
ఫసల్‌బీమా వర్తింపజేయాలి
► వేరుశనగ రైతులను ఆదుకోవాలి
► రైతుసంఘం నాయకుల డిమాండ్
► సీపీఐ ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మ దహనం
అనంతపురం అగ్రికల్చర్/ అర్బన్ : ఫసల్ బీమా యోజనను వేరుశనగ పంటకు వర్తింపజేయకపోవడంపై వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ అనుబంధ రైతుసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా వేరుశనగ సాగు చేసే జిల్లా అనంతపురమని, ఇక్కడ తరచూ కరువు పరిస్థితుల వల్ల రైతులు పంట నష్టపోతూనే ఉన్నారని పేర్కొన్నాయి. ప్రస్తుతమున్న వాతావరణ ఆధారిత పంటల బీమా వల్ల రైతులకు ఎటువంటి ఉపయోగమూ లేకుండా ఉందని తెలిపాయి.
ఈ పరిస్థితుల్లో అంతోఇంతో ప్రయోజనం ఒనగూరే ఫసల్‌బీమాను వేరుశనగ పంటకు వర్తింపజేయాల్సిందేనని ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. జిల్లాలో భారీస్థాయిలో పరిహారం అందించాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే వేరుశనగ పంటను బీమా జాబితా నుంచి తప్పించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకులేడు రామచంద్రారెడ్డి విమర్శించారు. ఫసల్‌బీమా వర్తింపజేయకపోతే జిల్లా రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. అంతేకాకుండా వాతావరణ బీమా పథకాన్నే కొనసాగిస్తూ ప్రీమియం మొత్తాన్ని రూ.530 నుంచి రూ.750కు పెంచేశారని, ఇది రైతులపై మరింత భారం మోపడమేనని ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ఫసల్‌బీమా యోజనలో వేరుశనగ పంటను చేర్చకపోవడాన్ని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని టవర్‌క్లాక్ వద్ద కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పథకంలో వేరుశనగని చేర్చేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ డిమాండ్ చేశారు. జిల్లాలో ఏ పంట ప్రధానంగా పండిస్తున్నారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోకుండా వేరుశనగ పంటని బీమా నుంచి మినహాయించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామి, నగర కార్యదర్శి లింగమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫసల్‌తో భరోసా కల్పించాలి
వరుస కరువులతో కుదేలవుతున్న వేరుశనగ రైతులకు ఫసల్ బీమా యోజన వర్తింపజేసి భరోసా కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లాలో అత్యధికంగా పండించే వేరుశనగని ఫసల్ బీమాలో చేర్చకుండా పత్తిపంటను చేర్చడం వెనుక ఉద్దేశం ఏమిటో స్పష్టమవుతోందన్నారు. దీనిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించాలన్నారు.
ఫసల్ బీమాలో వేరుశనగను చేర్చాలి
ఫసల్ బీమా యోజనలో వేరుశనగ పంటని చేర్చాలని సీపీఎం అనుబంధ ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. బుధవారం స్థానిక గణేనాయక్ భవన్‌లో సంఘం నాయకులతో కలిసి జిల్లా కార్యదర్శి పి.పెద్దిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. వేరుశనగని ఫసల్ బీమా యోజనలో చేర్చితే రైతుకు న్యాయం జరుగుతుందన్నారు. పథకంలో వేరుశనగ పంట చేర్చే విషయంపై జిల్లా మంత్రులు స్పందించాలన్నారు. సమావేశంలో సహాయ కార్యద ర్శులు జంగాలపల్లి పెద్దన్న, చంద్రశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు తలారి రామాంజినేయులు, నాగేశ్, కదిరప్ప, తదితరులు పాల్గొన్నారు.