బరువైందా... అంటూ బాబుకు బాజా! ఏది నిజం? | Eenadu Fake News On Pradhan Mantri Fasal Bima Yojana AP Govt | Sakshi
Sakshi News home page

బరువైందా... అంటూ బాబుకు బాజా! ఏది నిజం?

Published Wed, Aug 10 2022 5:00 AM | Last Updated on Wed, Aug 10 2022 7:01 AM

Eenadu Fake News On Pradhan Mantri Fasal Bima Yojana AP Govt - Sakshi

‘‘రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఫసల్‌ బీమా యోజనలో భాగస్వామి కావాల్సిందిగా నేనే స్వయంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఫోన్‌ చేసి అడిగాను. కేంద్ర బృందాన్ని కూడా ఏపీకి పంపించి అక్కడ అమలవుతున్న ఉచిత పంటల బీమా పథకాన్ని అధ్యయనం చేయించాం. నోటిఫైడ్‌ పంటలు సాగు చేస్తున్న రైతులందరికి బీమా వర్తింప చేసేలా ఫసల్‌ బీమా యోజనలో కొన్ని మార్పులను సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. ఆయన సూచనల మేరకు రైతులందరినీ బీమా పరిధిలోకి తీసుకొస్తున్నాం. అందుకు ఉన్న అడ్డంకులను తొలగించాం. ఈ–క్రాప్‌ డేటా ఆధారంగా ఏపీలో ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇదే డేటాను మేం కూడా ప్రామాణికంగా తీసుకుని, నోటిఫైడ్‌ పంటలు సాగు చేసే రైతులందరికీ వర్తింప చేసేలా ఫసల్‌ బీమా యోజనలో మార్పులు చేస్తున్నాం.’’ 

– ఫసల్‌ బీమాపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ 

‘ఈనాడు’ ఇప్పుడు ఏ స్థితిలో ఉంది? చెప్పటం కష్టం. ఎందుకంటే చంద్రబాబుకు మేలు చేయాలనే ఏకసూత్ర అజెండా అమలు చేయటంలో అడ్డూఅదుపూ కోల్పోయింది. నిజాలు నిస్సిగ్గుగా గాలికొదిలేసింది. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ప్రతి అంశాన్నీ తాము సృష్టించిన ఎల్లో అద్దంలో చూపిస్తోంది. జనంలో అపోహలు సృష్టించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. వరద బాధితులకు సాయం విషయంలోనైనా... రైతులకు ముందెన్నడూ లేని తీరులో అందుతున్న పంటల బీమా విషయంలోనైనా... దేన్లోనైనా ఇదే తీరు. ఇదంతా చూశాక ఇప్పుడో కొత్త సామెత చెప్పుకోవాల్సి వస్తోంది. రాసేవాడు రామోజీరావు అయితే... చదివే వాడు చంద్రబాబే అని!!. కాకపోతే ‘ఈనాడు’ పత్రిక చదివే వాళ్లంతా చంద్రబాబులు కారుగా? తమ సంతోషం కోసం రాశారని చూసి మురిసిపోవటానికి!!. పాఠకులకు నిజాలు కావాలి కదా? ఇంకెప్పుడు చెబుతారు రామోజీరావుగారూ వాస్తవాలు? వృద్ధాప్యంలోనైనా మారరా? 

‘బీమా బరువైందా?’ అని ప్రశ్నిస్తూ మంగళవారం ఉదయం ఓ పేద్ద కథనాన్ని వండేసింది ‘ఈనాడు’. రెండేళ్లకే సర్కారు మడమ తిప్పేస్తోందని, మళ్లీ కేంద్ర పథకాల్లో చేరుతోందని... ఇదంతా కేంద్ర నిధుల కోసమేనని పాపం తెగ ఆందోళనకు గురైంది. దాంతోపాటు... ఇలా కేంద్ర పథకాల్లో చేరితే అప్పట్లో ఉన్న లోపాలను అధిగమించేదెలా? అంటూ మథనపడిపోయింది కూడా!!. ఇక్కడ రామోజీ తెలిసో తెలియకో ఒప్పుకున్న నిజం ఒకటుంది. అది.. అప్పట్లో లోపాలున్నాయని!! కాబట్టే రెండేళ్ల కిందట వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కేంద్ర బీమా పథకం నుంచి బయటకు వచ్చి కొత్త బీమా పథకాన్ని తీసుకువచ్చిందని. దీంతోపాటు.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రైతుల కోసం చాలా బరువును మోస్తోందన్న విషయాన్ని కూడా రామోజీరావు చెప్పకనే చెప్పారు. 

ఇక్కడ రామోజీ సమాధానమివ్వాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఏం! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఈ కేంద్ర పథకం బాగులేదని, రాష్ట్ర రైతులకు మేలు చేయాలంటే దీంతో సాధ్యం కాదని రామోజీ ఎందుకు సలహా ఇవ్వలేదు? పోనీ తన పత్రికలో కథనాలెందుకు రాయలేదు? ఈ రెండేళ్లుగా జగన్‌ ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులతో పంటల బీమా అమలు చేస్తోందని ఏ ఒక్కరోజూ ఎందుకు రాయలేదు? ఇపుడు వాస్తవమేంటన్నది చెప్పకుండా ఈ నిందలెందుకు? అసలు మీ పాత్ర ఏంటి రామోజీ? ప్రతిపక్ష పాత్రా..? లేక ప్రతినాయకుడి పక్ష పాత్రా? మీదిప్పుడు రాసే పాత్ర కాబట్టి పాఠకులతో సహా ఎవ్వరికీ సమాధానం ఇవ్వక్కర్లేదనుకోవచ్చు. కానీ మీకు మీరైనా జవాబు చెప్పుకోవాలి కదా ఈ రోత రాతలకు!!. 

చంద్రబాబు చేయలేదెందుకు? 
ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై)తో బీమా సంస్థలకే లబ్ధి చేకూరుతోందని, ఒక సీజన్లో పంట నష్టం జరిగితే రెండు సీజన్లు ముగిసినా పరిహారం అందటం లేదని అందుకే బీహార్, గుజరాత్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో సొంత పథకాలు అమలు చేస్తున్నారని ‘ఈనాడు’ వాకృచ్చింది. రెండేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్‌ కూడా వైఎస్సార్‌ పంటల బీమా తీసుకొచ్చిందని రాసుకొచ్చింది. కాకపోతే ఘనత వహించిన ఇంటిమనిషి చంద్రబాబు నాయుడుకి ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదో ఎప్పుడూ రాయదు. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకాన్ని పూర్తి ఉచితంగా అమలు చేస్తున్నట్లు కూడా ఎక్కడా ఒక్క అక్షరం ముక్క కూడా రాయదు ‘ఈనాడు’. నిజానికి గతంలో ఇది కేంద్ర పథకంగా ఉండేటపుడు పంటను బట్టి ప్రీమియాన్ని నిర్ణయించాక ప్రీమియంలో 2 శాతాన్ని రైతులే చెల్లించేవారు.

బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకులే ఈ మొత్తాన్ని మినహాయించేసి బీమా చేయించేవి. మిగిలిన రైతులకు బీమా గురించి తెలిసేదే కాదు. ప్రకృతి వైపరీత్యాలతో వారు నష్టపోతే.. వారికి బీమాయే లేదు కాబట్టి ప్రభుత్వం చేతులెత్తేసేది. బీమా ఉన్నవారికి కూడా ఒక సీజన్లో నష్టం జరిగితే రెండు మూడు సీజన్లు గడిచాక పరిహారం వచ్చేది. ఇదిగో... ఇలాంటి పరిస్థితులకు తావివ్వకూడదన్న ఉద్దేశంతోనే... రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేరుగా పంటల బీమా అమలు చేయాలని సంకల్పించారు వైఎస్‌ జగన్‌.

అందుకే కేంద్ర పథకం నుంచి బయటకు వచ్చేసి... ఈ–క్రాప్‌ను సమర్థంగా అమలు చేస్తూ... పంట నమోదు చేయించుకున్న ప్రతి రైతుకూ పరిహారం అందేలా చూస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యం... ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్‌ ముగియక ముందే పరిహారం ఇవ్వటం. తద్వారా తదుపరి సీజన్‌కు ఆ రైతుకు ఇబ్బంది లేకుండా చేయటం. అదీ ఉద్దేశం. అందుకే ఇది రైతు ప్రభుత్వమయ్యింది. అలాంటి ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు వదిలేస్తుందా? బీమా పథకం బరువైపోయింది కాబట్టి కేంద్రానికి అప్పగించేస్తుందా? ఆ మాత్రం ఆలోచించాలి కదా రామోజీరావు గారూ? అసలు ఖరీఫ్‌ సీజన్లో జరిగిన నష్టాన్ని మళ్లీ ఖరీఫ్‌ మొదలు కాకముందే ఇవ్వటమనేది మీ జన్మలో చూశారా? చంద్రబాబు ఈ దిశగా ఆలోచనైనా చేశారా?  


టీడీపీ హయాంలో జరిగింది ఇదీ... 
చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో సగటున ఏడాదికి 20.28 లక్షల మంది రైతులు, 23.57 లక్షల హెక్టార్లకు మాత్రమే బీమా చేయించుకోగలిగారు. 2014–16 మధ్య వ్యవసాయ బీమా పథకం కింద 5.38 లక్షల మందికి రూ.471.94 కోట్లు,  2016–19 మధ్య పీఎంఎఫ్‌బీవై కింద 25.47 లక్షల మందికి రూ.2939.26 కోట్ల బీమా మొత్తాన్ని అందించారు. మొత్తంగా ఐదేళ్లలో కేంద్ర బీమా పథకాల ద్వారా రూ.341 కోట్ల పరిహారాన్ని అందించారు. కానీ కేంద్ర పథకంలో ఉన్న పరిమితులతో రైతులు నష్టపోతున్నారని భావించిన వై.ఎస్‌.జగన్‌ సర్కారు.. నోటిఫైడ్‌ పంటలు సాగు చేసే రైతులందరికీ బీమా వర్తింప చేయాలని డిమాండ్‌ చేసింది. ప్రీమియం చెల్లించిన వారికే ఇస్తామని కేంద్రం చెప్పడంతో ఆ పథకం నుంచి బయటకొచ్చేసింది.

2019 జూలై 8న డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చారు జగన్‌. ఈ–క్రాప్‌లో పంట నమోదు చేసుకున్న ప్రతి రైతుకూ బీమా వర్తించేలా... ఆర్‌బీకేల్లోనే నామమాత్రంగా రూ.10 తీసుకుని రసీదు కూడా ఇస్తున్నారు. ఆ రసీదు.. ఈ–క్రాప్‌లో నమోదు చేసినట్లు రైతుకు ఇచ్చే అధికారిక గుర్తింపు. దాని ఆధారంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకూ నేరుగా  సీజన్‌ మారకముందే పరిహారం అందుతోంది. ఇందులో రైతు వాటాతో పాటు కేంద్రం వాటానూ రాష్ట్రమే భరిస్తుండగా... గతంతో పోలిస్తే బీమా పరిధిలోకి వచ్చిన రైతుల సంఖ్య కూడా ఏకంగా 167.04 శాతం పెరిగింది.

2018–19లో 6.19 లక్షల మందికి చెల్లించాల్సిన రూ.715.84 కోట్ల మొత్తాన్ని 2019లో వై.ఎస్‌.జగన్‌ ప్రభుత్వమే చెల్లించింది. టీడీపీ ఐదేళ్లలో రూ.30.85 లక్షల మందికి రూ.3411.20 కోట్లు బీమా దక్కితే గడిచిన మూడేళ్లలో 44.28 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.6684.84 కోట్ల బీమా సొమ్ములు అందాయి. చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఖరీఫ్‌– 2021–22 సీజన్‌కు సంబంధించి 15.61 లక్షల మందికి రూ.2977.82 కోట్లు బీమాగా అందజేసింది. ఇవీ రాయని, రాయాలనుకోని వాస్తవాలు!!.  

బీమా లైసెన్స్‌ కోసం ప్రయత్నాలు... 
బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని భావించటంతో పాటు... దీనికోసం శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావించారు ముఖ్యమంత్రి జగన్‌. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓ బీమా కంపెనీ ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. దీనికి బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏ) లైసెన్సు ఇవ్వాల్సి ఉంటుంది. పదేపదే దీనికోసం అభ్యర్థనలు చేయటంతో పాటు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో పెండింగ్‌ అంశాలు మాట్లాడిన ప్రతిసారీ దీన్ని ప్రస్తావించారు. త్వరలో లైసెన్స్‌ వచ్చే అవకాశాలూ లేకపోలేదు. అయితే ఈ మధ్యలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నేరుగా సీఎం జగన్‌కు ఫోన్‌ చేసి... కేంద్ర పథకంలో భాగస్వామిగా ఉండాలని కోరారు.

ఈ పథకం నుంచి ఎందుకు బయటకు వచ్చేశారో అడగటంతో పాటు... లోటుపాట్లు ఉంటే చెప్పాలని, సవరించుకుంటామని కూడా అడిగారాయన. అనంతరం కేంద్ర బృందాన్ని కూడా పంపించారు. ఇక్కడి అధికారులతో సమావేశమైన ఆ బృందం... ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలేమిటనేది అడిగి తెలుసుకుంది. ఈ–క్రాప్‌లో నమోదైన ప్రతి రైతుకూ పంట దెబ్బతిన్న పక్షంలో బీమా పరిహారం అందటం... ఏ సీజన్లో జరిగిన నష్టానికి పరిహారాన్ని అదే సీజన్లో అందించటమనేవి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన డిమాండ్లు కాగా... ఆ రెండింటికీ కేంద్రం అంగీకరిస్తోంది.

ఆ మేరకు చట్టానికి సవరణలు చేసే పనిలోనూ పడింది. అవన్నీ పూర్తయితే రైతుకు ఇప్పటి మాదిరే పరిహారానికి ఎలాంటి ఢోకా ఉండదు. మరప్పుడు ఇబ్బంది ఏముంటుంది? అయినా రైతు డబ్బులే చెల్లించాల్సిన అవసరం లేనప్పుడు కేంద్ర పథకానికి దరఖాస్తు చేసుకునే గడువు ముగిసిపోతోందని రామోజీ ఎందుకంత బాధపడిపోతున్నారో అర్థం కాదు. పైపెచ్చు కేంద్ర పథకంలో చేరినా కూడా ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న డేటా ప్రకారమే... అంటే ఇప్పటి మాదిరిగానే రైతులకు పరిహారం అందుతుంది.

మరప్పుడు ‘ఈనాడు’కొచ్చిన కష్టమేంటి? రైతుకు బీమా సొమ్ము ముఖ్యం తప్ప... ఆ డబ్బులు బీమా సంస్థ నుంచి వస్తున్నాయా? కేంద్రం నుంచి వస్తున్నాయా? రాష్ట్రం నుంచి వస్తున్నాయా? అనేది కాదుకదా!!. మూడేళ్లుగా రైతుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న ప్రభుత్వానికి ఆ మాత్రం తెలియదనుకోవాలా? ఇకనైనా ఇలాంటి అర్థంపర్థం లేని వార్తలు అచ్చేయటం ఆపండి రామోజీరావుగారూ!! 

బీమా బరువేమీ కాదు... 
పైసా భారం లేకుండా, ఈ–పంట నమోదు ప్రామాణికంగా మూడేళ్లుగా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం. మనం అమలు చేస్తోన్న ఈ–పంట నమోదు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం, ఈ డేటా ఆధారంగా పీఎంఎఫ్‌బీవై పథకాన్ని అమలు చేయడానికి ముందుకొచ్చింది. కేంద్రం అభ్యర్థన మేరకు సాధ్యా, సాధ్యాలను బేరీజు వేసుకొని మన బీమా పథకాన్ని పీఎంఎఫ్‌బీవైతో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2022–23 సీజన్‌ కోసం బీమా కంపెనీల ఎంపికకు టెండర్‌ ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తాం.

ఈ పంటలో నమోదు, ఈ కేవైసీ పూర్తయిన తర్వాత రైతులకు ఇచ్చే రసీదులో బీమా చేసిన పంట పేరు, విస్తీర్ణం వివరాలు పొందుపరుస్తాం. వారి వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. 2023 జూన్‌లోగా ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ బీమా పరిహారం, 2023 అక్టోబర్‌ 15లోగా రబీ–2022–23 సీజన్‌ బీమా పరిహారం చెల్లించేలా విధి విధానాలు రూపొందిస్తున్నాం. పంటల బీమా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.     
– చేవూరి హరికిరణ్,స్పెషల్‌ కమిషనర్, వ్యవసాయ శాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement