మళ్లీ యూటర్న్‌ | Farmers angry On TDP govt | Sakshi
Sakshi News home page

మళ్లీ యూటర్న్‌

Published Thu, Sep 20 2018 9:28 AM | Last Updated on Mon, Oct 1 2018 2:27 PM

Farmers angry  On TDP govt - Sakshi

తెలుగుదేశం ప్రభుత్వం ఆక్వా రైతులను మళ్లీ మోసం చేసింది. ఆక్వా చెరువులకు విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామని ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనతో హడావిడిగా తాను కూడా చార్జీలు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబునాయుడు ఆచరణలో అమలు చేయలేదు. తాజాగా జారీచేసిన జీవో ప్రకారం.. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా యూనిట్‌కు రూ.3.86 రైతులు చెల్లిస్తే... తర్వాత మత్స్యశాఖ ద్వారా రూ.1.86 వెనక్కి చెల్లిస్తామని పేర్కొనడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఆక్వా సాగు 72,945 హెక్టార్లు ఉండగా 29,922 కుటుంబాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద జరిగే సాగులో 40 శాతం వరకూ జిల్లాలోనే జరుగుతోంది. ఒకప్పుడు డాలర్లు కురిపించిన ఆక్వాసాగు నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. గిట్టుబాటు ధరలు పడిపోవడం, మరోవైపు ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడంతో అక్వా రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విదేశాలకు ఎగుమతులు తగ్గాయని, కుంటిసాకులు చెబుతూ దళారులు ధరలు తగ్గించి వేయడంతో రైతులు పూర్తిగా నష్టాలలో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో మే నెలలో జిల్లాలోని ఉంగుటూరు, ఉండి, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం ప్రాంతాలలో ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తమ ఇబ్బందులు తీసుకువెళ్లారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించి ఆక్వా చెరువులకు ఉపయోగించే విద్యుత్‌ చార్జీలను యూనిట్‌ రూ.3.80 నుంచి రూ.1.50కి, ఆక్వా అనుబంధ పరిశ్రమలకు ఏడు రూపాయల నుంచి రూ.ఐదుకు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే సముద్ర తీర ప్రాంతాల్లో కోల్డ్‌స్టోరేజి, ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పుతానని, నాలుగో ఏడాది నుంచి ఆక్వాకు మద్దతు ధర ప్రకటిస్తానని ఆయన çహామీ ఇచ్చారు.

 ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంపై జగన్‌ సీరియస్‌గా స్పందించడంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మే 26న హడావిడిగా సమావేశం ఏర్పాటుచేసి ఆక్వా వ్యాపారులు, రైతులతో చర్చించారు. విద్యుత్‌ చార్జీలు ఏడాది పాటు రూ.3.80 నుంచి రెండు రూపాయలకు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అయినా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో కరెంటు బిల్లులు యూనిట్‌ రూ.3.80 టారిఫ్‌తోనే వచ్చాయి. ప్రస్తుతం జీవో విడుదల చేస్తూ రైతులు ముందు రూ.3.86 చొప్పున బిల్లులు చెల్లిస్తే తర్వాత రూ.1.86 మత్స్యశాఖ నుంచి ఇప్పిస్తామని అందులో పేర్కొన్నారు. 

మత్స్యశాఖ ద్వారా చెల్లింపులేంటి?
వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ప్రకటన ప్రకారం 2017–18లో రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తులు రూ. 42,110 కోట్లు కాగా ప్రత్యక్ష పరోక్ష పన్నుల ద్వారా ప్రభుత్వానికి రూ.నాలుగువేల కోట్ల పైగా ఆదాయం వస్తోంది. కానీ 2018–19 బడ్జెట్‌లో మత్స్యశాఖకు కేటాయింపులు కేవలం రూ. 386 కోట్లు మాత్రమే. ఇవి మత్య్సకారుల సంక్షేమానికి సరిపోవడం లేదు. అటువంటప్పుడు మత్స్యశాఖ ద్వారా చెల్లిస్తాననడం వంచన అని ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్వాలో విద్యుత్‌ కనెక్షన్లు భూయజమానుల పేరుతో ఉన్నాయి. బిల్లులు చెల్లించేది కౌలు రైతులైతే, భూ యజమానుల ఖాతాల్లో డబ్బులు పడతాయి. 1980 నుంచి తీసుకున్న విద్యుత్‌ కనెక్షన్‌దారులు అనేక మంది చనిపోయారు. ప్రస్తుతం భూములు వారి వారసుల పేరుతో ఉన్నాయి. ఇవన్నీ క్షేత్రస్థాయిలో సమస్యాత్మకంగా మారతాయని ఆక్వారైతులు అంటున్నారు. 

ఆక్వాపై చంద్రబాబు హైడ్రామా
ఆక్వా రైతులపై చంద్రబాబు మళ్లీ డ్రామా ఆడుతున్నారు. విద్యుత్‌ చార్జీలు తగ్గించామని చెబుతూ రైతుల వద్ద నుంచి పాత బకాయిలు వసూలుకు మార్గం చూసుకున్నారు. ఓవర్‌లోడ్, ఏసీడీల పేరుతో భారీగా బిల్లులు వేసి, వాటిని చెల్లిస్తేనే రాయితీ ఇస్తాననడం సరికాదు. బిల్లు ఏక మొత్తంలో చెల్లించిన తరువాత తగ్గించిన సొమ్ము తిరిగి బ్యాంకు అకౌంట్‌లో యజమాని పేరున వేస్తాననడం విడ్డూరంగా ఉంది. చెరువులు సాగుచేసే లీజుదారులు లక్షలు వెచ్చించి రొయ్యల సాగు చేస్తున్నారు. విద్యుత్‌ బిల్లుల రాయితీల పేరుతో బకాయిలు గుంజడానికే చంద్రబాబు ఎత్తుగడ. జిల్లా వ్యాప్తంగా ఆక్వా రైతులు నష్టాలతో విద్యుత్‌ బకాయిలు పడ్డారు. తగ్గించిన సొమ్మును మినహాయించుకుని బిల్లు చెల్లించే పద్ధతి తీసుకురావాలి.
– వేగేశ్న వెంకట్రాజు (యండగండి శ్రీను), ఆక్వా రైతు, చినకాపవరం

రాయితీ పేరుతో భారీ మోసం
విదేశీ మారక ద్రవ్యం తెచ్చిపెట్టే ఆక్వా రైతుపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు. రొయ్యల రైతుల విద్యుత్‌ బకాయిలు ముక్కుపిండి వసూలు చేసేందుకు విద్యుత్‌ బిల్లుల రాయితీలు ప్రకటించారు. విద్యుత్‌ బిల్లులో తగ్గించిన యూనిట్‌ ధరను యథావిధిగా ఎందుకు వసూలు చేయరు. డొంకదారుల్లో రాయితీలు ఇస్తాననడం చంద్రబాబు వంచన యోచనలో భాగం. యూనిట్‌కు రూ.1.86 పైసలు తగ్గించినట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ సొమ్మును బిల్లులోనే తగ్గించి చెల్లించే విధంగా రైతులకు అవకాశం కల్పించాలి. పాత బకాయిల పేరుతో చార్జీలు తగ్గించకపోవడం దారుణం.
– గొట్టుముక్కల సూర్యనారాయణరాజు (సూరిబాబు), 
ఆక్వా రైతు, ఆకివీడు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement