సాక్షి, హైదరాబాద్: ‘రైతు వేదిక’లు ఇక నుంచి ‘ప్రజా వేదిక’లుగా రూపాంతరం చెందనున్నాయి. రైతులకు సంబంధించిన సమావేశాలే కాకుండా ఇతర ప్రభుత్వ లబ్ధిదారులకు సంబంధించిన మీటింగులు పెట్టుకునేలా వీలు కల్పిస్తూ వ్యవసాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాలకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి అన్ని ప్రభుత్వ శాఖలూ తమ కార్యక్రమాలను రైతు వేదికగా ప్రజలకు తెలియజేసేందుకు ఏర్పాట్లు చేసుకోవచ్చు.
ప్రభుత్వ పథక లబ్ధిదారులందరినీ రైతు వేదికల వద్దకు పిలిచి వారికి అవగాహన కల్పించొచ్చు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు తదితర పథకాలపై అవగాహన కల్పించాలంటే ఇక రైతు వేదికలనే కేంద్రంగా చేసుకోవచ్చు. ఆ మేరకు మండల అధికారులు చర్యలు తీసుకోవాలని, వాటిని ఉపయోగించుకోవాలని వ్యవసాయశాఖ విజ్ఞప్తి చేసింది.
వినియోగంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే...
వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలన్న ప్రధాన లక్ష్యంతో పాటు సాంకేతిక వ్యవసాయంతో పాటు వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రైతు వేదికలకు రూపకల్పన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,601 రైతు వేదికలను ఏర్పాటు చేసింది. ఒక్కో రైతు వేదికకు ప్రభుత్వం రూ.12 లక్షలు ఖర్చు చేసింది. మైకులు, కుర్చీలు, ఇతర మౌలిక సదుపాయాలతో వీటిని సుందరంగా తీర్చిదిద్దారు.
అయితే ఇప్పటివరకు అనుకున్నంత స్థాయిలో రైతు వేదికలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదన్న భావన సర్కారులో నెలకొంది. అందుకోసం ఇకపై అన్ని ప్రభుత్వ శాఖలు కూడా వీటిని వినియోగించుకోవాలని సూచించింది. వీటిని నిత్యం ఏదో ప్రభుత్వ కార్యక్రమం జరిగే కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నదే ప్రస్తుత నిర్ణయంలోని ఉద్దేశం.
ప్రైవేట్ కార్యక్రమాలకూ ఇవ్వాలన్న ప్రతిపాదనలు...
మండలానికి మూడు నాలుగు చొప్పున రైతు వేదికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతు వేదికలను ఆదాయ కేంద్రాలుగా మార్చాలని జిల్లాల్లోని కొందరు ప్రజాప్రతినిధులు వ్యవసాయశాఖ దృష్టికి తీసుకొచ్చారు. పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు, ఇతర శుభకార్యాలయాలకు ఇవ్వడం వల్ల ఆయా కేంద్రాలకు ఆదాయం సమకూరుతుందని, దీనివల్ల రైతు వేదికల నిర్వహణ భారం ప్రభుత్వంపై ఉండదని చెప్పుకొచ్చారు.
అయితే దీనిపై ప్రభుత్వ వర్గాల్లో మాత్రం భిన్నమైన అభిప్రాయం నెలకొంది. అలా చేయడం వల్ల ప్రభుత్వ ఉద్దేశం పక్కదారి పడుతుందని అంటున్నారు. గతంలో ఒకట్రెండు చోట్ల ప్రభుత్వం దృష్టికి రాకుండానే రైతు వేదికలను పెళ్లిళ్లకు ఇచ్చారన్న ప్రచారం జరిగింది. దీంతో ప్రస్తుతానికి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ కార్యక్రమాలు, ఫంక్షన్లకు ఇవ్వొద్దని నిర్ణయించారు.
‘రైతు వేదిక’లు ఇక ప్రజా వేదికలు
Published Mon, May 22 2023 5:52 AM | Last Updated on Mon, May 22 2023 5:52 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment