Crops insurance scheme
-
నేడు పంటల బీమా సొమ్ము 596.36 కోట్లు చెల్లింపు
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం 2018 రబీ పంటల బీమా సొమ్మును రైతులకు చెల్లించకుండా ఎగనామం పెట్టింది. అయితే తమది రైతు పక్షపాత ప్రభుత్వమని ఇప్పటికే నిరూపించిన సీఎం జగన్మోహన్రెడ్డి.. గత సర్కారు ఎగనామం పెట్టిన పంటల బీమా సొమ్మును రైతులకు చెల్లించాలని నిర్ణయించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి 13 జిల్లాల్లోని 5,94,005 మంది రైతుల ఖాతాలకు రూ.596.36 కోట్లు నేరుగా జమ చేయనున్నారు. 2018 రబీ పంటల బీమా కింద గత చంద్రబాబు ప్రభుత్వం బీమా కంపెనీలకు ప్రీమియంను చెల్లించలేదు. దీంతో రైతులకు చెందాల్సిన 596.36 కోట్ల రూపాయలను బీమా కంపెనీలు చెల్లించలేదు. ఈ విషయాన్ని సమీక్షల ద్వారా తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్.. వెంటనే కంపెనీలకు బీమా ప్రీమియంను చెల్లించాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఇప్పుడు ఏకంగా 5.94 లక్షల మంది రైతులకు లబ్ధి కలగనుంది. జిల్లాల వారీగా రైతులు లబ్ధి పొందే మొత్తం వివరాలు ఇలా ఉన్నాయి.. -
ఇక ‘పంటల బీమా’ పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే
సాక్షి, అమరావతి: 2019–20 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రి పంటల బీమా, పునర్ వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. రబీ నుంచి పంటల బీమాను 100 శాతం రాష్ట్ర ప్రభుత్వ పథకంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీని ప్రకారం రాష్ట్రంలోని నిర్ధేశించిన ప్రాంతాల్లో పంటల బీమా కోసం వ్యవసాయ శాఖ గుర్తించిన వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు దారులందరికీ వంద శాతం బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించి.. పరిహారం సొమ్మును వారి ఖాతాలకు చెల్లించే బాధ్యతను చేపడుతుంది. అలాగే పంటల బీమా పథకం అమలు కోసం ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2013 కంపెనీల చట్టానికి అనుగుణంగా రూ.101 కోట్ల వాటా ధనంతో ఇది ఏర్పాటవుతుంది. వ్యవసాయ రంగ బీమా అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వమే ఈ మొత్తాన్ని సమకూర్చుతుంది. రబీ నుంచి పంటల బీమా అమలు ఇలా.. ►గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ, రెవెన్యూ శాఖల పర్యవేక్షణ, తనిఖీ అనంతరం.. వ్యవసాయ శాఖ నిర్దేశించిన తేదీల మేరకు పంటల బీమాకు అర్హులైన సాగుదారులకు సంబంధించిన సమాచారాన్ని వ్యవసాయ శాఖకు చెందిన వెబ్సైట్లోకి అప్లోడ్ చేస్తారు. అలా గుర్తించిన వారినే పథకానికి అర్హులుగా గుర్తిస్తారు. ►ప్రధానమంత్రి పంటల బీమా యోజన, పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంలో పంట నష్టం, పరిహారం నిర్దారణ సమయంలో అవసరం మేరకు మార్పులు చేర్పులు చేయవచ్చు. ►పథకం అమలులో సాగుదారులు లేదా ప్రభుత్వం ఏ సంస్థకూ ప్రీమియం సబ్సిడీ చెల్లించదు. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా పంటల బీమాకు అర్హమైన క్లెయిమ్స్ పరిష్కరిస్తుంది. సంబంధిత సాగుదార్ల ఆధార్ అనుసంధానిత బ్యాంక్ ఖాతాలకు నేరుగా క్లెయిమ్ మొత్తాలు జమ చేస్తారు. ►ఈ పథకం అమలుకు వ్యవసాయ శాఖ నోడల్ విభాగంగా వ్యవహరిస్తుంది. పంట కోతల ప్రయోగాలు, క్లెయిమ్‌ల పరిష్కారాల కోసం ఎప్పటికప్పుడు అజమాయిషీ, సమన్వయం ఉండేలా చూస్తుంది. రెవెన్యూ విభాగం కూడా బాధ్యురాలిగా వ్యవహరిస్తుంది. ప్రణాళికా విభాగం సకాలంలో పంట కోతల ప్రయోగాలు చేపట్టడంతో పాటు, పంట దిగుబడికి సంబంధించిన సమాచారం అందచేస్తుంది. ప్రతి ఎకరం పంటల బీమా పరిధిలోకి.. రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ ఏడాది ఖరీఫ్‌లో రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాతల తరఫున బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లించింది. ఉచిత పంటల బీమా ఫలితంగా ఖరీఫ్‌లో బీమా చేయించుకున్న రైతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే మరికొన్ని సమస్యలు పరిష్కరించాల్సిన అవసరాన్ని వ్యవసాయ శాఖ గుర్తించింది. 2019 ఖరీఫ్‌లో సుమారు మూడో వంతు సాగు భూమి బీమా పరిధిలోకి రాన్నట్లు గుర్తించింది. అందువల్ల కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలోకి తేవాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించింది. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం పథకం అమలులో మార్పులు చేసేందుకు అనుమతించనుంది. -
బీమా.. రైతుకు ఏదీ ధీమా!
సాక్షి, అమరావతి బ్యూరో: పంటల బీమా గడువు ముంచుకొస్తోంది. రైతులను సమయాత్తం చేసి, బీమా చెల్లించేలా చూడాల్సిన వ్యవసాయశాఖ వెనుకబడింది. ఏటా ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోతూనే ఉన్నారు. విపత్తులు ఎదురైనప్పుడు రైతులకు అండగా ఉండేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమా పథకాలు అమలులో ఉన్నాయి. జిల్లాకు సంబంధించి 8 పంటలకు బీమా చేసుకొనే అవకాశం ఉంది. వరి, కంది, మినుము, ఆముదం, పసుపు, చెరకు పంటలు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం పంటల బీమాను అమలుచేసే ఏజెన్సీలను టెండర్ల ద్వారా ఖరారు చేసింది. గుంటూరు జిల్లాలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, వాతావరణ ఆధారిత బీమాను ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు దక్కించుకున్నాయి. జిల్లాలో పత్తి, మిరప పంటలు వాతావరణ ఆధారిత బీమా పరిధిలోకి వస్తాయి. రైతులు తీసుకునే పంట రుణాల మొత్తంలో బ్యాంకులు రెండు శాతం మినహాయించి ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తాయి. రుణాలు తీసుకోని రైతులతో పంట బీమా చేయించేలా వ్యవసాయశాఖ చైతన్యం చేయాలి. జిల్లాలో అధికారికంగా 1.60 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. అనధికారికంగా వారి సంఖ్య మూడు లక్షల మందికి పైనే. వీరితో పాటు పంటలు సాగు చేసే రైతులు చాల మంది బ్యాంకుల్లో రుణాలు తీసుకోరు. అలాంటి వారితో ఈ బీమా చేయించాల్సిన అవసరం ఉంది. వరి మినహా మిగిలిన పంటలకు ఈ నెల 31వ తేదీతో బీమా చేయించే గడువు ముగుస్తోంది. వరికి ఆగస్టు 21వ తేదీ వరకు గడువు ఉంది. అయితే బ్యాంకుల్లో రుణాలు తీసుకోని వారు ఒక్కరు కూడా ఇప్పటి వరకూ బీమా చేయించలేదు. బీమా చేసుకోవాలి ఇలా.. పంటల బీమాను జిల్లా వ్యాప్తంగా ఉన్న 700 కామన్ సర్వీస్ (మీ–సేవ) సెంటర్లలో చేసుకొనే అవకాశం కల్పించారు. రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, పంట వేసిన ధ్రువీకరణ పత్రం వ్యవసాయ, రెవెన్యూ అధికారుల నుంచి తీసుకోవాలి. కౌలు రైతులైతే పంట సాగు ధృవీకరణ పత్రాలు జతచేయాలి. ఇన్సూరెన్స్ మొత్తంలో పంట రకాన్ని బట్టి రెండు నుంచి ఐదు శాతం చెల్లించాలి. ప్రీమియం ఇలా.. కంది, మినుపు, వరి, ఆముదం పంటలకు రైతులు ఇన్సూరెన్స్ మొత్తంలో రెండు శాతం చెల్లించాలి. పసుపు, పత్తి, మిరప పంటకు ఇన్సూరెన్స్ మొత్తంలో ఐదు శాతం చెల్లించాల్సి ఉంటుంది. చెరుకుకు 4.78 శాతం పంటల బీమా కింద చెల్లించాలి. వరి పంటకు మాత్రం ఆగస్టు 21వ తేదీ వరకు పంటల బీమా చేసుకునే అవకాశం ఉంది. మిగిలిన అన్ని పంటలకు సంబంధించి ఈ నెల 31వ తేదీలోపే బీమా చేసుకోవాలి. అయితే జిల్లాలో ఇప్పటి వరకు రైతులు పంటల బీమాను చేసినట్లు కనిపించలేదు. 31వ తేదీలోపు లోను తీసుకోని రైతులంతా బీమా చేసుకుంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పరిహారం అందుతుంది. వ్యవసాయ శాఖ సైతం ఆ దిశగా రైతులను సమాయత్తం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. రైతులను చైతన్యవంతం చేస్తున్నాం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమాల కింద గుంటూరు జిల్లాలో ఎనిమిది పంటలకు బీమా చేసుకునే అవకాశం ఉంది. పంట రుణాలు తీసుకోని రైతులు, కౌలు రైతులు పంటల బీమా చేయించేలా అవగాహన కల్పిస్తున్నాం. కరపత్రాలు, వాల్‌పోస్టర్లతో విస్తృత ప్రచారం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులతో బీమా చేస్తే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అండగా ఉంటుంది. ప్రతి ఒక్క రైతు బీమా సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. – విజయభారతి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, గుంటూరు -
మోదీ సభపై ‘పంట’ దుమారం
సెహోర్: కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన పంటల బీమా పథకంపై మధ్యప్రదేశ్‌లో ఈ నెల 18న జరగనున్న కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో షేర్పూర్ గ్రామంలో నిర్మించనున్న వేదిక చుట్టుపక్కల ఉన్న పంటలను కోసేయాలని ఒత్తిడి జరుగుతోందని షేర్పూర్ రైతులు ఆరోపిస్తున్నారు. అయితే అలాంటిదేమీ లేదని బీజేపీ ఖండిస్తోంది. ‘మా పచ్చని గోధుమ పంటను కోసేయాల్సిందిగా ఓ అధికారి అడిగారు. ఇంకా ఆ పంట పూర్తిగా ఎదగలేదు కూడా. పంట పోతే లక్షల రూపాయలు నాకు నష్టం వాటిల్లుతుంది’ అని సురేశ్ పరమర్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.