చంద్రబాబు కుట్రలు, కుంభకోణాలకు ‘ఈనాడు’ అండ
‘మార్గదర్శి’ అక్రమ డిపాజిట్ల దందాకు బాబు రక్షణ
అక్రమ డిపాజిట్లపై కుట్రపూరిత మౌనం అందుకే
అటు తెలంగాణ ప్రభుత్వానిదీ అదే వ్యూహాత్మక మౌనం
సాక్షి, అమరావతి: అసలు సిసలైన క్విడ్‌ప్రోకో అంటే ఇదే..! చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు, కుంభకోణాలకు ఈనాడు కొమ్ము కాస్తోంది. అందుకు ప్రతిగా ఆ పత్రిక యాజమాన్యం అక్రమ ఆర్థిక సామ్రాజ్యం మార్గదర్శి ఫైనాన్సియర్స్ అవకతవకలకు చంద్రబాబు సర్కారు రక్షణగా నిలుస్తోంది!! అందుకే ‘మార్గదర్శి’ అక్రమ డిపాజిట్లపై న్యాయస్థానంలో తమ వైఖరి తెలిపేందుకు ససేమిరా అంటోంది. కుట్రపూరితంగా మౌనం పాటిస్తూ సామాన్య డిపాజిట్‌దారుల ప్రయోజనాలను గాలికొదిలేస్తోంది. మార్గదర్శి యాజమాన్యంతో కుమ్మక్కు కుట్రలో ఇటు చంద్రబాబు సర్కారు అటు తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడబలుక్కున్నట్లు ఒకే రీతిలో వ్యవహరిస్తున్నాయి.
బాబు కుట్రపూరిత మౌనం.. ‘మార్గదర్శి’కి వత్తాసు
మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందాకు చంద్రబాబు ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది. ఆ కేసు విచారణను తీవ్ర జాప్యం చేసేలా వ్యవహరిస్తుండటమే అందుకు నిదర్శనం. ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట ఈనాడు రామోజీరావు కుటుంబం యథేచ్ఛగా సాగించిన అక్రమ డిపాజిట్ల దందా ఆధారాలతో సహా బట్టబయలైన విషయం తెలిసిందే. మార్గదర్శి పేరుతో ఏకంగా రూ.2,600 కోట్లకుపైగా అక్రమ డిపాజిట్లు సేకరించారని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది.
ఈ నేపథ్యంలో ఆ అక్రమ డిపాజిట్లపై విచారణ నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. అంతేకాదు.. ఏపీ, తెలంగాణలో మార్గదర్శి డిపాజిట్‌దారుల ప్రయోజనాలను పరిరక్షించాలని స్పష్టం చేసింది. అందుకోసం మార్గదర్శి అక్రమ డిపాజిట్ల అంశంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమ వైఖరిని తెలంగాణ హైకోర్టుకు వెల్లడించాలని పేర్కొంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆర్బీఐ తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కారు దీనిపై స్పందించలేదు. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది మంగళవారం తెలంగాణ హైకోర్టులో ఈ కేసు విచారణకు హాజరైనా పూర్తిగా మౌన ప్రేక్షకపాత్రకే పరిమితం కావడం గమనార్హం.
తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కూడా మౌనమే వహించారు. ఇదే అదునుగా ‘మార్గదర్శి’ తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఈ కేసు విచారణను సాగదీసేందుకు ఎత్తుగడ వేశారు. ‘మార్గదర్శి’ సేకరించినవి అక్రమ డిపాజిట్లేనన్న ఆర్‌బీఐ అఫిడవిట్‌పై తమ వైఖరిని వెల్లడించేందుకు సమయం కావాలని కోరారు. దీంతో తెలంగాణ హైకోర్టు ఈ కేసు విచారణను సెప్టెంబరు 11కు వాయిదా వేసింది. మార్గదర్శి అక్రమ డిపాజిట్ల అంశంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమ వైఖరిని తెలియచేస్తూ రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
కోర్టులు క్రియాశీలం.. ప్రభుత్వాలు ఉదాశీనం
‘మార్గదర్శి’ అక్రమ డిపాజిట్ల వ్యవహారంపై న్యాయ వ్యవస్థ క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. అక్రమ డిపాజిట్ల వ్యవహారం నిగ్గు తేలాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డిపాజిటర్ల పేర్లు, డిపాజిట్ల వివరాలను జిల్లాల వారీగా ప్రకటించాలని.. ఎంతమందికి డిపాజిట్లు వెనక్కి ఇచ్చారో పరిశీలించాలని కూడా ఆదేశించడం గమనార్హం. ఆరు నెలల్లో ఈ కేసు విచారణను పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టుకు నిర్దేశించింది. ఈ క్రమంలో ‘సుప్రీం’ ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు ఈ కేసు విచారణను సత్వరం చేపట్టింది. కాగా ‘మార్గదర్శి’ డిపాజిట్లు చట్టవిరుద్ధమేనని ఆర్బీఐ తెలంగాణ హైకోర్టుకు లిఖితపూర్వకంగా వెల్లడించింది.
ఈ కేసులో న్యాయస్థానాలు, ఆర్బీఐ చురుగ్గా వ్యవహరిస్తుండగా డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి ఉదాశీన వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. ‘మార్గదర్శి’ డిపాజిటర్ల వివరాలను జిల్లాలవారీగా ప్రకటిస్తామని, వారికి డిపాజిట్ల మొత్తం చెల్లించారో లేదో పరిశీలిస్తామని, ఎంతమందికి డిపాజిట్లు తిరిగి చెల్లించారు? ఎంతమందికి చెల్లించ లేదు? అనే అంశాలపై వాస్తవాలు తెలుసుకుని తెలంగాణ హైకోర్టుకు వెల్లడిస్తామని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పాల్సి ఉంది.
క్షేత్రస్థాయిలో ఆ బాధ్యతను నిర్వర్తించాల్సింది ఈ రెండు ప్రభుత్వాలే. అయితే ఆ మాట చెప్పేందుకు ఇటు చంద్రబాబు ప్రభుత్వానికిగానీ అటు రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి గానీ మనస్కరించడం లేదు. మార్గదర్శి యాజమాన్యానికి పరోక్షంగా సహకరించాలనే ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
నాడు కొట్టివేతకు బాబు ప్రభుత్వ సహకారం
కేసును నిలబెట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
1995 నుంచి 2004 వరకు చంద్రబాబు సర్కారు అండతోనే ఈనాడు అధిపతి చెరుకూరి రామోజీరావు (ఇటీవల మరణించారు) ఉమ్మడి ఏపీలో యథేచ్చగా అక్రమ డిపాజిట్ల దందా సాగించారు. దీనిపై 2006లో నాటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఫిర్యాదు చేయడంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో రామోజీ వసూలు చేసినవి అక్రమ డిపాజిట్లేనని ఆర్బీఐ స్పష్టం చేయడంతో ఆయన అనివార్యంగా మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను మూసివేశారు. సేకరించిన డిపాజిట్ల మొత్తాన్ని డిపాజిట్‌దారులకు చెల్లించేసినట్లు చెప్పారు.
అయితే సేకరించిన డిపాజిట్లు, డిపాజిట్‌దారుల వివరాలు, వారికి తిరిగి చెల్లించిన మొత్తం వివరాలను వెల్లడించాలని కోరుతూ ఉండవల్లి అరుణ్‌కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైఎస్సార్ హఠాన్మరణం అనంతరం అధికారంలోకి వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు ఈ కేసును పట్టించుకోలేదు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం రామోజీ అక్రమ డిపాజిట్ల దందాకు అండగా నిలిచింది. ఈ క్రమంలో 2018 డిసెంబర్‌లో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసును కొట్టివేయడం గమనార్హం.
అయితే డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన నాటి చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఉమ్మడి ఏపీ హైకోర్టు తీర్పును ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆ కేసులో ఇంప్లీడ్ అయింది. తద్వారా ఆ కేసు నిలిచేలా చేసింది.
మళ్లీ అదే కుతంత్రం..
రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ‘మార్గదర్శి’ అక్రమ డిపాజిట్ల దందాకు వత్తాసు పలుకుతోంది. ‘మార్గదర్శి’వి అక్రమ డిపాజిట్లేనని స్వయంగా ఆర్బీఐ నిగ్గు తేల్చడంతో రామోజీ కుటుంబం అడ్డంగా దొరికిపోయింది. ఈ కేసు విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించడంతో రామోజీ కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. దీంతో మీ అక్రమాలకు అండగా నేనున్నానంటూ చంద్రబాబు మరోసారి కుట్రలకు తెరతీశారు. అక్రమ డిపాజిట్లపై ప్రభుత్వ వైఖరిని చెప్పకుండా వీలైనంత జాప్యం చేసేలా కుట్ర పన్నుతున్నారు.
ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అఫిడవిట్ దాఖలు చేయాల్సి వస్తే ‘గోడ మీద పిల్లి’ వైఖరి అనుసరించాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక జిల్లాల వారీగా డిపాజిటర్ల వివరాల వెల్లడి, వారికి డిపాజిట్ మొత్తాన్ని చెల్లించారో లేదో పరిశీలన ప్రక్రియ చేపట్టే ఉద్దేశమే లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా పరిగణించాలని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్గదర్శి డిపాజిటర్లకు న్యాయం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment