![Transfer of Investment Assistance money on 24th - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/19/FARMER-16.jpg.webp?itok=MXRKHql9)
సాక్షి, హైదరాబాద్: ‘పీఎం–కిసాన్’ పథకం కింద తొలి విడతలో రాష్ట్రంలోని 10 లక్షల మంది రైతు కుటుంబాలకే పెట్టుబడి సాయం అందనున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 20 నాటికి ఈ వివరాలను పీఎం–కిసాన్ వెబ్‌సైట్‌లో నోడల్ శాఖగా ఉన్న రాష్ట్ర వ్యవసాయశాఖ అప్‌లోడ్ చేయనుంది. తొలి దఫా పెట్టుబడి సాయాన్ని ఈ నెల 24న రైతుల బ్యాంకుల ఖాతాలో వేస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ రైతులందరికీ తొలి విడత సాయం కింద రూ. 2 వేల వంతున వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరనుంది.
వ్యవసాయశాఖ కసరత్తు..: పీఎం–కిసాన్ పథకానికి అర్హులను గుర్తించేందుకు వ్యవసాయశాఖ ప్రభుత్వ శాఖల సహకారం తీసుకుంది. ఫిబ్రవరి 1 వరకు అందుబాటులో ఉన్న భూరికార్డుల వివరాలను రాష్ట్ర వ్యవసాయశాఖ తెప్పించుకుంది. అందు లో 52.91 లక్షల మంది రైతులున్నారు. కుటుంబం యూనిట్‌గా లెక్కతీసేందుకు వీటన్నింటిని పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్న రేషన్ కార్డుల సమాచారంతో పోల్చిచూశారు. దీనిలో వ్యక్తిగత పట్టాదా రులై, రేషన్ కార్డులు గల వారి సంఖ్య 43.81 లక్షలుగా గుర్తించారు. మిగతా 9.10 లక్షల మంది రైతులకు రేషన్ కార్డులు లేకపోవడంతో వారిని పింక్ కార్డుదారులుగా గుర్తించి, అనర్హులుగా తేల్చారు. దీంతో తెల్ల రేషన్ కార్డులు గల రైతుల సంఖ్య 32.12లక్షలుగా తేలింది. ఇందులోన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 7 వేల మంది, 10 వేలు, ఆపైన పింఛన్ తీసుకుంటున్న వారి సంఖ్య 2 వేలుగా గుర్తించారు. ఈ పథకానికి అర్హులైన రైతుల కుటుంబాలను 26.31 లక్షలుగా గుర్తించారు. ఇందులో ఒకే పట్టాదారు పుస్తకం గల కుటుంబాల సంఖ్య 23.08 లక్షలు కాగా, ఒకటి కంటే ఎక్కువున్న కుటుంబాల సంఖ్య 3.23 లక్షలుగా తేలింది.
జాబితాపై గ్రామసభలు: అర్హులై ఒకే పట్టాదారు ఉన్న రైతుల వివరాలను గ్రామసభల్లో ప్రదర్శించి అధికారులు మరోసారి సరిచూస్తున్నారు. ఇందులోనే ఈ నెల 20 కల్లా 10లక్షల మంది రైతుల వివరాలను కేంద్ర వ్యవసాయ శాఖకు అప్‌లోడ్ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. అర్హులై ఒకే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ పట్టాదారులు ఉన్నట్లయితే వారి జాబితాను తర్వాత ప్రచురించి, వివరాలు సరిచూస్తామన్నారు. 9–10 లక్షల మంది పింక్ రేషన్ కార్డుదారుల వివరాలపై గ్రామసభల ద్వారా అర్హులను గుర్తిస్తామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment