సాక్షి, అమరావతి: 2019–20 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రి పంటల బీమా, పునర్ వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. రబీ నుంచి పంటల బీమాను 100 శాతం రాష్ట్ర ప్రభుత్వ పథకంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీని ప్రకారం రాష్ట్రంలోని నిర్ధేశించిన ప్రాంతాల్లో పంటల బీమా కోసం వ్యవసాయ శాఖ గుర్తించిన వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు దారులందరికీ వంద శాతం బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించి.. పరిహారం సొమ్మును వారి ఖాతాలకు చెల్లించే బాధ్యతను చేపడుతుంది. అలాగే పంటల బీమా పథకం అమలు కోసం ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2013 కంపెనీల చట్టానికి అనుగుణంగా రూ.101 కోట్ల వాటా ధనంతో ఇది ఏర్పాటవుతుంది. వ్యవసాయ రంగ బీమా అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వమే ఈ మొత్తాన్ని సమకూర్చుతుంది.
రబీ నుంచి పంటల బీమా అమలు ఇలా..
►గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ, రెవెన్యూ శాఖల పర్యవేక్షణ, తనిఖీ అనంతరం.. వ్యవసాయ శాఖ నిర్దేశించిన తేదీల మేరకు పంటల బీమాకు అర్హులైన సాగుదారులకు సంబంధించిన సమాచారాన్ని వ్యవసాయ శాఖకు చెందిన వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేస్తారు. అలా గుర్తించిన వారినే పథకానికి అర్హులుగా గుర్తిస్తారు.
►ప్రధానమంత్రి పంటల బీమా యోజన, పునర్‌వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంలో పంట నష్టం, పరిహారం నిర్దారణ సమయంలో అవసరం మేరకు మార్పులు చేర్పులు చేయవచ్చు.
►పథకం అమలులో సాగుదారులు లేదా ప్రభుత్వం ఏ సంస్థకూ ప్రీమియం సబ్సిడీ చెల్లించదు. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా పంటల బీమాకు
అర్హమైన క్లెయిమ్స్ పరిష్కరిస్తుంది. సంబంధిత సాగుదార్ల ఆధార్ అనుసంధానిత బ్యాంక్ ఖాతాలకు నేరుగా క్లెయిమ్ మొత్తాలు జమ చేస్తారు.
►ఈ పథకం అమలుకు వ్యవసాయ శాఖ నోడల్ విభాగంగా వ్యవహరిస్తుంది. పంట కోతల ప్రయోగాలు, క్లెయిమ్‌ల పరిష్కారాల కోసం ఎప్పటికప్పుడు అజమాయిషీ, సమన్వయం ఉండేలా చూస్తుంది. రెవెన్యూ విభాగం కూడా బాధ్యురాలిగా వ్యవహరిస్తుంది. ప్రణాళికా విభాగం సకాలంలో పంట కోతల ప్రయోగాలు చేపట్టడంతో పాటు, పంట దిగుబడికి సంబంధించిన సమాచారం అందచేస్తుంది.
ప్రతి ఎకరం పంటల బీమా పరిధిలోకి..
రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ ఏడాది ఖరీఫ్‌లో రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాతల తరఫున బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లించింది. ఉచిత పంటల బీమా ఫలితంగా ఖరీఫ్‌లో బీమా చేయించుకున్న రైతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే మరికొన్ని సమస్యలు పరిష్కరించాల్సిన అవసరాన్ని వ్యవసాయ శాఖ గుర్తించింది. 2019 ఖరీఫ్‌లో సుమారు మూడో వంతు సాగు భూమి బీమా పరిధిలోకి రాన్నట్లు గుర్తించింది. అందువల్ల కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలోకి తేవాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించింది. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం పథకం అమలులో మార్పులు చేసేందుకు అనుమతించనుంది.
Comments
Please login to add a commentAdd a comment