సాక్షి, అమరావతి బ్యూరో: పంటల బీమా గడువు ముంచుకొస్తోంది. రైతులను సమయాత్తం చేసి, బీమా చెల్లించేలా చూడాల్సిన వ్యవసాయశాఖ వెనుకబడింది. ఏటా ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోతూనే ఉన్నారు. విపత్తులు ఎదురైనప్పుడు రైతులకు అండగా ఉండేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమా పథకాలు అమలులో ఉన్నాయి. జిల్లాకు సంబంధించి 8 పంటలకు బీమా చేసుకొనే అవకాశం ఉంది. వరి, కంది, మినుము, ఆముదం, పసుపు, చెరకు పంటలు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పరిధిలోకి వస్తాయి.
ప్రభుత్వం పంటల బీమాను అమలుచేసే ఏజెన్సీలను టెండర్ల ద్వారా ఖరారు చేసింది. గుంటూరు జిల్లాలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, వాతావరణ ఆధారిత బీమాను ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు దక్కించుకున్నాయి. జిల్లాలో పత్తి, మిరప పంటలు వాతావరణ ఆధారిత బీమా పరిధిలోకి వస్తాయి. రైతులు తీసుకునే పంట రుణాల మొత్తంలో బ్యాంకులు రెండు శాతం మినహాయించి ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తాయి.
రుణాలు తీసుకోని రైతులతో పంట బీమా చేయించేలా వ్యవసాయశాఖ చైతన్యం చేయాలి. జిల్లాలో అధికారికంగా 1.60 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. అనధికారికంగా వారి సంఖ్య మూడు లక్షల మందికి పైనే. వీరితో పాటు పంటలు సాగు చేసే రైతులు చాల మంది బ్యాంకుల్లో రుణాలు తీసుకోరు. అలాంటి వారితో ఈ బీమా చేయించాల్సిన అవసరం ఉంది. వరి మినహా మిగిలిన పంటలకు ఈ నెల 31వ తేదీతో బీమా చేయించే గడువు ముగుస్తోంది. వరికి ఆగస్టు 21వ తేదీ వరకు గడువు ఉంది. అయితే బ్యాంకుల్లో రుణాలు తీసుకోని వారు ఒక్కరు కూడా ఇప్పటి వరకూ బీమా చేయించలేదు.
బీమా చేసుకోవాలి ఇలా..
పంటల బీమాను జిల్లా వ్యాప్తంగా ఉన్న 700 కామన్ సర్వీస్ (మీ–సేవ) సెంటర్లలో చేసుకొనే అవకాశం కల్పించారు. రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, పంట వేసిన ధ్రువీకరణ పత్రం వ్యవసాయ, రెవెన్యూ అధికారుల నుంచి తీసుకోవాలి. కౌలు రైతులైతే పంట సాగు ధృవీకరణ పత్రాలు జతచేయాలి. ఇన్సూరెన్స్ మొత్తంలో పంట రకాన్ని బట్టి రెండు నుంచి ఐదు శాతం చెల్లించాలి.
ప్రీమియం ఇలా..
కంది, మినుపు, వరి, ఆముదం పంటలకు రైతులు ఇన్సూరెన్స్ మొత్తంలో రెండు శాతం చెల్లించాలి. పసుపు, పత్తి, మిరప పంటకు ఇన్సూరెన్స్ మొత్తంలో ఐదు శాతం చెల్లించాల్సి ఉంటుంది. చెరుకుకు 4.78 శాతం పంటల బీమా కింద చెల్లించాలి. వరి పంటకు మాత్రం ఆగస్టు 21వ తేదీ వరకు పంటల బీమా చేసుకునే అవకాశం ఉంది. మిగిలిన అన్ని పంటలకు సంబంధించి ఈ నెల 31వ తేదీలోపే బీమా చేసుకోవాలి. అయితే జిల్లాలో ఇప్పటి వరకు రైతులు పంటల బీమాను చేసినట్లు కనిపించలేదు.
31వ తేదీలోపు లోను తీసుకోని రైతులంతా బీమా చేసుకుంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పరిహారం అందుతుంది. వ్యవసాయ శాఖ సైతం ఆ దిశగా రైతులను సమాయత్తం చేయాల్సిన ఆవశ్యకత ఉంది.
రైతులను చైతన్యవంతం చేస్తున్నాం
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమాల కింద గుంటూరు జిల్లాలో ఎనిమిది పంటలకు బీమా చేసుకునే అవకాశం ఉంది. పంట రుణాలు తీసుకోని రైతులు, కౌలు రైతులు పంటల బీమా చేయించేలా అవగాహన కల్పిస్తున్నాం. కరపత్రాలు, వాల్‌పోస్టర్లతో విస్తృత ప్రచారం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులతో బీమా చేస్తే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అండగా ఉంటుంది. ప్రతి ఒక్క రైతు బీమా సౌకర్యాన్ని వినియోగించుకోవాలి.
– విజయభారతి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment