికేషన్‌ను ఇటీవల జారీ చేసింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం(పీఎంఎఫ్‌బీవై), పునరుద్ధరించిన వాతావరణ పంటల బీమా పథకం(ఆర్‌డబ్ల్యూసీఐఎస్) అమలుకు క్లస్టర్లవారీగా 2 బీమా ఏజెన్సీలను ఖరారు చేసింది. ఇందులో ఇఫ్కో టోక్యో జీఐసీ, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఏఐసీ) కంపెనీలున్నాయి. 11 జిల్లాల్లో ఇఫ్కో టోక్యో జీఐసీ బీమా(రెండు క్లస్టర్లు) కంపెనీ, 21 జిల్లాల్లో ఏఐసీ(ఆరు క్లస్టర్లలో) పంటల బీమాను అమలు చేయనున్నాయి. సమగ్ర బీమా పథకం(యూపీఐఎస్)ను ప్రయోగాత్మకంగా నిజామాబాద్‌లో అమలు చేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ప్రధానంగా వాతావరణ ఆధారిత బీమా కింద పైల ట్ ప్రాజెక్టులో భాగంగా టమాటా పంటకు బీ మా సౌకర్యం కల్పించారు. రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో దీనిని అమలు చేస్తున్నారు. మామిడి పంటకు కూడా ఆర్‌డబ్ల్యూసీఐఎస్ కింద బీమా ఇవ్వనున్నారు. పంటకోతలో భాగంగా వర్షాలు, వడగండ్లతో నష్టం వస్తే కూడా బీమా వర్తిస్తుందని స్పష్టం చేశారు. పంటల బీమా అమలు చేసే కంపెనీలు కచ్చితంగా ప్రతి సీజన్లో 10% నాన్ లోన్ రైతులను బీమా కవరేజీలోకి తీసుకురావాలన్నారు. కామన్ సర్వీస్ సెంటర్, మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పంట పేరు మార్చుకునేందుకు గడువు తేదీ కంటే 2 రోజుల ముందు వరకు రైతులకు అవకాశం కల్పించారు. హఠాత్తు వర్షాలకు, మెరుపుతో వచ్చే పిడుగుల కారణంగా నష్టం వాటిల్లినా బీమా పరిహారం ఇవ్వనున్నారు. ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ కింద వానాకాలంలో మిర్చి, పత్తి, పామాయిల్, బత్తాయి, టమాటా పంటలను గుర్తించగా, యాసంగిలో మామిడి పంటలను గుర్తించింది. వానాకాలం ఆర్‌డబ్ల్యూసీఐఎస్‌ను ఖమ్మం, భద్రాద్రి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, జోగుళాంబ, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో, పత్తి 32 జిల్లాల్లో, పామాయిల్ పంటకు ఖమ్మం, భద్రాద్రి, బత్తాయి పంటకు నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల, యాదాద్రి, టమాటా పంటకు రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో అమలు చేయనున్నారు. యాసంగిలో ఆర్‌డబ్ల్యూసీఐఎస్ కింద మామిడి పంటకు 32 జిల్లాలు, టమాటా కింద ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలను వ్యవసాయ శాఖ గుర్తించింది. ఖరీఫ్ వరి ఆగస్టు 31, పత్తికి జూలై 15 ఖరీఫ్, రబీ సీజన్లో పీఎంఎఫ్‌బీవై, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ వివిధ పంటలకు బీమా ప్రీమియం చెల్లించే గడువు తేదీలను నిర్ణయించారు. త్వర లో ప్రారంభం కానున్న ఖరీఫ్‌లో వరి పంటకు ఆగస్టు 31లోగా బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. జొన్న, మొక్కజొన్న, కందులు, పెసర్లు, మినుములు, వేరుశనగ, సోయాబీన్, పసుపు పంటలకు జూలై 31లోగా ప్రీమియం చెల్లించాలి. ఆర్‌డబ్ల్యూబీసీ ఐఎస్ పథకం కింద మిర్చి పంటకు ఆగస్టు 31లోగా, పత్తి పంటకు జూలై 15లోగా, పామాయిల్ పంటకు జూలై 14లోగా, బత్తాయి పంటకు ఆగస్ట్ 9, టమాటా పంటకు ఆగస్టు 31వ తేదీలోగా పంటల బీమా ప్రీమియం చెల్లించాలి. యాసంగిలో ఇలా.. 2019 యాసంగికి పీఎంఎఫ్‌బీవై కింద శనగ పంటకు నవంబర్ 30లోగా, మొక్కజొన్న పంటకు డిసెంబర్ 15లోగా, వరి, జొన్న, పెసర, మినుములు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఉల్లి, మిర్చి, నువ్వుల పంటలకు డిసెంబర్ 31లోగా రైతులు నమోదు చేయించుకోవాలి. ఆర్‌డబ్ల్యూసీఐఎస్ పథకం కింద టమాటా పంటకు నవంబర్ 30లోగా, మామిడి పంటకు డిసెంబర్ 31లోగా రైతులు ప్రీమియం చెల్లించాలని వ్యవసాయశాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
కేంద్ర రైతు పథకాలపై బీజేపీ వాల్‌పోస్టర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ఈ నాలుగేళ్లలో రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ వాల్ పోస్టర్‌ను రూపొందించింది. మంగళవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నాలుగేళ్లలో ప్రధాని మోదీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, భూసార పరీక్షలు వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఈ ఏడాది పెంచిన మద్దతు ధరల వల్ల రైతులకు ఎకరానికి రూ. 4 వేల నుంచి రూ.12 వేల వరకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. ఈ నెల 17 నుంచి 26 వరకు చేపట్టనున్న ‘మాట తప్పిన రాష్ట్ర ప్రభుత్వం– మార్పు కోసం బీజేపీ’నినాదంతో గ్రామాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నికల హామీలు, ప్రధాని మోదీ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నర్సింహారెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు జైపాల్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కుమార్ పాల్గొన్నారు. -
దళిత అధకారుల్ని ప్రభుత్వం వేధిస్తోంది
-
‘కేంద్ర పథకాలను నీరుగారుస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరొ స్తుందని కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. రైతుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం గడువును పెంచితే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. పంట ల నష్టంపై నివేదికలూ కేంద్రానికి ఇవ్వడం లేద న్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా హాలులో విలేకరులతో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుబంధు ను గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో ఎకరా పత్తి పంట నష్టపోతే ఫసల్ బీమాతో రూ.37 వేలు రైతుకు వస్తాయని, దీన్ని ఎందుకు ప్రజలకు చెప్పడంలేదని నిలదీశారు. మైనారిటీ శాఖలో అడ్డదారిలో చేపట్టిన ఉద్యోగాల భర్తీ వెనుక ఎంఐఎం హస్తం ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. ఆ భర్తీలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించలేదని, దానిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. -
గడువులోగా ప్రీమియం చెల్లించండి: పోచారం
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం కింద రైతులు బీమా ప్రీమియంను గడువులోగా చెల్లించాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు కర పత్రాలు, గోడపత్రికలు ముద్రించి గ్రామాల్లో ప్రచారం చేశామని తెలిపారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఈ అంశంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రీమియం చెల్లించని రైతులకు బీమా వర్తించదని, పరిహారం అందదన్నారు. బ్యాంకుల ద్వారా రుణం తీసుకునే రైతులందరి బీమా ప్రీమియం మొత్తాన్ని బ్యాంకులే మినహాయించుకుంటాయని పేర్కొన్నారు. బ్యాంకు రుణం తీసుకోని రైతులు తమ మండలంలోని కేంద్ర ప్రభుత్వ కామన్ సర్వీస్ సెంటర్లలో ప్రీమియంను చెల్లించాలన్నారు. 2017–18 యాసంగిలో అకాల వర్షాలు, వడగళ్లతో నష్టపోయిన రైతుల వివరాలను బీమా కంపెనీలకు పంపినట్లు చెప్పారు. కాగా,పీఎంఎఫ్‌బీవై కింద వరి బీమా ప్రీమియం చెల్లించేందుకు ఆగస్టు 31 వరకు గడువు ఉందని, ఇతర పంటలకు జూలై 31 ఆఖరు అని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. -
బీమా.. రైతుకు ఏదీ ధీమా!
సాక్షి, అమరావతి బ్యూరో: పంటల బీమా గడువు ముంచుకొస్తోంది. రైతులను సమయాత్తం చేసి, బీమా చెల్లించేలా చూడాల్సిన వ్యవసాయశాఖ వెనుకబడింది. ఏటా ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోతూనే ఉన్నారు. విపత్తులు ఎదురైనప్పుడు రైతులకు అండగా ఉండేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమా పథకాలు అమలులో ఉన్నాయి. జిల్లాకు సంబంధించి 8 పంటలకు బీమా చేసుకొనే అవకాశం ఉంది. వరి, కంది, మినుము, ఆముదం, పసుపు, చెరకు పంటలు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం పంటల బీమాను అమలుచేసే ఏజెన్సీలను టెండర్ల ద్వారా ఖరారు చేసింది. గుంటూరు జిల్లాలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, వాతావరణ ఆధారిత బీమాను ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు దక్కించుకున్నాయి. జిల్లాలో పత్తి, మిరప పంటలు వాతావరణ ఆధారిత బీమా పరిధిలోకి వస్తాయి. రైతులు తీసుకునే పంట రుణాల మొత్తంలో బ్యాంకులు రెండు శాతం మినహాయించి ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తాయి. రుణాలు తీసుకోని రైతులతో పంట బీమా చేయించేలా వ్యవసాయశాఖ చైతన్యం చేయాలి. జిల్లాలో అధికారికంగా 1.60 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. అనధికారికంగా వారి సంఖ్య మూడు లక్షల మందికి పైనే. వీరితో పాటు పంటలు సాగు చేసే రైతులు చాల మంది బ్యాంకుల్లో రుణాలు తీసుకోరు. అలాంటి వారితో ఈ బీమా చేయించాల్సిన అవసరం ఉంది. వరి మినహా మిగిలిన పంటలకు ఈ నెల 31వ తేదీతో బీమా చేయించే గడువు ముగుస్తోంది. వరికి ఆగస్టు 21వ తేదీ వరకు గడువు ఉంది. అయితే బ్యాంకుల్లో రుణాలు తీసుకోని వారు ఒక్కరు కూడా ఇప్పటి వరకూ బీమా చేయించలేదు. బీమా చేసుకోవాలి ఇలా.. పంటల బీమాను జిల్లా వ్యాప్తంగా ఉన్న 700 కామన్ సర్వీస్ (మీ–సేవ) సెంటర్లలో చేసుకొనే అవకాశం కల్పించారు. రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, పంట వేసిన ధ్రువీకరణ పత్రం వ్యవసాయ, రెవెన్యూ అధికారుల నుంచి తీసుకోవాలి. కౌలు రైతులైతే పంట సాగు ధృవీకరణ పత్రాలు జతచేయాలి. ఇన్సూరెన్స్ మొత్తంలో పంట రకాన్ని బట్టి రెండు నుంచి ఐదు శాతం చెల్లించాలి. ప్రీమియం ఇలా.. కంది, మినుపు, వరి, ఆముదం పంటలకు రైతులు ఇన్సూరెన్స్ మొత్తంలో రెండు శాతం చెల్లించాలి. పసుపు, పత్తి, మిరప పంటకు ఇన్సూరెన్స్ మొత్తంలో ఐదు శాతం చెల్లించాల్సి ఉంటుంది. చెరుకుకు 4.78 శాతం పంటల బీమా కింద చెల్లించాలి. వరి పంటకు మాత్రం ఆగస్టు 21వ తేదీ వరకు పంటల బీమా చేసుకునే అవకాశం ఉంది. మిగిలిన అన్ని పంటలకు సంబంధించి ఈ నెల 31వ తేదీలోపే బీమా చేసుకోవాలి. అయితే జిల్లాలో ఇప్పటి వరకు రైతులు పంటల బీమాను చేసినట్లు కనిపించలేదు. 31వ తేదీలోపు లోను తీసుకోని రైతులంతా బీమా చేసుకుంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పరిహారం అందుతుంది. వ్యవసాయ శాఖ సైతం ఆ దిశగా రైతులను సమాయత్తం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. రైతులను చైతన్యవంతం చేస్తున్నాం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమాల కింద గుంటూరు జిల్లాలో ఎనిమిది పంటలకు బీమా చేసుకునే అవకాశం ఉంది. పంట రుణాలు తీసుకోని రైతులు, కౌలు రైతులు పంటల బీమా చేయించేలా అవగాహన కల్పిస్తున్నాం. కరపత్రాలు, వాల్‌పోస్టర్లతో విస్తృత ప్రచారం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులతో బీమా చేస్తే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అండగా ఉంటుంది. ప్రతి ఒక్క రైతు బీమా సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. – విజయభారతి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, గుంటూరు -
ఫసల్ బీమాలో మాయాజాలం..
జనగామ: ఫసల్ బీమా ద్వారా రైతులు పత్తి, వరి తదితర పంటలకు బీమా చేసుకుంటున్నారు. గత ఏడాది ఓ రైతు పత్తిపంటకు చేసుకున్న డీడీని ఆరు నెలల తర్వాత కంపెనీ వెనక్కి పంపించింది. దీంతో రైతు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు ముగ్గురు కలెక్టర్లను కలిసి మొరపెట్టుకున్నా స్పదించకపోవడంతో కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగిన సంఘటన గురువారం జరిగింది. జనగామ మండలం చీటకోడూరుకు చెందిన బాధిత రైతు ఓరుగంటి నర్సయ్య విలేకరులతో మాట్లాడారు. 2017 జూలైలో ఎకరం పత్తి పంట కోసం చోలా మండలం కంపెనీ పేరుతో రూ.1650 డీడీ తీసి, వ్యవసాయ శాఖకు అప్పగించానని తెలిపారు. పత్తి సాగు సమయంలో వర్షాభావ పరిస్థితుల్లో కొంత మేర నష్టం వచ్చిందని, బీమా ద్వారా ఆదుకుంటారని ఆశపడ్డామన్నారు. పత్తిని సేకరించి, తిరిగి సాగు చేçసుకునేందుకు దుక్కులు దున్నిన తర్వాత 2017 డిసెంబర్ మాసంలో డీడీని తిరిగి పంపించారని పేర్కొన్నారు. ఇదేంటని వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నిస్తే..కలెక్టర్ వద్దకు వెళ్లాలని సూచించారన్నారు. గతంలో పని చేసిన కలెక్టర్ శ్రీదేవసేన, ఇన్చార్జి కలెక్టర్, ప్రస్తుతం పనిచేస్తున్న వినయ్ కృష్ణారెడ్డిని ఎన్నోసార్లు కలిసి విజ్ఞప్తి చేశానని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినప్పుడల్లా నీ పని ఇంకా కాలేదా అనడం తప్ప.. వారు చేసిందేమీ లేదన్నారు. తనతో పాటు మరో 50 మంది రైతుల డీడీలు వాపస్ వచ్చాయని వెల్లడించారు. డీడీ విషయంలో కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేశారని, ఏమీ చేయలేని పరిస్థితుల్లో డీడీని విడిపించుకుంటున్నానన్నారు. నకిలీ విత్తనాలుపై దృష్టి సారించే ఉన్నతాధికారులు.. బీమా కంపెనీలు సాగిస్తున్న మోసాలపై ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. -
పామాయిల్ పంటకు ‘ఫసల్ బీమా’ వర్తింపు
కల్లూరురూరల్ : పామాయిల్ సాగు చేసే రైతులకు ప్రధానమంత్రి ఫసల బీమా యోజన వర్తింపజేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణలో కేవలం ఉభయ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రైతులకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు, పెనుబల్లి, ఎర్రుపాలెం, మధిర, వైరా, పాలేరు, కూసుమంచి, నేలకొండపల్లి, బోనకల్ మండలాల్లో సుమారు పది వేల ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి, పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం, జూలూరుపాడు, చండ్రుగుండ్ర మండలాల్లో సుమారు 25 వేల ఎకరాలలో పామాయిల్ సాగవుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో పామాయిల్ రైతులకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలు కానుంది. ఈ పథకంలో బ్యాంకు రుణం పొందిన రైతులకు ఫసల్ బీమా యోజన తప్పని సరిగా వర్తిస్తుంది. అదే విధంగా రుణం పొందని రైతులకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందులో బ్యాంకు అధికారులను సంప్రదించి ప్రీమియం ఫారం పొంది కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా బీమా నమోదు చేయించుకునే అవకాశం ఉంది. పామాయిల్ ఎకరానికి వర్తించే బీమా రూ. 35 వేలు కాగా, ఇందులో 5 శాతం ఎకరానికి రూ. 1750 రైతులు చెల్లించాల్సి ఉంటుంది. పామాయిల్ రైతులు ఈ నెల 14 వ తేదీ లోపు తమ ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు సమీపంలోని బ్యాంకులు, వ్యవసాయ, ఉద్యాన వనశాఖ అధికారులను రైతులు సంప్రదించాలి. -
కేంద్ర పథకాల నిర్వీర్యం
సాక్షి, హైదరాబాద్: ‘పొరుగునున్న కర్ణాటకలోని గుల్బర్గాలో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద రైతులకు బీమా అందింది. మనిషికి బీమా ఉన్నట్టుగానే పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కానీ దీన్ని రాష్ట్రంలో నీరుగార్చారు. నాబార్డ్ ద్వారా రైతు సంక్షేమం కోసం ఖర్చు చేసేందుకు రూ.11 లక్షల కోట్లు కేంద్రం కేటాయించినా రాష్ట్ర రైతులకు దాని ఫలాలు అందకుం డా పోతున్నాయి. రూ.లక్ష రుణం తీసుకున్న రైతుల పక్షాన వడ్డీని బ్యాంకులకు చెల్లిస్తే రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్ విత్తన భాండాగారం చేస్తామన్న సీఎం మాట ఏమైంది? ఇప్పటికీ రైతులకు నకిలీ విత్తనాలే ఎందుకు దిక్కవుతున్నాయి?’ అంటూ అసెంబ్లీలో అధికార పక్షంపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. వ్యవసాయం, పౌర సరఫరాలు, పశు సంవర్థక శాఖలపై జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ ఉపనేత చింతల రామచంద్రారెడ్డి మాట్లాడారు. ఉచిత విద్యుత్ మొదలు రైతుకు ఆర్థిక సహకారం వరకు అన్నింటా కేంద్ర సా యం ఉన్నా ఆ విషయాన్ని వెల్లడించకుండా, రైతులకు కేంద్రం ఏం చేయట్లేదని తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో రైతులకు మద్దతు ధర కాకుండా బోనస్ ప్రకటిస్తున్నారని, ఇక్కడ బేడీలేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులతో వర్సిటీ అనుసంధానం: ఆర్.కృష్ణయ్య వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని రైతులతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. అప్పుడే అందులోని విద్యార్థులకు వాస్తవ విషయాలు తెలిసి భవిష్యత్తులో రైతులకు ఉపయోగపడేలా తయారవుతారని చెప్పారు. రేషన్ కార్డులు ఇచ్చేదెప్పుడు?: సున్నం ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం తొలగించిందని, దీంతో రేషన్ కార్డులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తెలిపారు. రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని ప్ర శ్నించారు. గిరిజన ప్రాంతాల్లో ఐదారు కిలోమీటర్లకు ఒక రేషన్ షాపు ఉండటంతో ప్రజలు ఇ బ్బందులు పడుతున్నారన్నారు. అక్కడ కి.మీ. కి ఓ రేషన్ షాపు ఏర్పాటు చేయాలన్నారు. -
సివిల్ సర్వీసెస్ అధికారులకు అవార్డులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన అధికారులకు ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రధాని మోదీ అవార్డులు అందించనున్నారు. వివిధ శాఖల అధికారుల నుంచి మొత్తం 623 జిల్లాల నుంచి 2010 దరఖాస్తులు వచ్చినట్లు కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, డిజిటల్ చెల్లింపులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్, రూరల్), దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన అధికారులకు అవార్డులు ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వంలో సేవలందిస్తున్న అడిషనల్ సెక్రటరీ /జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్/ డిప్యూటీ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారులకు ఈ అవార్డులు అందిస్తారు. కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిలో వాతావరణ పరిరక్షణకు, విపత్తుల నిర్వహణ, జలవనరుల సంరక్షణ, విద్యుత్, విద్య, ఆరోగ్యం, మహిళలు, శిశువుల సంక్షేమానికి కృషి చేసిన వారికి కూడా అవార్డులు అందజేస్తారు. -
రాత్రికి రాత్రే పరిష్కరించలేం!
రైతు ఆత్మహత్యలపై కేంద్రం వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: రైతు ఆత్మహత్యల సమస్యను రాత్రికి రాత్రే పరిష్కరించలేమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫసల్ బీమా యోజన వంటి రైతు అనుకూల పథకాలు మెరుగైన ఫలితాలివ్వాలంటే కనీసం ఒక సంవత్సరం గడువు అవసరమన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తితో ఏకీభవించింది. రైతుల దుస్థితికి పరిహారం పరిష్కారం కాదని, రైతు సంక్షేమ పథకాల్ని పేపర్లకు పరిమితం కాకుండా చూడాలంది. ఈ సంద్భరంగా రైతు ఆత్మహత్యలపై ఎన్జీఓ సంస్థ సిటిజెన్స్ రిసోర్స్ అండ్ యాక్షన్ ఇనీషియేవ్(సీఆర్ఏఎన్టీఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను 6 నెలలు వాయిదా వేసింది. విచారణ ప్రారంభంలో కోర్టు స్పందిస్తూ.. ‘రైతుల ఆత్మహత్యలకు పరిహారం చెల్లింపు ఎప్పటికీ పరిష్కారం కాదు. అప్పు చెల్లించే పరిస్థితిలేకే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందువల్ల రుణాల బాధలతో తలెత్తే ఇబ్బందుల్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. రుణాలపై బీమా సదుపాయం కల్పించాల’ని పేర్కొంది. రైతుల ఆత్మహత్యల్ని ఒక్క రోజులో పరిష్కరించలేమని, మంచి ఫలితాలు సాధించాలంటే ఒక సంవత్సరం సమయమివ్వాలన్న అటార్నీ జనరల్ వాదనతో ఏకీభవిస్తున్నామని సీజేఐ జస్టిస్ ఖేహర్, జస్టిస్ చంద్రచూడ్‌ల బెంచ్ తెలిపింది. 5.34 కోట్ల రైతులకు బీమా సదుపాయం కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదిస్తూ.. ‘ఎన్డీఏ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ చర్యల్ని చేపట్టింది. ఫలితాలకు సమయమివ్వాలి. కష్టాల నుంచి రైతుల్ని గట్టెక్కించేందుకు కేంద్రం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. మొత్తం 12 కోట్ల మంది రైతులకుగాను 5.34 కోట్ల మందికి ఇప్పటికే ఫసల్ బీమా యోజన, ఇతర సంక్షేమ పథకాల కింద బీమా సదుపాయం ఉంది. 30 శాతం రైతుల భూమికి పంటల బీమా పథకం వర్తింపచేశాం’ అని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్జీవో తరఫు న్యాయవాది కోలిన్ గోన్సల్వెస్ వాదిస్తూ.. 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ‘నకిలీ’ ఉద్యోగాలు చెల్లవు.. న్యూఢిల్లీ: రిజర్వేషన్ కేటగిరీలో నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో సాధించిన ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలు చట్టం దృష్టిలో చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్ ఖేహర్, జస్టిస్ చంద్రచూడ్‌ల ధర్మాసనం గురువారం ఆ మేరకు తీర్పునిస్తూ.. ఈ కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించబోమంది. తీర్పు తక్షణం అమల్లోకొస్తుందని బెంచ్ పేర్కొంది. దీర్ఘకాలం ఉద్యోగంలో కొనసాగుతున్న వ్యక్తి నకిలీ ధ్రువీకరణ పత్రాలతో మోసగించాడని తేలితే.. మిగతా కొద్ది కాలం అతను ఉద్యోగంలో కొనసాగేందుకు అనుమతిస్తూ గతంలో బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. తీర్పును వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలువురు కోర్టును ఆశ్రయించారు. -
ఫసల్ బీమా అమలులో విఫలం
ప్రభుత్వంపై లక్ష్మణ్ ధ్వజం వ్యవసాయ కమిషనరేట్ వద్ద కిసాన్ మోర్చా ధర్నా సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. ఫసల్ బీమా యోజన అమలులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు బీజేపీ కిసాన్‌మోర్చా అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా జరిగింది. ఈ ధర్నాలో లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులుంటే, వారిలో కనీసం 10 శాతం మందిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనలో చేర్పించ లేకపోయిందన్నారు. దీనివల్ల కరువు, అతి వృష్టి, వరదలు వంటివాటితో పంటనష్టపోయిన రైతులు పరిహారం పొందే అవకాశంలేకుండా పోయిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పంటరుణాలను ఒకేసారి మాఫీ చేశామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగువిడతలుగా చేసిందన్నారు. దీనివల్ల రైతులకు వడ్డీ పెరిగిపోయిందన్నారు. రాష్ట్రంలో రూ.17వేల కోట్ల రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్నమాట అబద్ధమని లక్ష్మణ్ అన్నారు. రుణమాఫీ పూర్తికాకపోవడం వల్ల రైతులకు బ్యాంకులు కొత్త రుణాలను ఇవ్వడంలేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14లక్షల మంది కౌలు రైతులు ఉన్నప్పటికీ వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడంలో, వారికి రుణాలను ఇప్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని, వారి కుటుంబా లను ప్రభుత్వం ఆదుకోవడంలేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని లక్ష్మణ్ హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు యెండల లక్ష్మీనారాయణ, బద్దం బాల్‌రెడ్డి, పుష్పలీల, నందీశ్వర్‌గౌడ్, చింతా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఫసల్‌బీమా వర్తింపజేయాలి
► వేరుశనగ రైతులను ఆదుకోవాలి ► రైతుసంఘం నాయకుల డిమాండ్ ► సీపీఐ ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మ దహనం అనంతపురం అగ్రికల్చర్/ అర్బన్ : ఫసల్ బీమా యోజనను వేరుశనగ పంటకు వర్తింపజేయకపోవడంపై వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ అనుబంధ రైతుసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా వేరుశనగ సాగు చేసే జిల్లా అనంతపురమని, ఇక్కడ తరచూ కరువు పరిస్థితుల వల్ల రైతులు పంట నష్టపోతూనే ఉన్నారని పేర్కొన్నాయి. ప్రస్తుతమున్న వాతావరణ ఆధారిత పంటల బీమా వల్ల రైతులకు ఎటువంటి ఉపయోగమూ లేకుండా ఉందని తెలిపాయి. ఈ పరిస్థితుల్లో అంతోఇంతో ప్రయోజనం ఒనగూరే ఫసల్‌బీమాను వేరుశనగ పంటకు వర్తింపజేయాల్సిందేనని ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. జిల్లాలో భారీస్థాయిలో పరిహారం అందించాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే వేరుశనగ పంటను బీమా జాబితా నుంచి తప్పించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకులేడు రామచంద్రారెడ్డి విమర్శించారు. ఫసల్‌బీమా వర్తింపజేయకపోతే జిల్లా రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. అంతేకాకుండా వాతావరణ బీమా పథకాన్నే కొనసాగిస్తూ ప్రీమియం మొత్తాన్ని రూ.530 నుంచి రూ.750కు పెంచేశారని, ఇది రైతులపై మరింత భారం మోపడమేనని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం ఫసల్‌బీమా యోజనలో వేరుశనగ పంటను చేర్చకపోవడాన్ని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని టవర్‌క్లాక్ వద్ద కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పథకంలో వేరుశనగని చేర్చేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ డిమాండ్ చేశారు. జిల్లాలో ఏ పంట ప్రధానంగా పండిస్తున్నారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోకుండా వేరుశనగ పంటని బీమా నుంచి మినహాయించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామి, నగర కార్యదర్శి లింగమయ్య తదితరులు పాల్గొన్నారు. ఫసల్తో భరోసా కల్పించాలి వరుస కరువులతో కుదేలవుతున్న వేరుశనగ రైతులకు ఫసల్ బీమా యోజన వర్తింపజేసి భరోసా కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లాలో అత్యధికంగా పండించే వేరుశనగని ఫసల్ బీమాలో చేర్చకుండా పత్తిపంటను చేర్చడం వెనుక ఉద్దేశం ఏమిటో స్పష్టమవుతోందన్నారు. దీనిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించాలన్నారు. ఫసల్ బీమాలో వేరుశనగను చేర్చాలి ఫసల్ బీమా యోజనలో వేరుశనగ పంటని చేర్చాలని సీపీఎం అనుబంధ ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. బుధవారం స్థానిక గణేనాయక్ భవన్లో సంఘం నాయకులతో కలిసి జిల్లా కార్యదర్శి పి.పెద్దిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. వేరుశనగని ఫసల్ బీమా యోజనలో చేర్చితే రైతుకు న్యాయం జరుగుతుందన్నారు. పథకంలో వేరుశనగ పంట చేర్చే విషయంపై జిల్లా మంత్రులు స్పందించాలన్నారు. సమావేశంలో సహాయ కార్యద ర్శులు జంగాలపల్లి పెద్దన్న, చంద్రశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు తలారి రామాంజినేయులు, నాగేశ్, కదిరప్ప, తదితరులు పాల్గొన్నారు. -
రైతు కన్నీరు తుడిచేందుకే ‘ఫసల్’
♦ జిల్లా రైతులకు ఉచితంగా పశుగ్రాసం ♦ బీమా పథక అవగాహన సదస్సులో కేంద్రమంత్రి దత్తాత్రేయ ♦ రైతు ఆత్మహత్యలు ఆందోళనకరం ♦ తెలంగాణలో కరువు నివారణకు నిధులు యాచారం : అన్నదాత కన్నీరు తుడిచేందుకే ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ - కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా గురువారం మండలంలోని గడ్డ మల్లయ్యగూడలో ఫసల్ బీమా యోజన పథకంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలోని వ్యవసాయరంగా న్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రధాని కంకణం కట్టుకున్నారన్నారు. అందులో భాగంగానే రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఈ బీమా పథకాన్ని అమలు చేశారన్నారు. ఈ పథకం వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే తక్షణమే 25 శాతం, మిగిలిన పరిహా రాన్ని 90 రోజుల్లోపు అందిస్తారన్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేసి గెలిచిన వారితోనే ప్రభుత్వ పథకాల్లో అవినీతి జరిగే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో కరువు నివారణకు తక్షణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో రూ.400 కోట్లు మంజూరు చేయనున్న ట్లు తెలిపారు. గొర్రెలు, మేకల కాపరులు, చేతివృత్తుల సంక్షేమానికి కేంద్రం నుంచి రూ.450 కోట్లు, గ్రామీణాభివృద్ధి కోసం రూ. 87 కోట్లు మంజూరు చేయిస్తానన్నారు. ఉపాధి కూలీలకు రెండు నెలలు కూలి డబ్బు రాలేద న్న ఫిర్యాదులు అందుతున్నాయని, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా ఉంటే 24 గంటల్లోనే కూలి డబ్బు వారి ఖాతాలో జమచేసేలా కేంద్రం కృషి చేస్తోందన్నారు. రంగారెడ్డి జిల్లా రైతులకు ఉచితంగా పశుగ్రాసం, నీళ్లు అందించేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. భువనగిరి ఎంపీ బూరనర్సయ్య గౌడ్ మాట్లాడుతూ ఫసల్ బీమా యోజన పథకం వల్ల పట్టాదారు, పాసు పుస్తకాలున్న రైతులకే మేలు జరుగుతుందన్నారు. అయితే ఈ పథకం కౌలు రైతులకూ వర్తించేలా కేంద్ర మంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ 1983లో కరువు పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయన్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో ఉపాధి పనిదినాలను 150 రోజుల నుంచి 200 రోజులకు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. రెండు నెలలుగా ఉపాధి కూలీలకు డబ్బు రావడం లేదు, 24 గంటల్లో అందే విధంగా మంత్రి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు ఏఐసీ చీఫ్ మేనేజర్ వీవీఎస్ రావు ఫసల్ బీమా యోజన పథకం నిబంధనలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు రాయితీలకు సంబంధించి పలు బ్రోచర్లను కేంద్ర మంత్రి సమక్షంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కోదండరెడ్డి, క్రీడా-కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఎం ప్రభాకర్, ప్రసాద్, శేఖర్, ఎంపీపీ రమావత్ జ్యోతినాయక్, జెడ్పీటీసీ సభ్యుడు కర్నాటి రమేష్‌గౌడ్, వైస్ ఎంపీపీ రామకృష్ణ యాదవ్, పీఏసీఏస్ చైర్మన్ నాయిని సుదర్శన్‌రెడ్డి, గడ్డమల్లయ్య గూడ, గునుగల్ సర్పంచ్‌లు నర్రె మల్లేష్, అచ్చెన మల్లికార్జున్, జిల్లా వ్యవసాయ శాఖ జేడీఏ జగదీష్, జిల్లా ఉద్యాన శాఖ డిప్యూటీ డెరైక్టర్ బాబు, సరూర్‌నగర్ ఆర్డీఓ సుధాకర్‌రావు, తహసీల్దార్ పద్మనాభరావు, ఎంపీడీఓ ఉషా, వివిధ పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.