సాక్షి, హైదరాబాద్: రానున్న ఖరీఫ్, రబీ సీజన్(2019–20)కు కలిపి రాష్ట్ర వ్యవసాయ శాఖ పంటల బీమా నోటిఫికేషన్‌ను ఇటీవల జారీ చేసింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం(పీఎంఎఫ్‌బీవై), పునరుద్ధరించిన వాతావరణ పంటల బీమా పథకం(ఆర్‌డబ్ల్యూసీఐఎస్) అమలుకు క్లస్టర్లవారీగా 2 బీమా ఏజెన్సీలను ఖరారు చేసింది. ఇందులో ఇఫ్‌కో టోక్యో జీఐసీ, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఏఐసీ) కంపెనీలున్నాయి. 11 జిల్లాల్లో ఇఫ్‌కో టోక్యో జీఐసీ బీమా(రెండు క్లస్టర్లు) కంపెనీ, 21 జిల్లాల్లో ఏఐసీ(ఆరు క్లస్టర్లలో) పంటల బీమాను అమలు చేయనున్నాయి. సమగ్ర బీమా పథకం(యూపీఐఎస్)ను ప్రయోగాత్మకంగా నిజామాబాద్‌లో అమలు చేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ప్రధానంగా వాతావరణ ఆధారిత బీమా కింద పైల ట్ ప్రాజెక్టులో భాగంగా టమాటా పంటకు బీ మా సౌకర్యం కల్పించారు. రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో దీనిని అమలు చేస్తున్నారు.
మామిడి పంటకు కూడా ఆర్‌డబ్ల్యూసీఐఎస్ కింద బీమా ఇవ్వనున్నారు. పంటకోతలో భాగంగా వర్షాలు, వడగండ్లతో నష్టం వస్తే కూడా బీమా వర్తిస్తుందని స్పష్టం చేశారు. పంటల బీమా అమలు చేసే కంపెనీలు కచ్చితంగా ప్రతి సీజన్‌లో 10% నాన్ లోన్ రైతులను బీమా కవరేజీలోకి తీసుకురావాలన్నారు. కామన్ సర్వీస్ సెంటర్, మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పంట పేరు మార్చుకునేందుకు గడువు తేదీ కంటే 2 రోజుల ముందు వరకు రైతులకు అవకాశం కల్పించారు. హఠాత్తు వర్షాలకు, మెరుపుతో వచ్చే పిడుగుల కారణంగా నష్టం వాటిల్లినా బీమా పరిహారం ఇవ్వనున్నారు.
ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ కింద వానాకాలంలో మిర్చి, పత్తి, పామాయిల్, బత్తాయి, టమాటా పంటలను గుర్తించగా, యాసంగిలో మామిడి పంటలను గుర్తించింది. వానాకాలం ఆర్‌డబ్ల్యూసీఐఎస్‌ను ఖమ్మం, భద్రాద్రి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, జోగుళాంబ, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో, పత్తి 32 జిల్లాల్లో, పామాయిల్ పంటకు ఖమ్మం, భద్రాద్రి, బత్తాయి పంటకు నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల, యాదాద్రి, టమాటా పంటకు రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో అమలు చేయనున్నారు. యాసంగిలో ఆర్‌డబ్ల్యూసీఐఎస్ కింద మామిడి పంటకు 32 జిల్లాలు, టమాటా కింద ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలను వ్యవసాయ శాఖ గుర్తించింది.
ఖరీఫ్ వరి ఆగస్టు 31, పత్తికి జూలై 15
ఖరీఫ్, రబీ సీజన్‌లో పీఎంఎఫ్‌బీవై, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ వివిధ పంటలకు బీమా ప్రీమియం చెల్లించే గడువు తేదీలను నిర్ణయించారు. త్వర లో ప్రారంభం కానున్న ఖరీఫ్‌లో వరి పంటకు ఆగస్టు 31లోగా బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. జొన్న, మొక్కజొన్న, కందులు, పెసర్లు, మినుములు, వేరుశనగ, సోయాబీన్, పసుపు పంటలకు జూలై 31లోగా ప్రీమియం చెల్లించాలి. ఆర్‌డబ్ల్యూబీసీ ఐఎస్ పథకం కింద మిర్చి పంటకు ఆగస్టు 31లోగా, పత్తి పంటకు జూలై 15లోగా, పామాయిల్ పంటకు జూలై 14లోగా, బత్తాయి పంటకు ఆగస్ట్ 9, టమాటా పంటకు ఆగస్టు 31వ తేదీలోగా పంటల బీమా ప్రీమియం చెల్లించాలి.
యాసంగిలో ఇలా..
2019 యాసంగికి పీఎంఎఫ్‌బీవై కింద శనగ పంటకు నవంబర్ 30లోగా, మొక్కజొన్న పంటకు డిసెంబర్ 15లోగా, వరి, జొన్న, పెసర, మినుములు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఉల్లి, మిర్చి, నువ్వుల పంటలకు డిసెంబర్ 31లోగా రైతులు నమోదు చేయించుకోవాలి. ఆర్‌డబ్ల్యూసీఐఎస్ పథకం కింద టమాటా పంటకు నవంబర్ 30లోగా, మామిడి పంటకు డిసెంబర్ 31లోగా రైతులు ప్రీమియం చెల్లించాలని వ్యవసాయశాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
రెండు సీజన్లకు కలిపి పంటల బీమా
Published Sun, May 5 2019 2:14 AM | Last Updated on Sun, May 5 2019 2:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment