తెలంగాణకు ‘రసాయన’ ముప్పు!
♦ వ్యవసాయశాఖ మంత్రి పోచారం
♦ రాంపూర్‌లో ‘మన తెలంగాణ - మన వ్యవసాయం’ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రానికి రసాయన ఎరువుల వాడకం వల్ల ప్రమాదం పొంచి ఉందని, ఇకనైనా సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రసాయనిక ఎరువుల వాడకంలో మన రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందని, మొదటి స్థానంలో పంజాబ్ ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా నవీ పేట మండలం రాంపూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25 నుంచి వచ్చే నెల 5 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘మన తెలంగాణ-మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకంలో మొదటి స్థానంలో ఉన్న పంజాబ్‌లో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని, పంజాబ్ నుంచి ఢిల్లీకి చికిత్స నిమిత్తం రోగులు రైలులో వెళ్లగా ఆ రైతులకు క్యాన్సర్ ఎక్స్‌ప్రెస్ అని పేరొచ్చిందని చెప్పారు. భూసార పరీక్షలపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. రాష్ట్రంలోని కోటి ఎకరాల భూమికి 10 లక్షల యూనిట్లుగా విభజించి భూసా ర పరీక్షలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. భూసార పరీక్ష అనంతరం రైతులకు భూసార మట్టి పరీక్షా పత్రాన్ని అందిస్తామని తెలిపారు.