
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం కింద రైతులు బీమా ప్రీమియంను గడువులోగా చెల్లించాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు కర పత్రాలు, గోడపత్రికలు ముద్రించి గ్రామాల్లో ప్రచారం చేశామని తెలిపారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఈ అంశంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రీమియం చెల్లించని రైతులకు బీమా వర్తించదని, పరిహారం అందదన్నారు.
బ్యాంకుల ద్వారా రుణం తీసుకునే రైతులందరి బీమా ప్రీమియం మొత్తాన్ని బ్యాంకులే మినహాయించుకుంటాయని పేర్కొన్నారు. బ్యాంకు రుణం తీసుకోని రైతులు తమ మండలంలోని కేంద్ర ప్రభుత్వ కామన్ సర్వీస్ సెంటర్లలో ప్రీమియంను చెల్లించాలన్నారు. 2017–18 యాసంగిలో అకాల వర్షాలు, వడగళ్లతో నష్టపోయిన రైతుల వివరాలను బీమా కంపెనీలకు పంపినట్లు చెప్పారు. కాగా,పీఎంఎఫ్‌బీవై కింద వరి బీమా ప్రీమియం చెల్లించేందుకు ఆగస్టు 31 వరకు గడువు ఉందని, ఇతర పంటలకు జూలై 31 ఆఖరు అని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు.